breaking news
defence projects
-
జనరేషన్ నెక్ట్స్ వార్‌కు సై...!
అత్యాధునిక యుద్ధతంత్రానికి భారత్ సై అంటోంది. దీనిలో భాగంగా ‘రాబోయే తరం’ యుద్ధరీతులకు త్రివిధ దళాలను సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పుచేర్పులకు అనుగుణంగా సైనికబలగాలు, ఆయుధాలను నవీకరిస్తోంది. సైనికపరంగా పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అంత కంటే సమర్థంగా తిప్పికొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ రెండు దేశాలతో భారత్‌కున్న సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. మానవరహిత మిలటరీ ట్యాంకులు, ఇతర యుద్ధ వాహనాలు, రోబోటిక్ ఆయుధాలతో సాయుధబలగాలకు కొత్త శక్తి చేకూరుస్తోంది. దీనితో పాటు కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్సులకు ‘నవతరం’ ఆయుధాలు సమకూరుస్తోంది. సైనిక అవసరాల కోసం కృత్రిమ మేధ వినియోగం ద్వారా నూతన ఆవిష్కరణలకు చైనా పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా దానికి తీసిపోని విధంగా ‘జనరేషన్ నెక్ట్స్’ యుద్ధతంత్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. సైనికఅవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐరోపాసంఘం భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అప్థనిస్తాన్, పాకిస్తాన్లలోని ఉగ్రవాద శిబిరాలను కృత్రిమమేథ ద్వారా పనిచేసేమానరరహిత డ్రోన్ల ద్వారా అమెరికా సమర్థవంతంగా ధ్వంసం చేస్తోంది. ఐటీ పారిశ్రామిక రంగంలో భారత్‌కు గట్టి పునాదులు ఉండడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడం మరింత సులువు కానుంది. ఈ కీలక ప్రాజెక్టులో డిఫెన్స్ రిసెర్చీ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ›ప్రధాన భూమిక పోషించనుంది. భూమి,ఆకాశం, సముద్రంలో.... ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మూడురంగాల్లో ( భూమి, ఆకాశం, సముద్రం) యుద్ధసన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు కృత్రిమ మేథ ప్రాజెక్టులను భారత్ ప్రారంభించింది. మానవరహిత ట్యాంకుల వంటి యుద్ధవాహనాలు, ఆకాశం నుంచి, నీటిలోనా ఉపయోగించేలా రోబోటిక్ ఆయుధాలు సమకూరుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ యుద్ధాలకు సంసిద్ధమయ్యేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ప్రవేశపెడుతున్నట్టు ఇటీవల సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్షన్ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం సైనిక బలగాలు, ప్రైవేట్‌రంగం మధ్య భాగస్వామ్యనమూనా అమలుచేస్తున్నట్టు చెప్పారు. రాబోయే నవ తరం యుద్ధరీతులను అందిపుచ్చుకోవాల్సి ఉన్నందున, భవిష్యత్ నిర్ణేతలో కృత్రిమమేథదే కీలకస్థానమన్నారు. ‘భవిష్యత్ అంతా అత్యాధునిక సాంకేతికత నేతృత్వంలోనే సాగాల్సి ఉంది. మరింతగా ఆటోమెటిక్ పద్ధతులు, రోబోటిక్ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో సైనికశక్తులుగా గుర్తింపు పొందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా కృత్రిమమేథ ద్వారా సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను మరింత పెంచుకుంటోంది. భవిష్యత్ యుద్ధాల్లో మానవరహిత యుద్ధవిమానాలు, నౌకలు,ట్యాంకులు,రోబోటిక్ రైఫిల్స్‌లను ఆయుధ వ్యవస్థలుగా భారత్ విస్తృతంగా ఉపయోగించబోతోంది. ప్రపంచ సైనికశక్తులతో పోల్చదగిన విధంగా దీని కోసం అవసరమైన శక్తియుక్తులు సమకూర్చుకుంటోంది’ అని అజయ్‌కుమార్ వెల్లడించారు.–సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రక్షణ రంగానికి రూ.27లక్షలకోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లకు గాను భారత రక్షణ రంగం, ప్రభుత్వాన్ని భారీ మొత్తంలో నిధులు కోరింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును ఎదుర్కొవడానికి, అవసరమైన ఆయుధాల ఆధునీకరణ, కొనుగోలుకు ఏకీకృత రక్షణపథకం కింద 2017-2022 నాటికి రూ. 26.84 లక్షల కోట్ల రూపాయల (416 బిలియన్ డాలర్లు) కేటాయింపును కోరింది. ఇందులో భాగంగా డీఆర్డీవోతో సహా వివిధ రంగాలకు చెందిన అధిపతులు జులై 10-11 న జరిగిన యూనిఫైడ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో 13 వ పంచవర్ష ప్రణాళిక సంఘానికి నివేదిక సమర్పించారు. ప్రణాళిక సంఘం ఆమోదం కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం. సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై జంక్షన్ సమీపంలో భారత్, చైనా బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నియంత్రణ రేఖల వెంట పాక్ జరుపుతున్న రోజువారి కాల్పులకు చెక్ పెట్టాలనే ఉద్ధేశంతో రక్షణాత్మకమైన ఖర్చులు కోసం ఈ అంచనాలు రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భద్రతా దళాల ఆధునికీకరణ ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యత ఉంటుందని సైనిక దళాలకు హామీ ఇచ్చారు. 2017-18 రక్షణ బడ్జెట్లో, రూ. 1,72,774 కోట్ల రెవెన్యూ వ్యయం ఉండగా అందులో, రూ. 86,488 కోట్లు కొత్త ఆయుధ వ్యవస్థలకు, ఆధునీకరణకు ఖర్చుచేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, రూ. 2.74 లక్షల కోట్లతో వేసిన రక్షణ బడ్జెట్, దేశ జీడీపీలో కేవలం 1.56 శాతం మాత్రమేనని, ఇది 1962లో చైనాతో జరిగిన యుద్ధ ఖర్చు కంటే అతి తక్కువ అని అన్నారు . భద్రతా బలగాలు రక్షణ బడ్జెట్ వారి కార్యాచరణ అవసరాల కోసం 2% వరకు పెంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 13 వ రక్షణ ప్రణాళిక ప్రకారం, భద్రతా బలగాల కోసం రూ.12,88,654 కోట్ల వ్యయం అంచనా వేయగా, రూ .13,95,271 కోట్లు ఖర్చుచేసింది. సాయుధ దళాల పరిస్థితి పూర్తిగా మెరుగుపరచడంతో పాటు ప్రతి సంవత్సరం పూర్తి స్థాయిలో నిధులు, పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత పదిహేనేళ్లగా భద్రత బలగాలు దీర్ఘకాలిక ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్ ప్రణాళికలు వేస్తున్నా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి ఆమోదం లభించడం లేదు.