సినీ టాలెంట్‌కు బాసటగా జగపతి 'సీసీసీ'
హైదరాబాద్: సినీ నటుడు, నిర్మాత జగపతిబాబు తన ప్రొడక్షన్ హౌస్ 'జగపతి సినిమా' నుంచి రెండు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రారంభించిన టాలెంట్ పోర్టల్.. క్లిక్సినీకార్ట్(సీసీసీ) భాగస్వామ్యంతో ఈ చిత్రాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ చిత్రాల స్క్రిప్ట్ ఫైనల్ అయిన తరువాత దీనికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
క్లిక్సినీకార్ట్ ద్వారా సినీ రంగంలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం మాత్రమే కాకుండా.. ఫిల్మ్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ లాంటి విషయాల్లో సైతం సహాయసహకారాలు అందిస్తామని జగపతిబాబు వెల్లడించారు. త్వరలోనే 'సీసీసీ'కి సంబంధించిన ఆఫీసులను అమెరికా, బ్రిటన్లలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో టాలెంట్ ఉన్నవారు సైతం సినీ రంగంలో సరైన సంబంధాలు లేకపోవడం మూలంగా వెనుకబడి పోతుంటారనీ.. అలాంటి వారికి 'సీసీసీ' ఒక పరిష్కారమని జగపతి బాబు తెలిపారు. ప్రస్తుతం తమిళంలో భరతన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న ఆయన.. హీరో విశాల్ చిత్రంలో సైతం ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. కన్నడలోనూ మోహన్‌లాల్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు.