breaking news
Central RTI Act
-
కట్టుకథలే రాజ్యమేలుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా ప్రజాస్వామిక వాతావరణం లేదని, అబద్ధాలు, కట్టుకథలతో రాజ్యమేలుతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణారాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రచయితలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే పరిస్థితి లేదని, దళితులు, అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయని చెప్పారు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మూడు రోజుల పాటు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనకు దిగే అవకాశం లేకుండా పోయిందని ఆమె చెప్పారు. దళితులపై దాడులు కొనసాగుతున్నాయని, రోహిత్ వేముల ఆత్మహత్య ఇందులో భాగమేనన్నారు. బెంగళూర్‌లో గౌరీలంకేశ్‌ను చంపేశారని, తమిళనాడులో పెరుమాళ్ మురుగన్‌ను దాదాపుగా సామాజిక బహిష్కరణ చేశారని, ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు వాటి చుట్టూ అనేక కట్టుకథలను ప్రచారం చేస్తూ అసలు నిజాలను మరుగున పడేస్తున్నారన్నా రు. సమానత్వం, ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగే ఉద్యమాలను బలోపేతం చేయాలని, అలాంటి నిజమైన కథనాలకు మీడియా ప్రచారం కల్పించాలని కోరారు. గౌరీలంకేశ్‌ను చంపిందెవరో తెలుసు హత్యకు గురైన జర్నలిస్టు గౌరీలంకేశ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో హైదరాబాద్ బుక్ ట్రస్టు అధ్యక్షులు గీతారామస్వామి, తమిళ రచయితలు పెరుమాళ్ మురుగన్, కణ్ణన్ సుందరం పాల్గొన్నారు. ‘గౌరీలంకేశ్‌ను ఎవరు హతమార్చారనే విషయంలో సందేహా ల్లేవు. గుజరాత్లో మారణహోమం సృష్టించిన పాలకులే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతు న్న ప్రజాస్వామికవాదుల హత్యలకు కారకులు’ అని గీతారామస్వామి ఆరోపించారు. పెరుమాళ్ ‘పూనాచీ’ ఆవిష్కరణ.. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘పూనాచీ’(మేక కథ) పుస్తకాన్ని లిటరరీ ఫెస్టివల్లో ఆవిష్కరించారు. మురుగన్ రాసి న ‘హాఫ్ విమెన్’ నేపథ్యంలో దాడులు జరగడంతో ‘మురుగన్ అనే రచయిత చనిపోయాడు’ అని ఆయన ప్రకటించారు. హైకోర్టు ఆయన రచనలు చేసేందుకు అనుమతివ్వడంతో పూనాచీని ఆవిష్కరించారు. కాగా లిటరరీ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. ఈ వేడుకల్లో సుమారు 10 వేల మంది పాల్గొన్నారు. ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరైంది. భారతీయ భాషగా కన్నడపై విస్తృత చర్చలు జరిగాయి. సమాచారం పొందలేకపోతున్న ప్రజలు ‘స్క్రోల్స్, ట్రోల్స్ అండ్ పోల్స్: ఇన్ఫర్మేషన్ అండ్ డెమొక్రసీ ఇన్ ఇండియా’అనే అంశంపై కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడారు. సామాన్య ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్ని పొందలేకపోతున్నారని, ప్రభుత్వం మాత్రం ఆధార్ సాకుతో ప్రజల వ్యక్తిగత జీవితాన్ని, అన్ని వివరాలను సేకరించి పెట్టుకుందన్నారు. మీడియా కూడా వ్యక్తుల గోప్యతకు, దేశ భద్రత వంటి అంశాలపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. 1960 నుంచి ఇటీవల వర కు క్రికెట్‌ను, సమాజాన్ని ప్రభావితం చేసిన 11 మంది క్రీడాకారుల గురించి తాను రాసిన ‘డెమొక్రసీస్ లెవెంత్: ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకంపై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడారు. ఒకప్పుడు ఆటవిడుపు కోసం మొదలైన క్రికెట్ ఆ తర్వాత యావత్ సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప క్రీడాకారులను అందజేసిందన్నారు. -
కమిషనర్లు లేకపోవడం విచారకరం
స.హ.చట్టం అవగాహన సదస్సులో మాడభూషి శ్రీధర్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టానికి కమిషనర్లు లేకపోవడం విచారకరమని, వారి నియామకానికి ఆ రాష్ట్రాల సీఎంలు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ తెలిపారు. నోట్లరద్దుతో కోట్లాది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనిపై స.హ.చట్టం ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించింది కేవలం ఐదుగురేనని చెప్పారు. దేశంలోని పౌరులంతా మౌనంగా ఉంటున్నారని, సమస్యలపై ప్రశ్నించినవారే చరిత్ర సృష్టించగలరని సూచించారు. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో స.హ.చట్టం–2005పై నిర్వహించిన అవగాహన సదస్సుకు శ్రీధర్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నీ ప్రజలకు కనిపించేలా డిస్ప్లే చేయాలన్నారు. ప్రజా సమస్యలపై అందరూ స్పందించినప్పుడే సుపరిపాలన సాధ్యపడుతుందన్నారు. ఏఏ పనులు చేశారని రాజకీయ నాయకులను ప్రజలు నిలదీసే రోజు రావాలని ఆకాంక్షించారు. నేటికీ ఓటు సరిగా వేయడంరాని ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారన్నారు. స.హ.చట్టంపై అవగాహన లేనివారు చాలామందే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స.హ.చట్టం వికాస సమితి గౌరవ అధ్యక్షుడు కాచం సత్యనారాయణగుప్త, వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.