బాబు ప్రచార ‘హారతి’
* పుష్కరాల్లో నదీ తీరానికి అభిముఖంగా నిత్యహారతి
* సంప్రదాయాలకు తిలోదకాలిస్తోందని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: గోదావరి పుష్కరాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాన్ని మూటగట్టుకోవాలన్న హడావిడిలో పడిన ప్రభుత్వం సంప్రదాయాలకు తిలోదకాలిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిపై భక్తివిశ్వాసాలతో పుష్కర పుణ్య స్నానమాచరించేందుకు లక్షలాదిగా వస్తున్న భక్తల నమ్మకాన్ని ఆ పావనవాహిని సాక్షిగా ప్రభుత్వం గాలికొదిలేసింది.
నిత్యహారతి జరుగుతున్న తీరే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. గోదావరికి నిత్యహారతి ఇవ్వడం ద్వారా నది ప్రాశస్త్యాన్ని చాటిచెప్పాల్సింది పోయి, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా చంద్రబాబు ఆర్భాటం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పుష్కర ప్రారంభ ఘట్టాన్ని డాక్యుమెంటరీగా తీయాలనే బాబు ప్రచార పటాటోపం 27 నిండు ప్రాణాలను బలిగొనేలా చేసింది. గోదావరి నిత్యహారతి కార్యక్రమాన్ని సంప్రదాయ విరుద్ధంగా నిర్వహించడమే ఈ అనర్థాలన్నింటికీ కారణమని ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు విమర్శిస్తున్నారు.
నిత్యహారతి ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న సాకుతో చంద్రబాబు దీని నిర్వహణ బాధ్యతను సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. గోదావరి నదిలో పంటును వేదికగా చేసుకుని రెండు వంతెనల నడుమ హారతి ఇస్తున్నారు. హారతి గోదావరి ఒడ్డుకు ఎంత దూరంలో, ఏ స్థాయిలో నిర్వహించాలనే దానిపై తర్జనభర్జనల అనంతరం చివరకు పంటుమీద వేదికను, పురోహితుడు నిలుచునే చోట గొడుగులు, ఇతర ఏర్పాట్లను గుంటూరుకు చెందిన సినీ ఆర్ట్ విభాగంతో చేయించారు.
ఈ మార్పుల తర్వాత నదిలో ఉండి తీరంవైపు చూపిస్తూ హారతి ఇస్తున్నారు. తద్వారా హారతి గోదావరికి కాకుండా తీరంపై ఉన్నవారికి హరతి ఇస్తున్నట్టుగా ఉంటోంది. ఈ ఏర్పాటు ద్వారా సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారని పండితులు ఆక్షేపిస్తున్నారు.
సంప్రదాయాలను విస్మరించరాదు
‘‘వేదవిహిత కర్మలు ఆచరించేటప్పుడు శాస్త్ర ప్రమాణాలను, సంప్రదాయాలను విస్మరించరాదు. సంప్రదాయాన్ని అనుసరించి చేసే కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయి. విస్మరిస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. భగవంతుడికి అభిముఖంగా ఎలా హారతి ఇస్తామో నదీమతల్లికి కూడా అలాగే ఇవ్వాలి. ఆచారాలను, సంప్రదాయాలను విస్మరిస్తే అనర్థం తప్పదు’’
- డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాజమండ్రి
అలా చేయడం అపచారమే
‘‘వేదమంత్రాలు వల్లె వేసినం త మాత్రాన సంప్రదాయబద్ధంగా జరిగినట్టు కాదు. ఆగమాల ప్రకారం గోదావరి హారతి జరగడం లేదు. తరతరాలుగా హరిద్వార్, కాశీ, హృషికేశ్ తదితర ప్రాంతాల్లో గంగా హారతి ఇస్తూనే ఉన్నారు. అక్కడ ప్రవాహానికి అభిముఖంగానే హారతి ఇస్తారు. గోదావరి హారతి సంప్రదాయానికి విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇది అపచారమే’’
- స్వరూపానందేంద్ర సరస్వతి, శారదాపీఠం, విశాఖపట్నం.