breaking news
Convention metro polis
-
వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగనున్న అంతర్జాతీయ సదస్సు ‘11వ మెట్రో పొలిస్ సదస్సు’కు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు సదస్సు జరుగనున్నప్పటికీ, 6వ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపేం దుకు, నగర బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నగర రహదారుల నుంచి వీధి లైట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు విడిది, పర్యటించే మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. వై ఫై, 4జీ సేవల్నీ అందుబాటులోకి తెస్తున్నారు. సదస్సులో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గురువారం (నేటి) వరకు సమయం ఉండగా, బుధవారం రాత్రి వరకు 1920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా, ఈ సదస్సులో ‘స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రో పోలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్, అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్’ అంశాలపై చర్చించనున్నారు. వీటిల్లో సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు.. సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నందున.. ఆయా ప్రభుత్వాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈమేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్ల మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జోహన్స్‌బర్గ్, బెర్లిన్, బార్సిలోనాకు చెందిన ప్రతినిధులు వీటిపై బాగా ఆసక్తి చూపుతున్నారు. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం.. ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిలో హైదరాబాద్‌ను ప్రత్యేక అంశంగా తీసుకొని కూడా చర్చిస్తారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్ బండ్‌పై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసా రం చేస్తారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజ రయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజు కారోజు నాలుగు పేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు. ప్రత్యేక విందులు.. ప్రతినిధులు, వీవీఐపీల కోసం 6వ తేదీన తారామతి బారాదరిలోను, 7న ఫలక్నుమాలోను, 8న జలవిహార్‌లో ప్రత్యేకంగా రాత్రి విందులు ఏర్పాటు చేశారు. ‘అర్బన్ హాకథాన్’ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయా లు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు. -
పల్లెలు, పట్టణాలనూ అభివృద్ధి చేయాలి
‘అర్బన్ ఫైనాన్స్’ వర్క్‌షాప్‌లో మంత్రి ఈటెల హైదరాబాద్: నగరాలతోపాటు పల్లెలు, పట్టణాలను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలో త్వరలో జరుగనున్న మెట్రో పొలిస్ సదస్సు సన్నాహకాల్లో భాగంగా సోమవారం ఇక్కడి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో ‘అర్బన్ ఫైనాన్స్’ అంశంపై జరిగిన ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగరాలు, పల్లెలు రెంటికీ ప్రాధాన్యమిస్తూ మానవీయ కోణంలో చేపట్టే చర్యలపై మెట్రోపొలిస్ సదస్సులో ఫోకస్ చేయాలని కోరారు. అభివృద్ధి కంటే భద్రత, ఉపాధి కల్పన తదితర అంశాలు కూడా ముఖ్యమేనన్నారు. నగరీకరణ అనివార్యంగా పెరుగుతోందని, నగర వాసుల జీవితం యాంత్రికంగా మారి మానవ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు, నిబంధనలు వ్యక్తులు, హోదాలను బట్టి కాకుండా అందరికీ ఒకేవిధంగా పక డ్బందీగా అమలు కావాలని అభిలషించారు. ప్రభుత్వాలు మారినా శాస్త్రీయంగా చేపట్టిన పథకాలు మారరాదని సూచించారు. మన్నికే ప్రధానం: తాగునీటి లైన్లు, డ్రెయినేజీల ఏర్పాటు వంటి ఏపనికైనా నాణ్యత పాటించకుంటే ఎన్ని నిధులు వెచ్చించినా నిష్ర్పయోజనమేనని మంత్రి తెలిపారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, ఫుట్‌పాత్‌లను ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ప్రజలు నగరాల వైపు ఉపాధి కోసం చూసే ధోరణి మారాలంటే పల్లెలు, పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. మెట్రోపొలిస్ సదస్సు నిర్వహించే అవకాశం ఆసియా దేశాల్లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. సదస్సు కోసం ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తున్నాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి, సీజీజీ డెరైక్టర్ జనరల్ కె. రామకృష్ణారావు, అడిషనల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ గంగయ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషనర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ‘రేషన్’పై నేడు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశమై సీఎంకు నివేదిక అందజేస్తుందన్నారు. ప్రస్తుతం రూపా యికి కిలో చొప్పున కుటుంబానికి ఇస్తున్న 30 కిలోల బియ్యాన్ని 35 కిలోలకు పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.