breaking news
Chairperson municipality
-
పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల కూడా గడువక ముందే చాలా పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మునిసిపాలిటీలో గురువారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గగా మరో ఏడు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు జిల్లా కలెక్టర్లు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో అవిశ్వాస నోటీసుకు స్పందించిన కలెక్టర్ ఈ నెల 8న పాలకమండలిని సమావేశపరిచారు. అదేరోజు నల్లగొండలోనూ సమావేశం జరగనుంది. 11న మంచిర్యాల మునిసిపాలిటీ పాలకమండలి సమావేశం కానుండగా ఆ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, ఆ తరువాత గంటకే కొత్త చైర్పర్సన్, వీసీ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితోపాటు నస్పూర్ మునిసిపాలిటీ సమావేశం ఈ నెల 12న జరగనుంది. కాగజ్‌నగర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ సద్దాం హుస్సేన్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 20న సభ సమావేశం కానుంది. అలాగే ఈ నెల 19న సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ సమావేశం జరగనుంది. ఇంకా చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు ఇచ్చిన నోటీసులపై జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారు. అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికి సుమారు 15 మంది మునిసిపల్ చైర్పర్సన్లు కాంగ్రెస్‌లో చేరినా పదవీగండం తప్పేలా లేదు. మరికొన్ని చోట్ల నోటీసులకు సిద్ధం.. నల్లగొండ జిల్లాలో నల్లగొండ మునిసిపాలిటీతోపాటు నేరే డుచెర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ లతోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్లపో చంపల్లి, నిజాంపేట మునిసిపాలిటీలు, పీర్జాదిగూడ, జవహ ర్‌నగర్ కార్పొరేషన్లలో నోటీసులు జారీ చేసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరిన ఇందుప్రియపై బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసుకు సిద్ధమవుతోంది. కరీంనగర్లో జమ్మికుంట మునిసిపల్ చైర్‌పర్సన్‌పై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే రామగుండం కార్పొరేషన్లో అవిశ్వాసం ఆలోచన తమ సభ్యులకు లేదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అసమ్మతి సభ్యుల నుంచే.. సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా నాలుగైదు పాలక మండళ్లనే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పురపాలక చట్టం ప్రకారం పాలకమండలి మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండగా ఈ తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునిసిపల్ చట్టంలో మార్పులు చేసింది. అయితే అది గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో గతేడాది జనవరి 27 తరువాత 36 మునిసిపాలిటీలు, పలు కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అసమ్మతి సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వారికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తోడై చైర్పర్సన్లు, మేయర్లను గద్దె దించాలని ప్రయత్నించారు. అయితే గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పాలకమండళ్లను సమావేశపరచకపోవడం, ఈలోగా మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల్లో మళ్లీ కదలిక మొదలైంది. ‘ఆర్మూర్’చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన వినీత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారనే..! ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన 24 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. 2020 జనవరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా 33వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పండిత్ వినీత గెలిచారు. అప్పట్లో చైర్పర్సన్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చైర్పర్సన్ భర్త పండిత్ పవన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంప్రదించగా ఆయన సూచన మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన మునిసిపల్ చైర్పర్సన్ ఎంపికపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు. -
పురం.. ‘హస్త’ పరం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాలో నాలుగు పురపీఠాలు హస్తగతమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేటలలో కోరం లేక చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడగా, ఏకాభిప్రాయం కుదరక కోదాడ, మిర్యాలగూడ వైస్చైర్మన్ల ఎన్నిక కూడా జరగలేదు. భువన గిరి మున్సిపాలిటీని బీజేపీ, టీడీపీ కూటమి ద క్కించుకోగా, దేవరకొండ, హుజూర్నగర్ నగరపంచాయతీలతో పాటు మిర్యాలగూడ, కోదాడ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 13వ వార్డు కౌన్సిలర్ తిరునగరు నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థినిగా తిరునగరు నాగలక్ష్మిని 9వ వార్డు కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప ప్రతిపాదించగా, 33వ వార్డు కౌన్సిలర్ ఆలగడప గిరిధర్ బలపర్చారు. నాగలక్ష్మి పేరు ఒక్కటే ప్రతిపాదనకు వచ్చినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కాగా, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో మున్సిపల్ కోరం సరిపడా లేకపోవడంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ఆర్డీఓ ప్రకటించారు. కోదాడ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వంటిపులి అనిత ఎన్నికయ్యారు. మొత్తం 30మంది కౌన్సిలర్లకు గాను 28మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. టీడీపీకి చెందిన కౌన్సిలర్ సోమగాని ఖాజాగౌడ్,వైఎస్సార్సీపీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ తుమ్మలపల్లి భాస్కర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగానే టీడీపీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ పారా సీతయ్య లేచి తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ వారు కిడ్నాప్ చేశారని, వారిని తమకు అప్పగించే వరకు ఎన్నిక జరగడానికి వీలు లేదని ఎన్నికల అధికారి పోడియం ఎదుట బైఠాయించారు. ఆయనకు మద్దతుగా సీపీఎం నాయకుడు నయీం, ఇతర మహిళా కౌన్సిలర్లు పోడియాన్ని చుట్టుముట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. దాదాపు గంటసేపు గొడవ చేసినప్పటికీ ఎన్నికల అధికారి పోలీసుల సాయంతో వారిని వారి స్థానా ల్లో కూర్చోబెట్టారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా వంటిపులి అనిత పేరును 28వ వార్డు కౌన్సిలర్ వాడపల్లి వెంకటటేశ్వర్లు ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ రహేనా బలపర్చారు. ఆమెకు 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 23వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ తెప్పని శ్రీనువాస్తోపాటు ఎక్స్అఫీషియో సభ్యులైన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిలు మద్దతు తెలపడంతో మొత్తం 17మంది మద్దతు లభించినట్లయింది. వైస్‌చైర్మన్ ఎన్నిక సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేతో సహ కాంగ్రెస్ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. సభ్యులు తిరిగి రాకపోవడంతో కోరం లేదని ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సుర్వి లావణ్య (బీజేపీ), వైస్ చైర్‌పర్సన్‌గా బర్రె మహాలక్ష్మి (టీడీపీ) ఎన్నికయ్యారు. 30 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్‌కు చెందిన 25వ వార్డు కౌన్సిలర్ బి.వెంకటేశం సమావేశానికి హాజరుకాలేదు. చైర్మన్ పదవికి బీజేపీకీ చెందిన 15వ వార్డు కౌన్సిలర్ సుర్వి లావణ్య పేరును 28వ వార్డు కౌన్సిలర్ చందామహేందర్ ప్రతిపాదిం చగా 19వ వార్డు కౌన్సిలర్ పడమటి జగన్మో హన్‌రెడ్డి బలపరిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి మంజుల పేరును 29వ వార్డు కౌన్సిలల్ రాచమల్ల రమేష్ ప్రతిపాదించగా, 1వ వార్డు కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్ బలపరిచారు. ఇద్దరు పోటీపడడంతో ఓటింగ్ (చేతులు ఎత్తడం) పెట్టారు. దీనిలో లావణ్యకు 16ఓట్లు, మంజులకు 13 ఓట్లు వచ్చాయి.. దీంతో చైర్‌పర్సన్‌గా లావణ్య ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. వైస్ చైర్మన్‌కు జరిగిన ఎన్నికలో 13 వార్డుకు చెందిన బర్రె మహాలక్ష్మికి 16 ఓట్లు రాగా, సుధాకర్‌రెడ్డికి 13 ఓట్లు వచ్చాయిు. దీంతో మహాలక్ష్మి గెలిచినట్లు ప్రకటించారు. హుజూర్నగర్ నగరపంచాయతీ చైర్మన్‌గా జక్కుల వెంకయ్య (కాంగ్రెస్), వైస్‌చైర్‌పర్సన్‌గా ఎల్లావుల సీత (సీపీఐ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవి కోసం 16వ వార్డు కౌన్సిలర్ జక్కుల వెంకయ్య పేరును 6వ వార్డు సీపీఐ కౌన్సిలర్ జడ శ్రీనివాస్ ప్రతిపాదించగా, 17వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తన్నీరు మల్లికార్జున్ బలపరిచారు. ఒక్కరి పేరే ప్రతిపాదనకు రావడంతో వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైస్ చైర్మన్ పదవి కోసం 18వ వార్డు సీపీఐ కౌన్సిలర్ ఎల్లావుల సీత పేరును 3వ వా ర్డు కాంగ్రెస్ కౌన్సిలర్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించగా 12వ వార్డు సీపీఐ కౌన్సిలర్ జక్కుల నాగేశ్వరరావు బలపరిచారు. పోటీలో ఇతరులెవరూ లేకపోవడంతో సీతరాములును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దేవరకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా కేతావత్ మంజ్యానాయక్ (కాంగ్రెస్), వైస్ చైర్మన్‌గా నల్లగాసు జాన్‌యాదవ్ (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 20వార్డులకు అందరూ హాజరయ్యారు. చైర్మన్ అభ్యర్థిగా మంజ్యానాయక్ పేరును జాన్‌యాదవ్ ప్రతిపాదించారు. ప్రతిపాదన ఒక్కటే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. వైస్‌చైర్మన్‌గా నల్లగాసు జాన్‌యాదవ్ పేరును బత్తుల అమర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులు బలపర్చారు. దీనికి కూడా పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట లలో సస్పెన్స్ థ్రిల్లర్ నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఎన్ని క సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. నల్లగొండ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి అవసమైన మెజారిటీ కాంగ్రెస్‌కు ఉన్నా, ఎన్నిక వా యిదా పడడం గమనార్హం. 40 స్థానాలున్న నల్లగొండలో 21మంది సభ్యులు ఉంటే చాలు. కాం గ్రెస్‌కు 22మంది సభ్యులతోపాటు, ఎమ్మెల్యే ఓటును కలిపితే మెజారిటీ 23 ఓట్లు ఉన్నా, కాం గ్రెస్ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. టీఆర్ఎస్, సీపీఎం, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు అంతా కలిపి 18 మంది కౌన్సిలర్లు ఏకతాటిపైకి వచ్చారు. తమందరి తరఫున టీఆర్ఎస్నుంచి ఒకరిని చైర్పర్సన్ పదవికి పోటీ దించాలని నిర్ణయించారు. ఇంకా అవసరమైన ఓట్లు కాంగ్రెస్‌లోని కొందరు తమ కు సహకరించడం వల్ల వస్తాయని ప్రకటిం చారు. దీంతో కాంగ్రెస్ శిబిరంనుంచి ఎవరూ చేజారిపోకుండా మూడు రోజులుగా హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహించారు. తీరా నల్లగొం డకు చేరాక, వెనక్కి తగ్గారు. కాంగ్రెస్‌లోనే చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య మూడు నాలుగు ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి భారీ కసరత్తే చేశారు. అయినా, ఏకాభిప్రాయం కుదరలేదని, ఫలితంగా అసంతృప్త సభ్యులు బయటకు వెళ్లిపోతే మున్సిపాలిటీ చేజారుతుందన్న భావనతో సభ్యులందరినీ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేటలో చక్రం తిప్పారు. సూర్యాపేటలో 34 వార్డులకు గాను, 18 మంది సభ్యులు ఉంటే మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చు. టీడీపీ, సీపీఎం మిత్రపక్షంగా, టీఆర్ఎస్, సీపీఐ ఒక కూటమిగా, బీజేపీ, కాంగ్రెస్‌లు వేర్వేరుగా పోటీచేశాయి. టీడీపీ- 12 , కాంగ్రెస్ -9, టీఆర్ఎస్ - 4, బీజేపీ-4, సీపీఎం-2, సీపీఐ-1, ఇండిపెండెంట్లు -2 చొప్పున గెలిచారు. అయితే, టీఆర్ఎస్ తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. మంత్రి జగదీష్‌రెడ్డి చక్రం తిప్పడంతో కాంగ్రెస్ శిబిరం ఖాళీ అయ్యింది. 9 మం ది సభ్యుల్లో ఆ పార్టీకి మిగిలింది కేవలం ము గ్గురు. టీడీపీ నుంచి ఇద్దరిని లాగేసుకున్నారు. సీపీఐకి ఉన్న ఒక ఓటుతో, ఎమ్మెల్యే ఓటు సహా టీఆర్ఎస్కు ఉన్న ఓట్లు, స్వతంత్రుల మద్దతు అన్నీ కలిపి టీఆర్ఎస్ చేతిలో ఇప్పుడు 19 ఓట్లున్నాయి. అయినా, మరో ముగ్గురు నలుగురు సభ్యులను తమవైపు తిప్పుకున్నాక ఎన్నికకు పోతే ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న వ్యూహం తోనే గైర్హాజరయ్యారని, దీంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.