breaking news
Debt Relief Scheme
-
రుణ విముక్తి పథకంపై ఇంకా సందేహాలే
రైతుల రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి డ్వాక్రా సంఘాల ట్రాక్ రికార్డ్ దెబ్బతింది స్పష్టం చేసిన ఎస్ఎల్బీసీ సాక్షి, హైదరాబాద్: ‘రుణ విముక్తి పథకంపై రైతుల్లో పెద్ద ఎత్తున సందేహాలున్నాయి. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో 20 శాతం నిధులను జమ చేసినా ఫలితం కన్పించడం లేదు. రుణం చెల్లించినా.. రెన్యువల్ చేసుకున్నా తక్కిన 80% నిధులు ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనన్న అనుమానాలూ రైతుల్లో ఉన్నాయి. అందుకే రుణాలు చెల్లించడం లేదు. రెన్యువల్ చేసుకోడానికీ రావడం లేదు. రైతుల్లో విశ్వాసం కల్పించి రుణాలు చెల్లించేలా, రెన్యువల్ చేసుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేదంటే రైతులు రాయితీ కోల్పోతారు. వ్యవసాయ బీమా పథకమూ దక్కకుండా పోతుంది’- అని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు సీవీఆర్ రాజేంద్రన్ అన్నారు. రుణమాఫీ కింద 20% నిధులు పొందిన రైతులందరి రుణాలనూ రెన్యువల్ చేయాలని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ‘రాజకీయ పార్టీల తరహాలో వ్యవహరిస్తే ఎలా?’ అంటూ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబ రావు బ్యాంకర్లపై విమర్శలకు దిగారు. మరో అడుగు ముందుకేసి ‘అసెంబ్లీలో విపక్ష నేత మాట్లాడిన తరహాలో బ్యాంకర్లు వ్యవహరిస్తే ఎలా? ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు అవకాశం ఇచ్చినట్లువుతుంది’ అన్నా రు. శుక్రవారం హైదరాబాద్‌లో రాజేంద్రన్ అధ్యక్షతన ఎస్ఎల్బీసీ 189వ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. డిపాజిట్ల కన్నా అధిక రుణాలిచ్చాం: రాజేంద్రన్ సమావేశంలో రాజేంద్రన్ మాట్లాడుతూ బ్యాంకుల్లో రూ.1,82,307 కోట్లు డిపాజిట్లుంటే.. రూ.2,11,381 కోట్లను రుణాలుగా మంజూరు చేశామన్నారు. డిపాజిట్లు, రుణాల నిష్పత్తి 100:115.95గా ఉందన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు డిపాజిట్లలో 60% కన్నా ఎక్కువ రుణాలివ్వకూడదన్నారు. డిసెంబర్ 31 నాటికి 1.15 కోట్ల మంది రైతులు వ్యవసాయ రుణాల రూపంలో రూ.97,915 కోట్లు బకాయి ఉన్నారని.. ఇందులో 50 లక్షల మంది రైతులు రూ.36,493 కోట్లు అధిక బకాయి(ఓవర్ డ్యూ) పడ్డారని.. 16.03 లక్షల మంది రుణాలు చెల్లించకపోవడంతో రూ.5,780 కోట్లు నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ)గా మారాయని వివరించారు. 2014-15లో రూ.56,019 కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిస్తే డిసెంబర్ 31 నాటికి రూ.22,443 కోట్లను పంపిణీ చేసినట్టు రాజేంద్రన్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 60% రుణాలే పంపిణీ చేయగలమన్నారు. రుణ విముక్తి కింద తొలి విడత విడుదల చేసిన రూ.4,680 కోట్లు, రెండో విడత రూ.2,315 కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రుణ విముక్తి పథకంపై రైతుల్లో ఇప్పటికీ సందేహాలున్నాయని రాజేంద్రన్ స్పష్టీకరించారు. రుణాలు చెల్లించినా.. రెన్యువల్ చేసుకున్నా తక్కిన 80 శాతం నిధులు ప్రభుత్వం ఇస్తుందో లేదోనన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రుణాలు చెల్లించక, రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల రైతులకు వడ్డీ రాయితీ కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెల్లింపులో ఉన్న ట్రాక్ రికార్డు రుణ విముక్తిని ప్రకటించిన తర్వాత పూర్తిగా దెబ్బతిందన్నారు. డిసెంబర్ 31 నాటికి 7,89,371 సంఘాలు రూ.13,844 కోట్లు బకాయి పడ్డాయన్నారు. రుణ విముక్తి అమలు చేయకపోవడం వల్ల అధిక సంఘాల్లో మహిళలు రుణాల చెల్లింపుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఫలితంగా 1,77,195 సంఘాల ఖాతాలు రూ.2,174 ఓవర్ డ్యూలో ఉన్నాయని.. 96,660 సంఘాలు రూ.888 కోట్లు చెల్లించకపోవడం వల్ల నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయన్నారు. రుణాలు రెన్యువల్ చేయాల్సిందే: మంత్రి ప్రత్తిపాటి రుణ విముక్తి పథకం అమలుపై సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే బాబు తొలి సంతకం చేశారని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బ్యాంకర్లు సహకరించాలని కోరారు. 2014-15లో 2 విడతలుగా రూ.7 వేల కోట్లను రుణవిముక్తి కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని.. 2015-16లో రుణ విముక్తి కింద రూ.4,320 కోట్లు బడ్జెట్లో కేటాయించామని వివరించారు. 20% నిధులు పొందిన రైతులు రుణాలను తక్షణమే రెన్యువల్ చేయాలన్నారు. రాజకీయ పార్టీల్లా మాట్లాడితే ఎలా?: కుటుంబరావు ‘అసెంబ్లీలో విపక్ష నేత మాఫీపై మాట్లాడుతున్న ట్టుగా ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ మాట్లాడితే ఎలాగం టూ రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబ రావు బ్యాంకర్లపై ఎదురుదాడికి దిగారు. రైతులు ఎంత బకాయిపడినా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టీకరించారు. సందేహాలు వద్దు: సీఎస్ కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. రుణ విముక్తిపై సందేహాలు వద్దని.. రుణ పంపిణీ తీరు బాగోలేదో? వసూళ్ల తీరు బాగోలేదో? విశ్లేషించుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. నాబార్డు సీజీఎం జీజీ మెమ్మన్ మాట్లాడుతూ.. 2015-16లో రూ.74 వేల కోట్లను రైతులకు రుణాలుగా ఇచ్చేలా ప్లాన్ చేశామని.. ఆమేరకు రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద వడ్డీ రాయితీని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. -
'సీఎంగా తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదు'
గుంటూరు: గ్రామాల్లో నిర్వహిస్తున్నరైతు సాధికారి సదస్సు పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్ల ద్వారా వచ్చిన సమాచారాన్ని పత్రంలో చేర్చి రైతులకు అందజేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఆ రుణ విముక్తి పత్రాల వల్ల పైసా కూడా ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పిడుగురాళ్ల మండలం కోనంకిలో రైతు సాధికార సదస్సు నిర్వహించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఈ సదస్సు తమకొద్దంటూ బ్యానర్లు చించివేశారు. 'సీఎం తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదని.. ఇక మీరిచ్చి బాండ్లు ఎలా చెల్లుతాయంటూ' రైతులు అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని అధికారులు వెనుదిరిగారు. -
రుణవిముక్తి పత్రమా.. టీడీపీ కరపత్రమా?
పెద్దాపురం : రైతు సాధికార సదస్సు పేరిట గ్రామాల్లో మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహించి, రైతులకు అందిస్తున్న రుణ విముక్తి పత్రాలు పైసా కూడా ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవి టీడీపీ కరపత్రాలుగా మారాయని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల నుద్దేశించి ఆత్మీయ సందేశాన్ని ఈ పత్రంలో పొందుపరిచి, అధికారులతో సభల్లో చదివి వినిపిస్తున్నారు. నెట్ల ద్వారా వచ్చిన సమాచారాన్ని పత్రంలో చేర్చి మొక్కుబడిగా రైతులకు అందజేస్తున్నారు. వీటిని అందుకుని రైతులు బ్యాంకులకు వెళితే అక్కడ ఈ కాగితాలు చూసి బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానంతో రైతులు బిక్కమొహం వేస్తున్నారు. కర పత్రం రూపంలో ఉన్న కాగితానికి విలువలేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పత్రాలు ఎవరూ ఇచ్చారో కూడా స్పష్టంగా లేదు. చంద్రబాబునాయుడి నమూనా సంతకంతో ఈ కరపత్రం ఉంది. కనీసం రైతు సాధికార సంస్థ అధికారుల సంతకం కూడా లేదు. ఏ ఖాతా నుంచి రుణమాఫీ సొమ్ము వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
‘రుణ విముక్తి’కి అర్హుల సంఖ్య 58 లక్షలు
* రూ.50 వేల లోపు రుణ ఖాతాలకు జనవరి 15 కల్లా విముక్తి! * ఈ నెల 18 నాటికి బ్యాంకు ఖాతాల్లోకి 20 శాతం నిధుల జమ * అర్హుల జాబితా అప్లోడ్ చేసేందుకు గడువు కోరుతున్న బ్యాంకులు * ‘రుణ విముక్తి’పై నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘రుణ విముక్తి’ పథకానికి తమను అర్హులుగా గుర్తించేందుకు రైతులు బ్యాంకులకు ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేందుకు గడువు గురువారంతో ముగియడంతో.. ఇక అర్హులైన వారి సంఖ్యను తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ప్రభుత్వం ప్రాథమికంగా.. రుణ విముక్తి పథకం కింద అర్హులైన వారి సంఖ్య 49.37 లక్షలుగా అంచనా వేసి ప్రకటించింది. ఆధార్, రేషన్ కార్డు తదితరాలు బ్యాంకులకు అందించని వారి సంఖ్య 13 లక్షలకు పైగా ఉందని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆధారాలన్నీ ఈ నెల 13 కల్లా బ్యాంకులకు అందించాలని అప్పట్లో సూచించడంతో రైతులు వాటిని బ్యాంకులకు సమర్పించారు. దీంతో తొమ్మిది లక్షల మంది ఖాతాలను అర్హులుగా గుర్తిస్తూ జాబితాలో చేర్చింది. మొత్తం 58 లక్షల మంది రైతులు రుణ విముక్తి పథకానికి అర్హులుగా ఇప్పటివరకు తేల్చినట్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు.డేటా అప్లోడ్ చేసేందుకు గడువివ్వాలని బ్యాంకులు కోరుతున్నందున అర్హుల జాబితా ఈ నెల 16 నాటికి ఖరారు చేసేందుకు ప్రభుత్వ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. ఆ తర్వాత ఫిర్యాదులు వస్తే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన కమిటీ మళ్లీ పరిశీలన జరపనుంది. ఈ నెల 18 నాటికి తొలి విడతగా 20 శాతం నిధుల్ని అర్హుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శుక్రవారం సమీక్షించనున్నారు. జనవరి 15 నాటికి రూ. 50 వేల లోపు రుణమున్న ఖాతాలకు మొత్తం జమ రుణ విముక్తికి అర్హులైన రైతుల్లో రూ. 50 వేల లోపు రుణమున్న ఖాతాలకు జనవరి 15 నాటికల్లా ఆ మొత్తమంతా జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఖాతాల సంఖ్యను గుర్తించి జాబితా రూపొందించే పని బ్యాంకులకు అప్పగించింది. తొలి విడతగా 20 శాతం నిధుల్ని జమ చేసేందుకు విధానాలను రూపొందించుకున్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తారు. బంగారు రుణాలకు తొలుత మినహాయింపునిచ్చినట్లు సమాచారం. బాండ్ల జారీ నెలాఖరు నుంచే.. ఈ నెలాఖరు కల్లా రైతులకు బాండ్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. రైతు సాధికారిక సంస్థ నుంచి ఈ బాండ్ల జారీకి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఇందుకోసం ట్యాంపర్ ప్రూఫ్ బాండ్ల తయారీ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రైవేటు ఏజెన్సీకి ప్రస్తుతం పాస్‌పోర్టులు తయారు చేసే కాంట్రాక్టు ఉన్నట్లు సమాచారం.