Chemical colors
-
మట్టి గణపతితో పుణ్యం, ఫలం : గణపతి బప్పా మోరియా!
గణనాధుని పూజించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువారి తొలి పండుగ, ఆది దేవుడైన గణపతి తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వేడుకలకు వాడ వాడలూ వినాయక మండపాలతో సిద్ధమై పోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడ చూసినా బాల గణపయ్యు, బొజ్జ గణపయ్యలు రక రకాల ఆకారాల్లో, సైజుల్లో కొలువు దీరాయి. నవరాత్రి ఉత్సవాలకు మేం రెడీ.. రారమ్మంటూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణ పరిరక్షకులు, నిపుణులు సూచిస్తున్నారు. మట్టి గణపతే, మేలైన గణపతి అని నినదిస్తున్నారు. ఈ మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నేళ్లుగా ప్రచారాన్ని చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.వినాయక మండపాల్లో అందం, ఆకర్షణ కోసం రంగురంగుల భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే చాలామంది మొగ్గు చూపుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనే ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా వ్యాపిస్తోంది. ఈ ధోరణే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. నవరాత్రులు, భక్తితో పూజించడమే ప్రామాణికమని పండితులు సైతం చెబుతున్నారు. పంచభూతాల సమాహారమైన మట్టి గణపతిని పూజించడం అంటే పంచభూతాలు, అధిష్టాన దేవతలు పూజిస్తున్నామని అర్థమని పండితులు చెబుతున్నమాట. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహిస్తే ప్రజలను, పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పిలుపునిస్తున్నారు.పీఓపీ విగ్రహాలతో అన్నీ అనర్థాలేప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల ద్వారా పర్యావరణానికి తీరని ముప్పు అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల అలంకరణకు వాడే రసాయన రంగులు మరింత ప్రమాదం కరమంటున్నారు. ఇవి నీటిని కలుషితం చేయడమే కాదు, అనేక రకాల రోగాలు మూలం అవుతాయి. రసాయ రంగులతో నిండిన విగ్రహాలు చెరువులు, వాగులు, నదుల్లో నిమజ్జనం చేస్తే అవి త్వరగా కరగవు. ఈ నీటిని తాగిన పశువులు, ఇతర జీవుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటితో నరాలపై ప్రభావం చూపి కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అనేక చర్మవ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ నీరు పంట పొలాల్లో చేరితే భూసారం దెబ్బతింటుంది. ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతాయి. అంతేకాదు పూజకు వాడిన పువ్వులను కూడా వృధాగా కాలువల్లో పారవేయడం కాకుండా, రీసైకిల్ చేయడంగానీ, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పీఓపీలో సల్ఫర్, జిప్సం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉంటాయి. రంగుల్లో పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్, సీసం, కార్బన్ ఉన్నాయి.వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే అవి విషపూరితం అవుతాయి. జలచరాలు ,వృక్షసంపదను చంపుతుంది. రసాయన రంగులతో అలర్జీ: ఈ రంగులు, మెరుపులు ఊపిరితిత్తులకు, కళ్లకు హాని కలిగిస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఒక్కోసారి తీవ్రమైన ఆగ్నిలొచ్చే ప్రమాదం కూడా ఉంది.మట్టి గణపతే మహాగణపతిపురాణాల ప్రకారం వినాయకుడిని పార్వతీదేవి మేని నలుగు మట్టితోనే తయారు చేసిందట. అందుకే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పూజించడం మంచిది. . సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంక మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవాలి. ఇవి నీటిలో ఆరు గంటల్లో పూర్తిగా ,సులభంగా కరిగిపోతాయి, అటు పశు పశుపక్ష్యాదులకు, పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు.తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అంతేకాదు, గణనాథుడిని పూజించే 21 రకాల పూజా పత్రి కూడా మట్టి నుంచే వస్తాయి కనుక మట్టిలో కలిసి, భూమిని సారవంతం చేస్తాయి.మట్టి గణపతినే ప్రతిష్టిద్దాం..జైబోలో గణేష్ మహారాజ్ కీ అంటూ నినదిద్దాం! తొలి పూజలందుకునే విఘ్న నాయకా ఈ సర్వజగత్తునూ కాపాడు తండ్రీ! అని మనసారా మొక్కుకుందాం! -
పూలు చల్లిన హోలీ
కెమికల్ కలర్స్ ఔట్... నేచురల్ కలర్స్ ఇన్ పూల నుంచి తోడిన రంగులతో హోలీ చిలకరింపులు అందంగా ఉంటాయి. మరి, ఆ పూల అచ్చులతోనే రంగులు అద్దుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం పూలు చల్లిన హోలీలా ఉంటుంది. ►ఫ్రాక్ అంతా పువ్వులు రంగులు అద్దుకోవడానికి ముట్టడి చేస్తే నడిచివచ్చే సౌందర్యం కళ్లను కట్టడి చేయాల్సిందే! ► టాప్ టు బాటమ్ పువ్వుల నవ్వులు తోడైతే వెస్ట్రన్ పార్టీలో వెలుగుల రవ్వలు విరజిమ్మాల్సిందే. ► రంగులన్నీ చేరి పువ్వులుగా మారి అవి ప్రింట్లుగా దర్శనమిస్తే పెరిగే వయసుకూ అడ్డుకట్టవేయాల్సిందే! వనితను వైవిధ్యంగా చూపాల్సిందే! ► అంతర్జాతీయ వేదికలైనా సరే పువ్వుల సింగారాలు దుస్తుల మీదకు చేరితే అందరి చూపులు అల్లుకుపోవాల్సిందే! ► పువ్వులు, లతలు జత చేరి అల్లుకుపోయాయంటే అవి లాంగ్ గౌన్‌కు కొత్త వన్నెలద్దాల్సిందే. అందంగా రూపుకట్టాల్సిందే! ► అమ్మాయి మేనిరంగుతో పోటీ పడాలని గులాబీల సోయగం ఫ్రాక్ మీద రూపు కడితే అవి నిలువెల్లా విరిజల్లులై మురిపించాల్సిందే! ► మోదుగపూల సింగారం తెల్లని టాప్ మీదకు చేరితే వాటికి పోటీగా పూలన్నీ రంగులను కుమ్మరించాల్సిందే! అవి మేనికి వసంతాన్ని మోసుకురావాల్సిందే! -
రసాయనం వద్దు... సహజం ముద్దు
హోలీ కేళీలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి రసాయన రంగులకు దూరంగా ఉండాలి బెంగళూరు: కొద్ది రోజుల్లో హోలీ పండుగ రానుంది. సగటు మెట్రో నివాసి జీవితానిని ఉత్సాహంగా సప్తవర్ణాల శోభను అద్దేందుకు రంగుల కేళీ హోలీ వచ్చేసింది. సప్తవర్ణ శోభితమైన హోలీకి స్వాగతం చెప్పడానికి నగర వాసులు కూడా హుషారుగా సన్నద్ధమయ్యారు. అయితే హోలీ రోజున కాసిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడడం ద్వారా చర్మానికి హాని జరక్కుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక హోలీ కారణంగా నీటిని వృథా చేసే పద్ధతికి కూడా స్వస్తి పలకాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల 5న హోలీ జరుపుకోనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక కథనం. సహజ రంగులతో హోలీ సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పెట్టేది చర్మ సమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలు కలిసి ఉండడమే. ఈ తరహా రంగులు శరీరంపై ఎక్కువ సేపు ఉంటే చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ తరహా రంగులు పొరపాటున పడితే కళ్లకు చాలా ప్రమాదం కూడా. అందుకే హోలీ ఆడే సమయంలో మనం ఎంచుకునే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు రసాయనాలు కలిపిన రంగులకు దూరంగా ఉండాలని వైద్యుల ఉవాచ. వీటికి బదులు సహజసిద్ధంగా తయారైన రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని స్కిన్ స్పెషలిస్ట్ సుహానా తెలిపారు. ‘రసాయన రంగులకు బదులు హెన్నా(గోరింటాకు పొడి), పసుపు, కుంకుమ, చందనం, టమాట గింజలతో తయారైన పొడి ఇలా సహజసిద్ధ రంగులను హోలీలో ఆడడం వల్ల చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు చర్మ సంబంధ వ్యాధుల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఒక వేళ రసాయన రంగులతోనే హోలీ ఆడాల్సిన పరిస్థితి ఉంటే కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి. నీటి విషయంలో జాగ్రత్త ఇక హోలీ వేళ నగరంలోని వివిధ షాపింగ్ మాల్స్, కూడళ్లతోపాటు అపార్ట్మెంట్లు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా రంగులను నీటిలో కలిపి చల్లుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో రంగులను కలపడానికి ఎంచుకునే నీరు పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశాలు చాలా తక్కువ. ఇక షాపింగ్‌మాల్స్ వంటి ప్రాంతాల్లో అయితే ఏదో దొరికిన నీటిలోనే రంగులను కలపడంతోపాటు ఒకసారి చల్లుకున్న రంగునీటిని మళ్లీ సేకరించి తిరిగి అదే నీటిని పైపుల ద్వారా పంపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అపరిశుభ్రమైన నీటిలో రంగులను కలిపి హోలీ ఆడడం వల్ల అనేక చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది వైద్యుల హెచ్చరిక. ఇక నగరంలో వేసవి ఛాయలు ప్రారంభమైన తరుణంలో హోలీ పేరిట నీటిని వృథా చేయవద్దని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు బదులుగా ‘డ్రై హోలీ’ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే మేలు రసాయనాలు కలిసిన రంగులతో హోలీ ఆడితే, వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయకండి. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోండి. ఎక్కువగా ఎరుపు, పింక్ రంగులనే హోలీ కోసం వాడండి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండడంతో శరీరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా శరీరంపై నుంచి తొలగిపోవు. హోలీ ఆడడానికి ముందు మీ ముఖానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోండి. దీని వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది. ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా క్లెన్సింగ్ మిల్క్ ఉత్తమం. చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్ కలిపి రాస్తూ ఉంటారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఎటువంటి ఆయిల్స్ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అడ్డుకోవచ్చు.


