breaking news
capital farmer
-
నాకు అన్యాయం జరిగితే బాధ్యత చంద్రబాబుదే
-
సీఎం ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా..
* మంత్రి ప్రత్తిపాటికి రాజధాని రైతు స్పష్టీకరణ * భూములిచ్చిన వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానికి భూములు ఇచ్చిన తమను అధికారులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని తగలబడతానని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన రైతు దాసరి కృష్ణ హెచ్చరించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఆయనీ హెచ్చరిక చేయడం గమనార్హం. గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆవేదనతో మాట్లాడిన కృష్ణ ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించారు. భూములిచ్చిన రైతుల్ని తహసీల్దార్, ఎంపీడీవో ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని, అయినా మీరు అధికారులను అడగడం లేదని మంత్రిని నిలదీశారు. కృష్ణ ఆవేదనకు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. మంత్రి మాత్రం ‘నీ ఆవేదన ఏమిటో నాకు అర్థమైంది, నేను తర్వాత మాట్లాడతా కూర్చో’ అంటూ బుజ్జగించారు. -
భూ సేకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన
గుంటూరు: రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల రైతులకు ఈ ఏడాది రాజధాని ప్రాంత పొలాల్లో పంటలు వేయోద్దు అంటూ సీఆర్డీఏ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతులు తమ పొలాల్లో కూరగాయలు సాగు చేసి స్థానికులకు పంచి నిరసన తెలిపారు. (తాడేపల్లి) -
రాజధాని రైతుకు కౌలుసొమ్ము
తాడికొండ : రాజధాని నిర్మాణంలో మరో ప్రధాన ఘట్టం సోమవారం ప్రారంభమైంది. భూములు ఇచ్చిన రైతులకు అధికారులు కౌలు చెక్కుల పంపిణీ ప్రారంభించారు. అలాగే నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతూ వ్యవసాయ భూములను చదును చేసే ప్రక్రియను ఆరంభించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఎక్కువగా ఇచ్చినతాడికొండ మండలం నేలపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి నేలపాడు సీఆర్డీఏ అధికారి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించగా, కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసి అందిస్తామని తెలిపారు. తొట్టతొలుత భూమి ఇచ్చిన రైతులు చరిత్రలో నిలిచిపోతారని చెబుతూ తొలిగా భూములిచ్చిన మహిళారైతు కొమ్మినేని ఆదిలక్ష్మిని అభినందించారు. భూములు ఇచ్చిన రైతుల వద్ద అంగీకార పత్రాలన్నీ కచ్చితంగా ఉంటే ఏడాదికి రూ.30 వేలు కౌలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభంకానుందన్నారు. వివాదాలు ఉన్న భూములకు సంబంధించి వాటిని పరిష్కరించి రైతులకు కౌలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 80 శాతం భూములు కచ్చితంగానే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది వరకు కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా రాజధానిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భూసమీకరణ పూర్తిచేసి సహకరించిన అధికారులంతా గుర్తుండిపోతారని చెపుతూ, తుళ్లూరు తహశీల్దారు సుధీర్‌బాబును అభినందించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు రైతులతో తన ఆనందాన్ని పంచుకొనేందుకు తుళ్లూరులోనే ఉగాది పండుగను జరుపుతున్నట్టు చెప్పారు. జేసీ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ63 రోజుల్లో జెట్స్పీడుతో భూసమీకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. రైతుల వద్దనుంచి అగ్రిమెంటు తీసుకొని కౌలు సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా పది శాతం కౌలు పెరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని 93 ఎకరాలకు సంబంధించి 36 మంది రైతులకు రూ. 27.93 లక్షల సొమ్ముకు చెక్కులు అందించారు. గ్రామ సర్పంచ్ ధనేకుల సుబ్బారావు పొలాన్ని దున్ని అభివృద్ధిని ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివశంకర్, ఆర్డీవో భాస్కరనాయుడు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, గ్రామ సర్పంచ్ ధనేకుల సుబ్బారావు, నాయకులు దామినేని శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.