క్యాష్‌లెస్ సొసైటీ సాధ్యమా?
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసింది నల్లడబ్బును నిర్మూలించడంతో పాటు టెర్రరిజాన్ని అరికట్టేందుకు కూడా... అంటూ పదే పదే చెబుతూ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు టెర్రరిజానికి బదులు క్యాష్‌లెష్ వ్యవస్థను తీసుకరావడం కోసం అని చెబుతున్నారు. నిరక్షరాస్యతతోపాటు మొబైల్ ఫోన్లు ఎక్కువ వినియోగంలో లేని భారత్ లాంటి దేశంలో క్యాష్‌లెస్ సొసైటీ (నగదు రహిత ఆర్థిక లావాదేవీలు) సాధ్యమయ్యే పరిస్థితి ఉందా?
2016, జనవరి నెలనాటి లెక్కల ప్రకారం దేశంలో 61,60 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో 15,40 కోట్ల మందికి మాత్రమే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. మొత్తం మెబైల్ ఫోన్లలో 34.20 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. దాదాపు దేశంలోని 70 కోట్ల మంది ఎలాంటి మైబైల్ ఫోన్లు లేవు. నగదు రహిత ఆర్థిక లావాదేవీలను ఎక్కువ నిర్వహించే బ్యాంకుల యాప్స్‌ను ఉపయోగించాలంటే ఇటు స్మార్ట్‌ఫోన్, అటు ఇంటర్నెట్ సౌకర్యం తప్పనిసరి. స్మార్ట్ఫోన్లు ఉన్న 15.40 కోట్ల మందికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉందనుకుంటే అంతమంది మాత్రమే మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలరు. మరి మిగతా వారి సంగతి ఏమిటీ? 61,60 కోట్ల ఫోన్లలో కేవలం 13 శాతం మాత్రమే మొబైల్ ఫోన్లు కలిగిన గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమిటీ? ఏ ఫోన్ సౌకర్యం ఉండని నిరక్షరాస్యుల గతి ఏమిటీ ?
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవాళ్లంతా క్యాష్‌లెస్ సొసైటీకి ముందుగా మారితే, మున్ముందు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు సౌకర్యాలను మిగతా ప్రజలు అందిపుచ్చుకుంటారని, ఆఫ్‌లైన్‌లో పనిచేసే బ్యాంకింగ్ యాప్స్ వస్తాయనుకుందాం! ఇప్పటికీ నోట్ల కష్టాలు అనుభవిస్తున్న ప్రజలు అంతవరకు బతికేదెలా? దేశంలోని ప్రతి వ్యక్తికి స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం సిద్ధించిందనుకుంటే ఆ ఇంటర్నెట్ను కట్‌చేసే పరిస్థితులు రావన్న గ్యారెంటీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం అల్లర్లు చెలరేగుతున్న మణిపూర్‌లో నిరవధికంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కట్ చేశారు. ఇలా జరగడం మన దేశంలో మొదటిసారి కాదు. మామూలే.
‘సెంటర్ ఫర్ కమ్యూనిషేన్ గవర్నెస్’ అక్టోబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015 సంవత్సరం నుంచి నివేదిక విడుదల నాటికి దేశంలో 37 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఒక్క 2016 జనవరి నెల నుంచి నేటి మణిపూర్ సంఘటన వరకు 22 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిచి పోయాయి. 2015, జూలై నెల నుంచి 2016, జూలై నెల వరకు భారత్‌లో దాదాపు 23 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వల్ల 96.80 కోట్ల డాలర్ల నష్ట వాటిల్లిందని ఓ అమెరికా ఆర్థిక సంస్థ అంచనావేసింది. ఓ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలంటే బాంబుల వర్షం కురిపించక్కర్లేదని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలిస్తే చాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఆత్మాహుతి దాడులు చేస్తున్న టెర్రరిస్టులు సైబర్ దాడులు తీవ్రం చేస్తే మన పరిస్థితి ఏమిటీ?
(సాక్షి వెబ్ సైట్ ప్రత్యేకం)