ఆన్లైన్ సరసాలు కొంప ముంచాయి!
కైరో: సౌదీ అరేబియాలో తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎంత భయంకరంగా శిక్షిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కోవకు చెందిన వార్తా కథనాలు ఇప్పటికే కోకొల్లలుగా వచ్చాయి కూడా. అయితే, తాజాగా తమ విశ్వాసాలకు, విలువలకు గండికొట్టాడంటూ ఆన్ లైన్లో వేరే దేశపు అమ్మాయితో చాటింగ్ చేసిన ఓ టీనేజీ యువకుడిని జైలు వేశారు. పెద్ద మొత్తంలో పూచీకత్తు కట్టిన తర్వాతే అతడిని విడిచిపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలో అబు సిన్ అనే ఓ యువకుడు ఉన్నాడు.
అతడి వయసు పద్దెనిమిదేళ్లు. అతడు కాలిఫోర్నియాలోని క్రిస్టినా క్రాకెట్ (21) అనే అమ్మాయితో యూ నౌ అనే ఆన్ లైన్ చాటింగ్ కమ్యూనిటీ ఫోరం ద్వారా కలుసుకున్నాడు. ఆన్ లైన్ లో పరిచయం పెంచుకున్నాడు. అతడికి ఆంగ్లం అంతంత మాత్రమే వస్తుంది. ఆమెకు అరబిక్ అస్సలు రాదు. అతడికి వచ్చిన అరకొర ఇంగ్లిష్తోనే ఏదో ఒకలా అమ్మాయితో సంభాషణ నెట్టుకొచ్చాడు. చక్కగా ప్రతి రోజు వీడియోలో మాట్లాడుకునే వారు. వారి మధ్య సాగిన సంభాషణ కూడా చాలా సరదాగా సాగడమే కాదు.. అది బయటకు వచ్చి అందరికీ తెలిసిపోయింది.
అందులో అతడు ఏం చెప్పాడంటే.. 'క్రిస్టీనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అందుకు క్రిస్టినా కూడా నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంది. అతడు ఇంకాస్త ముందుకెళ్లి కాస్త జోక్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ అమ్మాయి అందుకు కూడా కొద్ది సేపు ఆగమని చెప్పి అనంతరం వెడ్డింగ్ బ్యాండ్ చూపిస్తూ నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో అబూ సిన్ యస్ యస్.. థాంక్యూ వెరీ మచ్ అంటూ తిరిగి ఆమెతో అన్నాడు. ఇలా జరుగుతున్న వీరి సంభాషణ మొత్తాన్ని ప్రత్యేకంగా సోషల్ వెబ్ సైట్ల పర్యవేక్షణ చూసే మతపరమన అధికారిక టీం కాస్త కనిపెట్టింది. వెంటనే, ఈ విషయంపై అతడిని అరెస్టు చేసి జైలులో వేశారు. డేటింగ్లు, పరాయి స్త్రీలతో ఆన్ లైన్లో చాటింగ్లు మత విశ్వాసాలకు విరుద్ధం అని పేర్కొంది.