breaking news
Chimman Lal Jain
-
మద్యం ఆపకుంటే యమునా నదిలో దూకుతా
ఆగ్రా: గాంధీ జయంతినాటికి మద్యం అమ్మకం నిషేధించకుంటే తాను యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఓ 96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోథుడు అల్టిమేటం జారీ చేశాడు. ఎవరైనా తన బెదిరింపును ఖాతరు చేయకుంటే మద్యం అమ్మే షాపులను తగులబెట్టేందుకైనా వెనుకాడనని హెచ్చరించారు. ఆదివారం ఆగ్రా వీధుల్లో మద్యం నిషేధం కోసం డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు, యువకులు ర్యాలీలు తీయగా వాటిలో చిమ్మాన్ లాల్ జైన్ (96) అనే స్వాతంత్ర్య సమర యోధుడు పాల్గొన్నాడు. మద్యం ఎన్నో కుటుంబాలను కూల్చి వేస్తుందని, వారి జీవిత విధానాన్ని ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దేశాన్ని కాపాడండి. సిగ్గు తెచ్చుకోండి. ఆడ కూతుర్లను రక్షించండి' అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. 68 ఏళ్ల కిందట స్వాతంత్రం పొందిన రోజు ఆగ్రాలో కేవలం 11 లిక్కర్ షాపులు ఉండేవని, ప్రస్తుతం మాత్రం 1,100కు చేరుకున్నాయని తెలిపారు. మద్యానికి చేసే ఖర్చును ఒక్కసారి ఆపేసి ఆలోచిస్తే సామాన్య కుటుంబాలకు జీవనాధారమవుతుందని మరువరాదని అన్నారు. -
నిషేధించకపోతే...దూకేస్తా
ఆగ్రా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయ వాది చిమన్ లాల్ జైన్ గాంధీ జయంతి రోజు యమునా నదిలో దూకి ప్రాణ త్యాగం చేస్తానని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ సిటీ ఆగ్రాలో మద్యాన్ని నిషేధించకపోతే వచ్చే అక్టోబర్ 2న ఆత్మహత్య చేసుకుంటానన్నారు. మద్యానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆయన, మంగళవారం ఉదయం ఈ ప్రకటన చేశారు. దాదాపు 600 మంది మహిళలు, పురుషులతో కలిసి ఖతీక్ పారా బస్తీలో మద్యపాన వ్యతిరేక శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తాజ్ సిటీలో మద్యాన్ని నిషేధించేవరకూ తన పోరాటం ఆగదని చిమన్లాల్ స్పష్టం చేశారు. మద్య వ్యతిరేక ప్రచారానికి సంబంధించి చిమన్ లాల్ రూపొందించిన ఒక కార్యక్రమం ఆకాశవాణిలో మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుందని సామాజిక వేత్త రాజీవ్ సక్సేనా ప్రకటించారు. తాజ్ మున్సిపల్ మ్యూజియానికి తన చరఖాను బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు.