breaking news
darmabad
-
బాబ్లీ’లో పోలీసులపై దాడి కేసులో బాబుకు ఊరట
సాక్షి, ముంబై/హైదరాబాద్: మహారాష్ట్రలో 2010 జులై 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య అక్కడి పోలీసులపై దాడి చేశారని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసుల్లో తనకిచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ను ఉపసంహరించాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అనుమతించింది. నేరారోపణలు నిర్ధారణ అయ్యేంత వరకు వ్యక్తిగత హాజరు నుంచి కూడా చంద్రబాబుకు కోర్టు మినహాయింపునిచ్చింది. అయితే, ఇన్ని రోజులు కోర్టుకు హాజరు కానందుకు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. వారెంట్ ఉపసంహరణ కోసం చంద్రబాబు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అభయ్ శిఖరే హాజరయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నామంటూ అప్పట్లో చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్లి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. 2010 జులై 16వ తేదీన బాబ్లీ వద్ద నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను తరువాత పోలీసులు రద్దు చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అనంతరం ధర్మబాదులోని ఐఐటిలో ఉంచిన చంద్రబాబు తదితరుల భద్రతతోపాటు శాంతిభద్రతల దృష్ట్యా ఔరంగాబాదు సెంట్రల్ జైలుకు తరలించేందుకు జులై 20న ప్రయత్నించగా ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల మద్య పోలీసులపై దాడులు, ప్రభుత్వ పనులకు ఆటంకం తదితర సంఘటనలకు సంబంధించి కొత్త సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులోనే నాన్‌బెయిలబుల్ వారంట్‌ను కోర్టు జారీ చేసింది. -
నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్‌రేప్
ఎడపల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులో బుధవారం ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నిజామాబాద్‌లో నివసిస్తోంది. నిజామాబాద్‌కు చెందిన హుస్సేన్, రహీం, సల్మాన్ అనే ముగ్గురు కూలీలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. బుధవారం వారితో కలిసి జాన్కంపేటకు వెళ్లింది. అక్కడ నలుగురూ కలిసి మద్యం తాగారు. అనంతరం ముగ్గురు కలిసి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అస్వస్థతకు గురైన యువతిని భుజంపైన తీసుకుని వెళ్తున్న హుస్సేన్‌ను స్థానికులు గమనించి నిలదీశారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. బాధితురాలి చేయిపై బ్లేడ్‌తో చేసిన గాయాలున్నాయి. కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎడపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.