ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి
దంతెవాడ: ఇటీవల జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్ మరవకముందే మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుర్గం సమీపంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే జిల్లా రిజర్వ్ పోలీసు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు గోండ్‌పల్లి అడవుల్లో ఆపరేషన్ నిర్వహించాయని బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి చెప్పారు.
మంగళవారం రాత్రి ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిందని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో బలగాలు ఎదురుకాల్పులు చేశాయన్నారు. సాయంత్రానికి మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. ఘటనాస్థలి నుంచి ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించామని, వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారని మరో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామన్నారు.
అలాగే ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైఫిల్స్‌తో పాటు పేలుడు పదార్థాలు, తొమ్మిది కిట్ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ ప్రాంతంలో మరింతమంది మావోలు ఉండవచ్చన్న అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.