breaking news
Dayan Krishnan
-
కీచకులకు ఉరే సరి
నిర్భయ కేసులో వాదనలు పూర్తి దోషులకు మరణశిక్ష విధించాలన్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శుక్రవారం శిక్ష ఖరారు చేయనున్న కోర్టు న్యూఢిల్లీ: డిసెంబర్ 16 ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికీ మరణశిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కోరారు. దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ దోషులైన ముఖేష్(26), వినయ్‌శర్మ(20), పవన్‌గుప్తా(19), అక్షయ్‌ఠాకూర్(28)లకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో అత్యంత క్రూరమైన వారి ప్రవర్తన చూస్తే.. వారిలో పరివర్తన వచ్చే అవకాశమే లేదని స్పష్టమవుతోందని చెప్పారు. డిఫెన్స్ లాయర్లు మాత్రం వారికి క్షమాభిక్ష పెట్టాలని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా శిక్ష ఖరారుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నలుగురు దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులు దోషులే అని మంగళవారం సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, ఆధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు తదితర 13 అభియోగాల్లో నిందితులను దోషులుగా నిర్ధారించింది. సుదీర్ఘ వాదనలు: బుధవారం ఉదయం సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్భయ కేసులో దోషులకు శిక్ష ఖరారుపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణన్, ముఖేష్, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, అక్షయ్‌ఠాకూర్ తరఫున డిఫెన్స్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ నేరం అత్యంత రాక్షసమైనదే కాక, వారి ప్రవర్తన అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా ఉందని దయాన్ కృష్ణన్ గుర్తు చేశారు. ఇటువంటి మనుషుల్లో పరివర్తన వస్తుందని భావించడానికి అవకాశమే లేదన్నారు. వీరంతా నిస్సహాయురాలైన యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారని, తనను ప్రాణాలతో విడిచిపెట్టాలని బాధితురాలు కోరినా ఆరుగురు నిందితుల్లో ఎవరూ కనికరం చూపలేదని చెప్పారు. అందువల్ల దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ.. దోషులుగా తేలిన నలుగురికి మరణశిక్ష విధించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వారు మద్యం మత్తులో ఉన్నారు..: డిఫెన్స్ న్యాయవాదులు దోషుల తరఫు న్యాయవాదులు వాదనలు ప్రారంభిస్తూ.. నేరం జరిగిన సమయంలో పవన్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ ఘటన అప్పటికప్పుడు జరిగినది తప్ప ప్రణాళిక ప్రకారం జరిగింది కాదన్నారు. అక్షయ్ నిరపరాధని, రెండు నెలల క్రితమే అతను ఢిల్లీ వచ్చాడని తెలిపారు. వీరికి మరణశిక్ష విధిస్తే దేశంలో అత్యాచారాలు ఆగిపోతాయా అని ప్రశ్నించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. కోర్టు విచారణ ముగిసిన తర్వాత దోషుల తరఫున వాదించిన ఇద్దరు న్యాయవాదులపై కోర్టు కాంప్లెక్స్‌లోనే ఆందోళనకారులు దాడి చేశారు. రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలి: బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను చంపిన రేపిస్టులకు మరణ శిక్ష విధించాల్సిందే అని నిర్భయ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వారికి జీవించే హక్కు లేదని చెప్పారు. నిర్భయ కేసులో నలుగురికీ మరణశిక్ష తప్పదన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలపై ఈ కేసులో దోషి అయిన ముఖేష్ తరఫున ఆయన న్యాయవాది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. -
‘నిర్భయ’ను, స్నేహితుణ్ని హతమార్చాలనుకున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ 16న ‘నిర్భయ’పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డ నిందితులు, తమ ఘాతుకాన్ని ఎవరికీ తెలియకుండా చేసేందుకు బాధితురాలిని, ఆమె స్నేహితుడిని చంపాలనుకున్నారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణన్ శనివారం కోర్టుకు వెల్లడించారు. ఇనుప రాడ్‌తో బాధితురాలి పేగును ఛిద్రం చేసేశారని, ఫలితంగా తీవ్ర రక్తస్రావం జరిగి, ఆమె మరణించిందని వివరించారు. మొద్దుబారిన ఇనుపరాడ్లతో బాధితురాలిపైన, ఆమె స్నేహితుడిపై దాడిచేసి, దారుణంగా గాయపరచారని, వారిని హతమార్చే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు. జరిగిన ఘాతుకానికి సంబంధించిన వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు, వారు బాధితులిద్దరినీ తుదముట్టించాలనుకున్నారని అన్నారు. నిందితుల్లో మృతుడైన రామ్‌సింగ్, అతడి సోదరుడు ముకేశ్‌లతో పాటు వినయ్, అక్షయ్, పవన్, బాల నేరస్తుడు ‘నిర్భయ’పై కదులుతున్న బస్సులో అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. నిందితుల దాడిలో ‘నిర్భయ’ స్నేహితుడి కాళ్లు, చేతులు విరిగాయని చెప్పారు. బాధితులను దోచుకోవడమే కాకుండా, వారిని కదులుతున్న బస్సు నుంచి బయటకు తోసేశారని, తర్వాత వారి మీదుగా బస్సును నడిపేందుకు ప్రయత్నించారని తెలిపారు.