breaking news
Cabinet Secretary p.k.sinha
-
మీ పెట్రోల్ బిల్లు తగ్గబోతుంది.. ఎలా?
న్యూఢిల్లీ : వాహనాదారులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. తగ్గేటప్పుడు ఒకటి, రెండు పైసల్లో తగ్గినా.. పెరిగేటప్పుడు మాత్రం రెండకెల్లోనే ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో, మన దేశంలో కూడా ఆయిల్ ధరలు వాహనదారులకు వాత పెడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి, కరెంట్ అకౌంట్ లోటుకు పెను ముప్పులా మారుతున్న ఈ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నీతి ఆయోగ్ పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఓ సరికొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. దీంతో నెలవారీ మీ పెట్రోల్ బిల్లు తగ్గిపోనుందట. అదే మిథనాల్. ప్రతి ఒక్క వాహనదారుడు కచ్చితంగా తమ వాహన పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ కలిపి వాడేలా ఆదేశాలు జారీచేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేబినెట్ నోట్‌ను కూడా కేంద్రం ముందు ఉంచింది. ఒకవేళ కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదిస్తే, మీ నెలవారీ పెట్రోల్ బిల్లు కనీసం 10 శాతం తగ్గిపోనుందట. అంతేకాక ప్రభుత్వ ఆయిల్ దిగుమతి బిల్లు కూడా క్రమంగా తగ్గేందుకు ఇది సహకరించనుందని తెలిసింది. దీనిపై జూలై చివరి వారంలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా దీనిపై సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశం జరిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మిథనాల్ ఎకానమీ’ రోడ్‌మ్యాప్‌ను కూడా నీతి ఆయోగ్ రూపొందించింది. రవాణా వ్యవస్థ, గృహ అవసరాలకు 15 శాతం మిశ్రమ ఇంధనాన్ని వాడితే 2030 నాటికి క్రూడ్ దిగుమతుల్లో వార్షికంగా 100 బిలియన్ డాలర్ల తగ్గింపు పొందవచ్చని నీతి ఆయోగ్ తన ప్రణాళికలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 10 శాతం ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వాడుతున్నారు. ఎథనాల్ ధర లీటరు 42 రూపాయలు. ఒకవేళ మిథనాల్ మిశ్రమం వాడితే లీటరుకు 20 రూపాయల కంటే తక్కువగానే నమోదు కానుంది. దీంతో పెట్రోల్ ధరలు 10 శాతం తగ్గిపోనున్నాయి. మిథనాల్ వాడకంతో ఇంధన ధరలు, దేశీయ వార్షిక ఆయిల్ దిగుమతి బిల్లు తగ్గడమే కాకుండా.. కాలుష్యం కూడా నిర్మూలించవచ్చు. మిథనాల్‌తో 20 శాతం క్రూడ్ వినియోగాన్ని రీప్లేస్ చేస్తే, దేశీయ కాలుష్యం 40 శాతం తగ్గిపోనుందని నీతి ఆయోగ్ చెబుతోంది. ఒక్కసారి నీతి ఆయోగ్ రూపొందించిన ఈ పైలట్ ప్రాజెట్లు విజయవంతమైతే, ప్రభుత్వం ఈ మిథనాల్ కమర్షియల్ ప్రొడక్షన్‌ను బొగ్గు నుంచి చేపట్టడం ప్రారంభించనుంది. బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే కమర్షియల్ ప్రొడక్షన్‌కు పుణే, హైదరాబాద్, తిరుచ్చి ప్రాంతాల్లో రూ.100 కోట్లతో మూడు ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్‌లను సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నడుపుతోంది. అంతేకాక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్‌లు సిద్ధమై ఉన్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను కేటాయించాయి. అయితే మిథనాల్‌ను సరఫరా చేయడమే మన రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాల్ అని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కాగ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారి దేశంగా భారత్ ఉంది. 2900 కోట్ల లీటర్ల పెట్రోల్, 9000 కోట్ల లీటర్ల డీజిల్‌ను వార్షికంగా మన దేశంలో వినియోగిస్తున్నాం. -
అసమర్థ అధికారులకు ఉద్వాసన!
అలాంటి వారి జాబితా పంపాలని కోరిన డీవోపీటీ న్యూఢిల్లీ: బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా అలసత్వ, అసమర్థ అధికారులకు ఉద్వాసన పలకడానికి నిర్ణయించింది. అలాంటి వారి జాబితా ఇవ్వాలని అన్ని శాఖలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కోరింది. కేబినెట్ సెక్రటరీ పి.కె.సిన్హా నేతృత్వంలో ఈ మధ్యనే జరిగిన సమావేశంలో ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత, సచ్ఛీలత పెంచడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాప్రయోజనార్థం అసమర్థ అధికారులకు ఫండమెంటల్ రూల్ 56 (జె) ప్రకారం ముందస్తుగానే రిటైర్మెంట్ ఇచ్చేయాలని తీర్మానించారు. గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగుల్లో అవినీతి, అసమర్థ అధికారులపై ఈ విధమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు ఆగిపోయిన, ఐదేళ్లుగా ఏ విధమైన ప్రమోషన్లులేని అధికారులపై వేటు వేయనున్నారు. సున్నితమైన, ఇతర పోస్టుల్లోని అధికారుల రొటేషన్పైన కూడా ఆ సమావేశంలో చర్చించారు. తమ నిర్ణయాలను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని శాఖలు అమలు చేయాలని డీవోపీటీ కోరింది. అసమర్థ, అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని తొందరగా అంతర్గత నిఘా విభాగానికి పంపాలని అన్ని శాఖలకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి కేబినెట్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తారని పేర్కొంది.