breaking news
credit rating agenices
-
కంపెనీల రేటింగ్ భేష్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. వాటి పరపతి రేటింగ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ కంపెనీల రేటింగ్‌లు అప్‌గ్రేడ్ కావడం దీన్ని తెలియజేస్తోంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 2024–25 సంవత్సరంలో 301 కంపెనీల రేటింగ్లను అప్‌గ్రేడ్ (అప్పటి వరకు ఉన్న రేటింగ్ కంటే మెరుగైనది) చేయగా, 150 కంపెనీల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. కంపెనీల రుణ పరపతి మెరుగుపడడం వరుసగా నాలుగో ఏడాది కావడం గమనార్హం. ‘‘బ్యాలన్స్ షీట్ల బలోపేతం వల్ల భారత కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడడం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంలో మేము విశ్లేషించిన 6,000 లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల నిర్వహణ లాభం ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్‌గా పెరిగింది. వాటి మొత్తం రుణం కేవలం 4 శాతమే పెరిగింది’’అని ఇక్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలిపారు. ఇక ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) సైతం 2024–25లో కార్పొరేట్ రుణ పరపతి మెరుగుపడినట్టు తెలిపింది. రేటింగ్‌ల డౌన్‌గ్రేడ్–అప్‌గ్రేడ్ నిష్పత్తి వరుసగా నాలుగో సంవత్సరంలోనూ చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నట్టు ప్రకటించింది. 2023–24లో ఉన్న 0.37 నుంచి 0.28కి మెరుగుపడినట్టు వెల్లడించింది. ఇండియా రేటింగ్స్ గత ఆర్థిక సంవత్సరంలో 330 కంపెనీల ఇష్యూలకు రేటింగ్లను అప్‌గ్రేడ్ చేయగా, 94 డెట్ ఇష్యూల రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. బలమైన బ్యాలన్స్ షీట్ల కారణంగా కార్పొరేట్ కంపెనీలు రుణ పరపతి ప్రయోజనం పొందుతున్నట్టు ఇండియా రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అరవింద్ రావు తెలిపారు. సానుకూల దృక్పథం మరో ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ సైతం గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో 423 కంపెనీలకు రేటింగ్ అప్‌గ్రేడ్ ఇవ్వగా, 160 కంపెనీలకు డౌన్‌గ్రేడ్ ఇచ్చినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో క్రిసిల్ రేటింగ్స్ క్రెడిట్ రేషియో 2.75గా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 2.64 రెట్లకు తగ్గింది. భారత కంపెనీలకు సంబంధించి రుణ నాణ్యత పరంగా సానుకూల దృక్పథంతో ఉన్నట్టు తెలిపింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డౌన్గ్రేడ్లను మించి అప్గ్రేడ్లు ఉంటాయన్న అంచనా వ్యక్తం చేసింది. ‘‘బడ్జెట్లో పన్ను తగ్గింపులు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పట్టణ వినియోగాన్ని పెంచనున్నాయి. దీన్నుంచి కార్పొరేట్ ఇండియా ప్రయోజనం పొందుతుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై చేస్తున్న మూలధన వ్యయాలు అనుబంధ రంగాలపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ సుబోధ్ రాయ్ వివరించారు. తాను రేటింగ్ ఇస్తున్న కంపెనీల మధ్యస్థ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8 శాతానికి పెరగొచ్చని క్రిసిల్ తెలిపింది. దేశీ డిమాండ్ బలోపేతంతో క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగం, రిటైల్ ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమైన రసాయనాలు, డైమండ్ పాలిషర్స్, ఆగ్రోకెమికల్స్ పనితీరును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. -
రుణాలపై సలహాలకు.. క్రెడిట్ అనలిస్ట్
రుణం కోసం బ్యాంకును ఆశ్రయిస్తే... మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి, మీకు రుణం మంజూరు చేయాలా? చేయొద్దా? ఒకవేళ చేస్తే ఎంతమేరకు ఇవ్వొచ్చు అనేది తేల్చిచెప్పే నిపుణులు అక్కడ ఉంటారు. వారే.. క్రెడిట్ అనలిస్ట్‌లు. వీరు రుణ దాతలు, గ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తుంటారు. కార్పొరేట్ యుగంలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి సర్వసాధారణంగా మారాయి. అందుకే క్రెడిట్ అనలిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. ఆర్థికాంశాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని తమ కెరీర్‌గా మార్చుకుంటే బ్రహ్మాండమైన అవకాశాలు, భారీ ఆదాయం సొంతం చేసుకోవచ్చు. సొంత ఏజెన్సీతో ఆదాయం పుష్కలం క్రెడిట్ విశ్లేషకులకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీఓ) రంగాల్లో కొలువులు దక్కుతున్నాయి. ఆసక్తి, అనుభవం ఉంటే సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకొనే అవకాశం కూడా ఉంది. దీంతో పనితీరును బట్టి అధిక ఆదాయం పొందొచ్చు. కార్పొరేట్ సంస్థలు తమకు కావాల్సిన రుణం కోసం బ్యాంకుల తలుపు తడుతుంటాయి. తమకు ఏ మేరకు రుణం అందుతుందో ముందే తెలుసుకోవడానికి క్రెడిట్ అనలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కంపెనీ బ్యాలన్స్ షీట్లు, ఫైనాన్షియల్ డేటా, న్యూస్ రిపోర్టులను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కంపెనీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలి. వ్యక్తులు కూడా రుణానికి సంబంధించిన సలహాల కోసం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి రంగంలో క్రెడిట్ అనలిస్ట్‌ల అవసరం ఉంటోంది. కావాల్సిన నైపుణ్యాలు: క్రెడిట్ అనలిస్ట్‌లకు మెరుగైన క్వాంటిటేటివ్, అనలిటికల్, ఆర్గనైజేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆంగ్ల పరిజ్ఞానం అవసరం. ఇంగ్లిష్‌లో రిపోర్ట్ రైటింగ్, ప్రజంటేషన్లను రూపొందించగలగాలి. ఈ వృత్తిలో డెడ్లైన్లు, ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే నేర్పు ఉండాలి. వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: ఎంబీఏ పూర్తిచేస్తే క్రెడిట్ అనలిస్ట్‌గా మారొచ్చు. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ సబ్జెక్టులు చదివినా ఎంబీఏ చేయొచ్చు. అయితే, క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ పెంచే సబ్జెక్టులు చదివితే ఈ రంగంలో సులువుగా రాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు బీటెక్, బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్హతలను కూడా కోరుకుంటున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చదివినవారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ లాంటి సర్టిఫికేషన్లను అభ్యసించి అర్హతలు, నైపుణ్యాలను పెంచుకోవాలి. వేతనాలు: క్రెడిల్ అనలిస్ట్‌లకు వేతనాలు అధికంగా ఉంటాయి. పేరొందిన కంపెనీలో చేరితే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. అనుభవం పెరిగేకొద్దీ ఈ ప్యాకేజీ బరువు కూడా పెరుగుతుంది. సంతృప్తికరమైన పనితీరు, ప్రతిభాపాటవాలతో సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) లేదా మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) స్థాయికి చేరుకోవచ్చు. పీజీ డిగ్రీ ఉండి, వృత్తిలో 20 ఏళ్ల అనుభవం కలిగిన సీఈఓకు ఏడాదికి రూ.40 లక్షలకు పైగా వేతన ప్యాకేజీ ఉంటుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)- అహ్మదాబాద్. వెబ్సైట్: www.iimahd.ernet.in - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- బెంగళూరు. వెబ్సైట్: www.iimb.ernet.in - యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in/du - డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ వెబ్సైట్: www.iitd.ac.in - ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్: www.icai.org - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.xlri.ac.in