breaking news
Dairy technology courses
-
ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డెయిరీ కళాశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదువు పూర్తవకముందే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలో ప్రముఖ డెయిరీ సంస్థ అయిన జెర్సీ డెయిరీ డైరెక్టర్లంతా ఈ కళాశాల విద్యార్థులు కావడం విశేషం. రాష్ట్రంలోని వివిధ డెయిరీ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారంతా ఇక్కడ చదువుకున్నవారే.కామారెడ్డి పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 1978లో బీఎస్సీ డెయిరీ కోర్సును ప్రారంభించారు. ఇంటర్ చదివిన వారికి.. నేరుగా సాధారణ డిగ్రీ కోర్సుల్లా డెయిరీ కోర్సులో ప్రవేశం కల్పించేవారు. తరువాతి కాలంలో బీటెక్ డెయిరీ కోర్సుగా మార్పుచెంది.. ఎంసెట్ ద్వారా సీట్ల కేటాయింపు మొదలైంది. డెయిరీ కోర్సు ఎంచుకున్న వారికి.. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగిన డెయిరీ కోర్సును 2007 సెప్టెంబర్ 1న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి మార్చారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటయ్యాక పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వ విద్యాలయం పరిధిలోకి తీసుకువచ్చారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో.. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన 60 ఎకరాల భూమిని డెయిరీ కళాశాలకు కేటాయించారు. కాలేజీ భవనం, హాస్టళ్ల నిర్మాణాలకు రూ.11 కోట్లు మంజూరు చేసిన అప్పటి సీఎం వైఎస్సార్.. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కాలేజీ భవనంతో పాటు బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆడిటోరియం, ల్యాబ్‌లకు భవనాలు నిర్మించారు. పీజీ కోర్సులకు అవసరమైన మేర సౌకర్యాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి అదే భవనంలో కళాశాల కొనసాగుతోంది. ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థులు పాల పదార్థాలు తయారు చేసి.. డెయిరీ పార్లర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కోవా, దూద్‌పేడా, రసగుల్లా, గులాబ్‌జామ్ (Gulab Jamun) వంటివి తయారు చేసి విక్రయిస్తారు. వెయ్యి మందికి పైగా చదువు..కళాశాల స్థాపించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు 900 పైచిలుకు డెయిరీ కోర్సులు చదివారు. వారిలో చాలామంది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ డెయిరీ రంగంలో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదివిన వారిలో కొందరు విద్యార్థులు సొంతంగా డెయిరీ ఉత్పత్తుల సంస్థలను స్థాపించారు కూడా. మరెందరో వివిధ డెయిరీ సంస్థల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లోనూ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా విజయ డెయిరీ, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్లు వంటి ఉద్యోగ అవకాశాలు కూడా పొందే వీలుంది. రాష్ట్ర స్థాయిలో ఉపకార వేతనాలు, జాతీయ స్థాయిలో మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తారు. పీజీ కోర్సులు వస్తే మరింత ప్రయోజనం కళాశాలలో పీజీ కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా డెయిరీ కళాశాలలు లేవు. ఏకైక కామారెడ్డి కళాశాలలో పీజీ కోర్సులు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లి పీజీ కోర్సులు చదవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. చాలా మంది బీటెక్‌తోనే చదువును ఆపేస్తున్నారు. ఇక్కడే పీజీ కోర్సులు ప్రారంభిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు బీటెక్ డెయిరీ కోర్సు చదివిన వారెవరూ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. అందరికీ అనేక అవకాశాలు దొరుకుతున్నాయి. మా కళాశాలలో చదివినవారు ప్రపంచవ్యాప్తంగా డెయిరీ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని డెయిరీల్లోనూ మనవారే కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు సొంతంగా డెయిరీ సంస్థలు నెలకొల్పారు. ఏటా 40 మందికి ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఎంసెట్ ద్వారా డెయిరీ కోర్సులో 35 మందికి సీట్లు దక్కుతాయి. ఐదు సీట్లను రైతు విభాగాల కోటా ద్వారా భర్తీ చేస్తాం. – డాక్టర్ ఉమాపతి, కళాశాల డీన్ -
కౌన్సెలింగ్: కోర్సులు, కాలేజీల వివరాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రైవేటు కళాశాలల వివరాలను తెలియజేయండి? - సుప్రియా, అమీర్‌పేట ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందించే ప్రైవేటు కళాశాలలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష వీశాట్/ఎంసెట్/జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్‌ల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ.. ఎంటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) నాలుగేళ్ల బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని స్పెషలైజేషన్‌గా అందిస్తోంది. కేఎల్‌యూ ప్రవేశ పరీక్ష/ఎంసెట్/జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్ ఆధారంగా ప్రవేశాలుంటాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో మూడేళ్ల బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, రెండేళ్ల ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో బీటెక్‌లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందించే కళాశాలలు రెండు మాత్రమే ఉన్నాయి. అవి.. 1. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - బాపట్ల (గుంటూరు జిల్లా), 2.కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - పులివెందుల (వైఎస్సార్ జిల్లా). ఈ కళాశాలల్లో నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నారు. మొత్తం 45 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు. ఎంసెట్-2014లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 22 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు) మించరాదు. జేఎన్టీయూ- అనంతపురం, ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రభుత్వ రంగంలో రెండు కళాశాలలు మాత్రమే అందిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో.. కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (తిరుపతి), కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (కామారెడ్డి)లలో నాలుగేళ్ల బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. ఎంసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం ఉంటుంది. నేను పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను. లోకల్, నాన్ లోకల్ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? నాకు సీటు వస్తుందా? - రమ్య, కూకట్పల్లి వైద్య విద్యను అందించడంలో పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్ కోర్సులో మొత్తం 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 సీట్లు పుదుచ్చేరి విద్యార్థులకు (పుదుచ్చేరిలో కనీసం ఐదేళ్లు నివాసం ఉన్నవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఏడాది ఉండాలి) కేటాయించారు. మిగిలిన 110 సీట్లను జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 50 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్షలో ఓసీ విద్యార్థులు కనీసం 50 పర్సంటైల్, ఓసీ వికలాంగులు 45 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 40 పర్సంటైల్ సాధించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మీరు ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్‌లో సీటు పొందొచ్చు. నేను ఓసీ కేటగిరీకి చెందిన విద్యార్థినిని. నాకు పీజీఈసెట్-2014లో ఈసీఈ విభాగంలో 3599 ర్యాంకు వచ్చింది. ఉస్మానియా పరిధిలో ఏ కళాశాలలో నాకు సీటు లభించే అవకాశం ఉంది? - సంపూర్ణ, రాజేంద్రనగర్ గతేడాది పీజీఈసెట్ కౌన్సెలింగ్ డేటాను బట్టి మీకు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్- రంగారెడ్డి, అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ - హైదరాబాద్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ - రంగారెడ్డి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ - రంగారెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్- రంగారెడ్డి మొదలైన కళాశాలల్లో మీకు సీటు లభించే అవకాశం ఉంది.