breaking news
counterparts
-
తైవాన్ తెగువ.. చైనా ఏం చేస్తదో?
తైపీ: తైవాన్‌లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. తమదిగా చెప్తున్న భూభాగంలో అడుగుమోపడమే కాకుండా.. తమను కవ్విస్తే ఎలాంటి చర్యలకైనా ఉపేక్షించబోమంటూ ప్రకటనలు ఇస్తూ.. తైవాన్ సరిహద్దులో సైనిక డ్రిల్స్ నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఎప్పుడూ లేనిది తైవాన్ కొండంత బలం ప్రదర్శించింది. చైనాకు పోటీగా ఆయుధ సంపత్తి ప్రదర్శనకు దిగింది. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్ ఎఫ్-16వీ తో సైనిక విన్యాసాలు చేయించింది. ఈ యుద్ధవిమానాలు కూడా అమెరికా సహకారంతోనే రూపొందించినవి కావడం విశేషం. మొత్తం ఆరు F-16v యుద్ధవిమానాలు, అందులో రెండు మిస్సైల్స్‌ను ప్రదర్శిస్తూ తైవాన్ తూర్పు తీర ప్రాంతమైన హువాలెయిన్ కైంటీ నుంచి గగనతలంలో చక్కర్లు కొట్టాయి. చైనా కమ్యూనిస్ట్ దళాల సైనిక విన్యాసాల నుంచి ముప్పు నేపథ్యంలో.. జాతీయ భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రదర్శన అంటూ తైవాన్ బహిరంగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇలా ప్రదర్శనలకు దిగినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ధైర్యంగా నిర్వహించడాన్ని సాహసమనే చెప్పాలి. తైవాన్.. చైనా ఆక్రమణ ముప్పుతో నిత్యం భయం భయంగా గడుపుతోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడుతున్న ఈ ద్వీపం తమలో భాగమని, ఏదో ఒకరోజు.. అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని చైనా గతంలోనే ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు చైనా వ్యతిరేక దేశాలు తైవాన్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇక 90వ దశకం నాటి ఎఫ్-16వీ యుద్ధవిమానాల స్థానంలో.. అత్యాధునిక వెర్షన్లను తైవాన్‌కు కిందటి ఏడాది నవంబర్‌లో అందించింది అగ్రరాజ్యం. చైనా మీద తీవ్ర వ్యతిరేకతతో ట్రంప్ హయాంలో తైవాన్‌కు అన్నివిధాల మద్దతు అందిస్తున్న అమెరికా. ఇప్పుడు బైడెన్ హయాంలోనూ ఆ నైతిక మద్దతును కొనసాగిస్తోంది. ఇదీ చదవండి: కొడుకుతో రెస్టారెంట్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి, ఆపై.. -
చినుకు విలువ డాలర్!
► రొయ్యల రైతులు ఎదురు చూపులు ► సకాలంలో వర్షాలు పడితేనే దిగుబడికి అనుకూలం ► రొయ్య పిల్లలు స్టాక్ చేసిన రైతులు డాలర్ పంటగా పిలుచుకొనే రొయ్యల రైతులు ఇప్పుడు గాబరా పడుతున్నారు. సాగుకు ఎంతో కీలకమైన వర్షం ఉంటే రైతులు ఆనందంగా నాట్యం చేస్తాయి. చెరువుల్లో ఉప్పు శాతం తగ్గి పంటలో ఎదుగుదల ఉంటుంది. అంటే చినుకు పడితే ఇంట్లో డాలర్లు వచ్చినట్లేనని రైతులు ఆనంద పడతారు. వర్షానికి చెరువులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి చల్లబడుతుంది. ఎలాంటి రోగాలు కూడా రావు. పిల్లలు కూడా ఆహారం ఎక్కువగా తీసుకొని బలంగా పెరుగుతాయి. కానీ కొత్తపట్నం మండలంలోని రొయ్యల చెరువుల్లో ఇప్పటికీ వర్షపు నీరు నిలవలేదు. దీంతో రైతుల్లో నిస్తేజం అలముకుంది. కొత్తపట్నం: ఈ ఏడాది సీజన్లో వర్షం ముఖం చాటేసింది. వర్షం పడితే నేచురల్ ఫీడ్ అయిన ప్లైటోప్లాంటీన, జూప్లాంటీనాలు చెరువుల్లో ఉత్పత్తి అవుతాయి. దీంతో రొయ్యలు ఈ సహజమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని ఉత్పత్తి చేసే మేత తక్కువ తీసుంటాయి. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది. వరుణుడి కోసం ప్రార్థనలు మండలంలో 2200 ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. కాగా 1700 ఎకరాల్లో రైతులు రొయ్య పిల్లలు వదిలి వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తే 500 ఎకరాల్లో నీరు నింపాలని ఎదురు చూస్తున్నారు. ఆయా ప్రాంత నీటి తీరునుబట్టి సంవత్సరానికి రెండు సార్లు పిల్లలు వదిలి సాగుబడి చేస్తారు. ప్రధానంగా సముద్రపు నీరు, బోరు నీరు, వర్షం నీరు ఉంటే రొయ్యల సాగు లాభదాయంగా ఉంటుందని రైతులంటున్నారు. ఎకరాకు 2 లక్షల పిల్లలు జూన్ నుంచి అక్టోబర్ వరకు.. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరా చెరువుకు 1,50 లక్షల నుంచి 2 లక్షల వరకు రొయ్య పిల్లలు వదులుతారు. ఒక్కొక్క రొయ్య పిల్లను హేచరీల్లో 30 నుంచి 33 పైసలకు విక్రయిస్తారు. 4 నెలల 15 రోజుల వరకు పిల్లల్ని పెంచుతారు. ఒక్కో పిల్ల 20 నుంచి 30 గ్రాముల దాకా పెరుగుతుంది. 30 గ్రాములు పెరిగితే మాత్రం రైతుకు లాభం చేకూరుతుంది. అయితే వైరస్లు, డీఓ, చెరువులో పిల్లలు లేకపోవడం, ఇతర వ్యాధులు సోకడం వంటివి సంభవిస్తే భారీ నష్టం తప్పదు. బీడు భూముల్లో కోట్ల సిరులు వ్యవసాయ పంటలకు పనికరాని చౌడు భూముల్లో డాలర్ల పంట పండటం అదృష్టమే. సుమారు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రొయ్యలు ఉత్పత్తి చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా సాగుబడి పెరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోంది. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు కొన్ని వసతులు లేకపోవంతో నష్ట పోయారు. ఇలాంటి రైతులను ఆదుకోవాలని, సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలని అంతా కోరుకుంటున్నారు. వర్షం పడితే పంట బాగా వస్తుంది నేను నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నా. చెరువులకు నీరు నింపి వారం రోజులైంది. జూన్‌లో పిల్లలు వేయాల్సింది. రెండు నెలలు ఆలస్యం అయింది. నెలకు ఒక్కో పదును వర్షం పడితే పంట చేతికొచ్చి లాభం వస్తుంది. – పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల భారీగా నష్టపోతా... పది ఎకరాల్లో నీరు నింపా. వారం రోజుల్లో రొయ్య పిల్లలు స్టాక్ చేస్తా. వర్షం పడుతుందని నమ్మకంతో పిల్లలు ఒదులుతున్నాను. వర్షం పడకపోతే భారీగా నష్టపోతాను. పోయిన సారి కూడా వర్షం పడక భారీగా నష్టపోయా. – మూగ వెంకటేశ్వర్లు, కొత్తపట్నం