breaking news
Center Team
-
కేంద్ర శాఖల కార్యదర్శులతో ఏపీ బృందం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పెండింగ్ సమస్యలపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం సోమవారం భేటీ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర కార్యదర్శుల బృందాన్ని కోరింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం కోరింది. కేంద్ర కార్యదర్శుల బృందం దృష్టికి తీసుకెళ్లిన వివరాలివే.. ►కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ►రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ►2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ►విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ►జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ►కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. కాగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. అనంతరం సమస్యల పరిష్కారానికి కార్యదర్శులతో ప్రధాని మోదీ కమిటీ ఏర్పాటు చేశారు. -
సాయం కోసం ఎదురుచూపులు
హుద్‌హుద్ బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పునర్ నిర్మాణం పేరిట సంబరాలకు కోట్లు కుమ్మరించిన ప్రభుత్వం కూడా నిధుల కోసం కేంద్రం వైపే చూస్తోంది. తుపాను మర్నాడే కేంద్రం తక్షణ సాయం వెయ్యికోట్లు ప్రకటించినా రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో పరిహారం పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మంగళవారం నుంచి పర్యటించనుంది. దీనిపైనే జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క నిలదీసేందుకూ సిద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను ఫలితంగా విభాగాల వారీగా ట్రాన్స్‌కోకు అత్యధికంగా రూ.1020.88 కోట్ల నష్టం వాటిల్లింది. పాక్షికంగా, తీవ్రంగా, పూర్తిగా దెబ్బ తి న్న ఇళ్లు లక్షా 43 వేల 761 ఉన్నాయి. వీటికి రూ.75.99కోట్లు అవసరమవు తుందని అంచనా. 34,180.22హెక్టార్లలో రూ.49.18కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. 55,334.608 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. ఫిషరీస్ డిపార్టుమెంట్‌కు రూ.38.06కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.124.78కోట్లు నష్టం వాటిల్లగా, వివిధ డిపార్టుమెంట్లకు రూ.7,986.20కోట్ల నష్టంవాటిల్లినట్టుగా లెక్క తేల్చారు. ఇదంతా ప్రభుత్వపరంగా జరిగిన నష్టమైతే పారిశ్రామిక రంగానికి 50వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. ఇలా దాదాపు రూ.65వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన రాష్ర్ట ప్రభుత్వం రూ.21.640.63 కోట్ల సాయం చేయాల్సిందిగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. తుపాను వచ్చిన మూడో రోజునే విశాఖ వచ్చిన ప్రధాన మంత్రి రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. రూ.450 కోట్లు రాష్ర్ట ప్రభుత్వానికి విడుదల చేసిందని చెబుతున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు. దీంతో పరిహారంఅందక ఆదుకునే వారు లేక బాధితులు అల్లాడిపోతున్నారు. నెలన్నర తర్వాత వస్తున్న కేంద్రం బృందం క్షేత్ర స్థాయిలో చూసేది ఏమీ లేకున్నా ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వీరు ఇచ్చే నివేదికను బట్టే కేంద్రం సాయం ప్రకటించే అవకాశాలుండడంతో జిల్లా ప్రజలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ బృందం పర్యటనపైనే ఆశలు పెట్టుకుంది. కేంద్ర బృందం పర్యటన సాగిదిలా: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పాఠక్ నేతృత్వంలోని ఎనిమిది సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం విశాఖకు చేరుకోంది. తొలుత ఎయిర్ పోర్టుకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించి నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని తుఫాన్ నష్టం ఫోటోఎగ్జిబిషన్ను తిలకిస్తుంది. మర్నాడు ఉదయం నగరంలో నష్టాన్ని చూసి మధ్యాహ్నం అనంతగిరి వెళ్తుంది. 27న పరిశ్రమలులు..గ్రామీణ జిల్లాను పరిశీలిస్తుంది. బృందం పర్యటనకు ఏర్పాట్లు సాక్షి,విశాఖపట్నం: కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. నష్టాలపై బృందానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. ప్రభుత్వం తరపున నష్టాలను నివేదించేందుకు రాష్ర్టమంత్రిఒకరు రానున్నారని, రాష్ర్టవిపత్తుల నిర్వహణ కమిషనర్ కూడా పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాలపై జిల్లాకలెక్టర్ కార్యాలయంలో 28వ తేదీమధ్యాహ్నం వివరించి ఒక నివేదిక అందజేయనున్నట్టుకలెక్టర్ తెలిపారు. నాలుగు జిల్లాల్లో వివిధశాఖలకు తుఫాన్ కారణంగా రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.