breaking news
Defence Research and Development Organisation
-
వచ్చేస్తోంది ఐదో తరం ఫైటర్
న్యూఢిల్లీ: మారుతున్న యుద్ధతంత్రాలకు అనుగుణంగా అధునాతన ఐదోతరం యుద్ధవిమానాన్ని రూపొందించే బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అడ్వాన్స్డ్ మీడి యా కంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ–అమ్కా)గా పిలిచే నవతరం యుద్ధవిమానం మోడల్ తయారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆమోదముద్ర వేశారు. ఏఎంసీఏ ప్రాజెక్ట్‌లో భాగంగా గగనతలంలో మెరుపువేగంతో దూసుకుపోతూ శత్రు రాడార్లు, నిఘా వ్యవస్థలను ఏమారుస్తూ భీకర స్థాయిలో దాడి చేయగల మధ్యస్థాయి బరువైన ఐదో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయనున్నారు.కొత్త ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంతోపాటు స్థానిక వైమానిక తయారీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి ఇది బాటలు వేయనుందని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యం దక్కుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.‘‘ఈ ప్రాజెక్ట్‌ను స్వతంత్ర సంస్థలాగా లేదంటే జాయింట్ వెంచర్లాగా లేదంటే కన్సార్షియం మాదిరి నెలకొల్పి ప్రారంభించనున్నాం. ఈ కొత్త సంస్థను భారతీయ సంస్థగానే నమోదు చేస్తాం. పూర్తిగా భారతీయ చట్టాలు, నియమనిబంధనలకు లోబడే ఈ సంస్థ పనిచేయనుంది. ఏఎంసీఏ ప్రోటోటైప్ దేశీయ రక్షణరంగ సత్తాను చాటేలా ఉంటుంది. రక్షణరంగంలో స్వావలంబన, ఆత్మనిర్భరత సాధనలో ఇది మైలురాయిగా నిలవనుంది’’అని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.15,000 కోట్ల ఆరంభ వ్యయంతో మొదలు పెట్టనున్నారు.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయుసేన, నావికాదళం డిమాండ్లకు తగ్గట్లు ఏఎంసీఏ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతోంది. తేలికపాటి యుద్ధవిమానమైన తేజస్ తర్వాత మధ్యశ్రేణి బరువైన అడ్వాన్స్డ్ మీడియా కంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ త యారీ దిశగా భారత్ ముందడుగు వేయడం విశేషం. దీన్ని 2035కల్లా తయారు చేయాలని డీఆర్డీవో భావిస్తుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపింది. పదేళ్లలోపు తయారు చేస్తామని డీఆర్డీఓ పేర్కొంది. భిన్న రకాల బాంబులు అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులు, మందుగుండును అమర్చవచ్చు. ⇒ గైడెడ్ మిస్సైళ్లతోపాటు నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 1,500 కేజీల బరువైన బాంబులను సునాయాసంగా జారవిడవగలదు. ⇒ ఇది అత్యల్పస్థాయిలో విద్యుదయస్కాంత స్వ భావాన్ని ప్రదర్శిస్తుంది. దాంతో శత్రు రాడార్లు దీని జాడను కనిపెట్టడం చాలా కష్టం.మూడు దేశాల వద్దే ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఐదో తరం యుద్ధవిమానాలున్నాయి. ⇒ అమెరికా: ఎఫ్–22 రాప్టర్, ఎఫ్–35ఏ లైట్నింగ్– ఐఐ ⇒ చైనా: చెంగ్డూ జె–20 మైటీ డ్రాగన్, జె–35 ⇒ రష్యా: సుఖోయ్ 57ఇ సైలెంట్ కిల్లర్ కొత్త తరహా సెన్సార్ వ్యవస్థ, అంతర్గత ఆయుధ వ్యవస్థ, కమ్యూనికేషన్, నావిగేషన్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా అమ్కా ఫైటర్ జెట్ రూపుదిద్దుకోనుంది. ఇందులోని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... ⇒ అమ్కా మొత్తం బరువు 25 టన్నులు. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. సుదూరాలకు ప్రయాణించగలిగేలా 6.5 టన్నుల ఇంధనాన్ని విమానంలో నింపొచ్చు. ⇒ కొత్త యుద్ధవ్యూహాలకు తగ్గట్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా దూసుకెళ్లేలా దీనిని డిజైన్ చేస్తారు. ఇది ఏకంగా 55,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ⇒ కృత్రిమ మేధ సాయంతో దీనిని పైలట్ లేకుండానే భూమి మీద నుంచే నియంత్రించవచ్చు. ⇒ ఉపగ్రహాల నుంచి అందే రియల్‌టైమ్ డేటా ను విశ్లేషించుకుంటూ కొత్తరకం నెట్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ⇒ ఇది అన్ని రకాల వాతావరణాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరి్నరోధంగా దూసుకెళ్లగలదు. ⇒ శత్రు గగనతలంలోకి వెళ్లగానే ఎల్రక్టానిక్, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల సాయంతో వారి రాడార్లను పేల్చేసే ‘సీడ్’అనే ప్రత్యేక వ్య వస్థ ఈ విమానం సొంతం. అలా శత్రువుల క్షిపణి ప్రయోగ వ్యవస్థ నిర్విర్యమవుతుంది. మన యుద్ధవిమానాల పని సులువవుతుంది. ⇒ అమ్కా వేగంగా యాంటీ–రేడియేషన్ క్షిపణులను ప్రయోగించగలదు. ⇒ దీనిలో వాడే ఇంజన్‌ను విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాను్యఫ్యాక్చరర్ (ఓఈఎం)లతో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఏమిటీ ఐదో తరం? ⇒ 1940–50 దశకంలో తయారైన వాటిని తొలి తరం యుద్ధవిమానాలుగా పేర్కొంటారు. వీటిల్లో రాడార్లు ఉండవు. కేవలం మెషీన్ గన్ బిగించి ఉంటుంది. వేగమూ తక్కువే. ⇒ 1950–60 కాలంలో తయారైనవి రెండో తరానికి చెందినవి. ప్రాథమిక స్థాయి రాడార్ వ్యవస్థ వీటిల్లో ఉండేది. సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేవి. మిగ్–21, మిరాజ్–3 ఈ రకానివే. ⇒ 1970–80ల్లో తయారైనవి మూడో తరానికి చెందినవి. ఇవి శత్రు విమానాలను గాల్లోనే పేల్చేయగలవు. ఎఫ్–4, మిగ్–23, జాగ్వార్ ఈ కోవకు వస్తాయి. ⇒ 1980–90 కాలంలో తయారైనవి 3.5 తరానికి చెందినవి. వీటిల్లో డిజిటల్ వ్యవస్థలు వచ్చేశాయి. ఆకాశంలో 40 కి.మీ. దూరంలోని విమానాలను కూడా పేల్చేసే శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. ఎఫ్–5ఈ టైగర్2, మిగ్–21 బిసాన్ ఈ రకానివే. ⇒ 1990 తర్వాత నాలుగో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్నవన్నీ 4, 4.5 తరాలకు చెందినవే. -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ అవినాష్ చందర్ అన్నారు. పరిశోధన ఫలాలు సామాన్యులకు అందించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఆ దిశగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. సోమవారం అనంతపురం జవహల్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ-ఎ) పరిపాలన భవనంలో ఐదో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీసీ లాల్‌కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవినాష్ చందర్ హాజరై ప్రసంగించారు. భారతదేశంలో మేథో సంపత్తికి కొదవ లేదని, ఎంతో మంది ఇంజనీర్ల కృషి ఫలితంగా నేడు ‘అగ్ని’ వంటి క్షిపణులను స్వయంగా తయారు చేసుకోగలిగామన్నారు. ఇదే సమయంలో కొందరు వలసబాట పట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలోని మేథో సంపత్తిని సద్వినియోగం చేసుకుని దేశీయంగా ఆశించిన విజయాలు సాధించామన్నారు. ఇందుకు అనంతపురం జేఎన్టీయూకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాలే నిదర్శనమన్నారు. ప్రాచీన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్.. సాంకేతిక పరిజ్ఞానానికి హబ్‌గా వెలుగొందిందన్నారు. అదే సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించాలన్నారు. ఇంజనీర్లు అవిశ్రాంతంగా చేసిన కృషి షలితంగా దేశీయంగా అగ్ని, చంద్రయాన్, మంగళయాన్, జీఎస్ఎల్వీ, వివిధ రకాల యుద్ధ యంత్రాల తయారీ, ఆధునిక పరిశోధనలు సాధ్యమయ్యాయన్నారు. వాటి ఫలితాలను నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ పొందుతున్నామన్నారు. ఈ ఫలితాలతో సాంకేతిక రంగంలో భారత దేశం ఒక శాస్త్ర లీడర్‌గా నిలుస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన 200 ఉత్తమ పరిశోధనా సంస్థలలో భారత దేశానికి చెందిన ఒక్కదానికి కూడా చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆందోళన చెందారు. దేశంలో విద్యను అభ్యసించిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు ఇతర దేశాలకు వలసబాట పట్డడమే ప్రధాన కారణమన్నారు. ఇది ఎంతమాత్రం తగదని.. దేశీయంగా తమ ప్రతిభను చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో భాగస్వాములు కావాలని భావి ఇంజినీర్లకు సూచించారు. భాతరదేశ సాంకేతిక విజ్ఞాన పరిశోధనా రంగంలో పంజాబ్ యూనివర్శిటీ తర్వాత అనంతపురం జేఎన్టీయూ దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలుస్తోందన్నారు. దేశంలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన వారు డీఆర్డీఓలో కీలకంగా మారారన్నారు. అందుకు గతంలో అగ్ని ప్రయోగంలో ఏర్పడిన లోపాలను డిసెంబర్ 31వ తేదీ రాత్రికి రాత్రే బాలాసోర్ పరిశోధనా క్షేత్రాన్ని చేరుకుని క్షిపణి లోపాలను సరిదిద్దడమే నిదర్శనమన్నారు. విద్యాభ్యాసానికి దీటుగా పరిశోధనలకు జేఎన్టీయూ ప్రాధాన్యత ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయన్నారు. పరిశోధనలో నాణ్యతా ప్రమాణాల పెంపు పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేశామని జేఎన్టీయూ వీసీ లాల్‌కిశోర్ అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, నిధులను ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతోందన్నారు. సాంకేతిక విద్యకు చుక్కానిలా వర్శిటీని తీర్చిదిద్దామన్నారు. వర్శిటీలో 14 బీటెక్, 69 బీఫార్మా, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మా స్పెషలైజేషన్ కోర్సులు, 5 ఎమ్మెస్సీ, 3 ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ(పీబీ) కోర్సులు నడుస్తున్నాయన్నారు. ఎంఎస్‌ఐటీ కోర్సును నూతనంగా ఈ ఏడాది నుంచి ప్రారంభించామన్నారు. విదేశీ యూనివర్శిటీలతో అవగాహన ఒప్పందాలు, వీఎల్ఐసీ సిస్టమ్ డిజైన్, ఎంబేడెడ్ సిస్టమ్స్ లాంటి కొత్త ప్రోగ్రాంలను పరిచయం చేశామన్నారు. కలికిరిలో నూతనంగా వర్శిటీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ సుదర్శన్‌రావ్, రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, డెరైక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.