breaking news
Business and real estate
-
చిన్నారి కిడ్నాప్..హత్య
డబ్బు కోసం దాయాది దారుణం హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: తమ దాయాది ఆర్థిక, రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలే క అతడి కుమారుడిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని పథకం వేశారు... బాలుడిని అపహరించారు.అయితే తమ గుట్టురట్టువుతుందని భయపడి అతిదారుణంగా పసివాడి ప్రాణం తీశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు మృతదేహానికి రాతికడిని కట్టి చెరువులో పడేశారు. హయత్‌నగర్, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ పాశవిక హత్య శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... బాటసింగారానికి చెందిన కొడిశెల పెంటయ్య స్థానిక పంచాయితీలో బిల్‌కలెక్టర్. రేషన్‌డీలర్‌గా వ్యవహరించడంతో పాటు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాడు. ఇతని భార్య మీనా పంచాయితీ వార్డు సభ్యురాలు. వీరి కొడుకు ఉదయ్‌కిరణ్ (13) పెద్దఅంబర్‌పేటలోని రాజశ్రీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇతని కుటుంబానికి, గ్రామ మాజీ సర్పంచ్, వరుసకు వదిన కొడిశెల రాధమ్మబాలరాజు కుటుంబానికి కొంత కాలంగా విరోధం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఏర్పడిన విభేదాలు మరింత పెరిగాయి. రాధమ్మ కొడుకు కొడిశెల నవీన్ పెంటయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాడు. తడి కొడుకును కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజాలని నిర్ణయించుకున్నాడు. నవీన్ అదే గ్రామంలో ఉండే తనకు వరుసకు బావ భీమనపల్లి నవీన్‌కుమార్, స్నేహితుడు చెంచెల ఉపేందర్, రేపాక నర్సింహ్మలతో కలిసి ఉదయ్‌కిరణ్ కిడ్నాప్‌కు పథకం వేశాడు. ఉదయ్ గురువారం సాయంత్రం పాఠశాలనుంచి ఇంటికి వచ్చేందుకు పెద్దఅంబర్‌పేటలో బస్సు కోసం బస్టాపులో ఉండగా.. భీమనపల్లి నవీన్‌కుమార్ ద్విచక్ర వాహనంపై వచ్చాడు. బాటసింగారం వెళ్తున్నానని చెప్పి బాలుడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. ఉదయ్‌ను వనస్థలిపురం పరిసరాల్లో బైక్‌పై తిప్పాడు. చీకటి పడ్డాక మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. తాను ఇంటికి వెళ్తానని బాలుడు గోల చేయడంతో తమ గుట్టు బయటపడుతుందని భయపడి టైతో విద్యార్థి గొంతు బిగించి చంపేశాడు. మృతదే హం నీటిలో తేలకుండా ఉండేందుకు రాతికడికి మృతదేహాన్ని, స్కూల్ బ్యాగును కట్టి చెరువులో పడేశాడు. బయటపడిందిలా.... ఉదయ్ చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానికంగా వెదకడంతో పాటు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. ఆచూకీ తెలియకపోవడంతో రాత్రి 9 గంటలకు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి విచారించారు. ఈ క్రమంలో ఉదయ్‌ను ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లడం చూశానని, మళ్లీ చూస్తే అతడిని గుర్తుపడతానని సోహెల్ అనే విద్యార్థి చెప్పాడు. బాలుడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం బి.నవీన్‌కుమార్ కిడ్నాప్ చేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలిసి బి.నవీన్‌కుమార్ పారిపోగా.. అతడిని పోలీసులు వనస్థలిపురంలో పట్టుకుని విచారించగా.. తానే ఉదయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు వెల్లడించాడు. నవీన్‌కుమార్‌ను పోలీసులు మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. నిందితుల అరెస్ట్.... బాలుడిని కిడ్నాప్ చేసి అతని తండ్రి నుంచి రూ. 10 లక్షల నుంచి 15 లక్షలు వసూలు చేయాలని కొడిశెల బాలరాజు కొడుకు నవీన్‌కుమార్, భీమనపల్లి నవీన్‌కుమార్, ఉపేందర్, రేపాక నర్సింహ్మలతో కలిసి పథకం వేశాడని వనస్థలిపురం ఏసీపీ బి.భాస్కర్‌గౌడ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు బి.నవీన్‌కుమార్ గతంలో నకిలీ సర్టిఫికెట్లతో హోంగార్డు ఉద్యోగంలో చేరగా.. అధికారులు అతడ్ని మూడు నెలల తర్వాత తొలగించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు... బాలుడి కిడ్నాప్, హత్య నేపథ్యంలో బాటసింగారంలో శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, సూత్రధారి (మాజీ సర్పంచ్ రాధమ్మ కొడుకు నవీన్‌కుమార్) దాయాదులు కావడం. వారి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు బందోబస్తు చేపట్టారు. నిందితులను చంపేయాలని స్థానికులు, పెంటయ్య బంధువులు వారి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు ఉదయ్‌కిరణ్ మృతదేహం గ్రామానికి తీసుకొచ్చి.. మాజీ సర్పంచ్ ఇంటి ముందు ఉంచి ఆందోళన నిర్వహించారు. కొందరు రాధమ్మ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు గ్రామపెద్దల సహాయంతో ఆందోళకారులను శాంతిపజేశారు. అనంతరం రాధమ్మ కుటుంబ సభ్యులను పోలీసులు హయత్‌నగర్ ఠాణాకు తరలించారు. అనంతరం అశ్రునయనాలతో బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎపీఐఐసీ భూమిపై గ(పె)ద్దలు!
సాక్షిప్రతినిధి, కడప: పరిశ్రమల కోసం పుచ్చుకున్న భూమిలో రియల్ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. కారు చౌకగా దక్కించుకున్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్లు వెలుస్తున్నాయి. సుమారు రూ.లక్షకు పొందిన ఎకరా భూమిని రూ.2కోట్లకు పైబడి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తం 15.50 ఎకరాలున్న రూ.30కోట్లు విలువైన భూమి గ(పె)ద్దల పాలైపోతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీ తెరపై ఉండడంతో నిబంధనలు తప్పుకున్నారుు. అధికార యంత్రాంగం కపట నిద్రలో ఉండిపోయింది. వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట పరిధిలో ఏపీఐఐసీ ద్వారా 1978లో డిటెర్జెంట్స్ ఇండియా లిమిటెడ్(సబ్బుల తయారీ పరిశ్రమ)కు 15.50 ఎకరాలు భూమిని రూ.18లక్షలకు అప్పగించారు. ఆ భూమిలో పదేళ్లు పాటు పరిశ్రమను నిర్వహించిన డిటెర్జెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆ తర్వాత పరిశ్రమను మూసేసింది. అయితే ఆ భూమిని స్థానికంగా ఉన్న మరో సంస్థ కొనుగోలు చేసింది. ఓ మాజీ ఎంపీ తన బినామి సంస్థ ద్వారా ఆ భూమిని దక్కించుకున్నారు. ఏపీఐఐసీ ద్వారా పొందిన భూమిని సొంతంగా క్రయవిక్రయాలు చేయడం చట్టసమ్మతం కాదు. ఏపీఐఐసీ అనుమతి పొందాకే విక్రయాలు, కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సదరు మాజీ ఎంపీ బినామీ సంస్థ ఇవేవి పాటించకుండా డిటెర్జెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. మాజీ ఎంపీ పరపతి ఉపయోగించి రిజిస్ట్రేషన్ సైతం పొందినట్లు సమాచారం. మాజీ ఎంపీ రంగప్రవేశంతో..... ఏపీఐఐసీ ద్వారా పొందిన భూమిలో పరిశ్రమలే నెలకొల్పాలని నిబంధనలు వివరిస్తున్నాయి. ఒక పరిశ్రమకు కేటాయించిన భూమిలో ఇంకో పరిశ్రమ పెట్టుకోవాలన్నా ఏపీఐఐసీ అనుమతి తప్పనిసరి. అయితే మాజీ ఎంపీ ఒకరు రంగ ప్రవేశం చేయడంతో నిబంధనలు అడ్డు నిలవలేకపోయాయి. ప్రస్తుతం ఆభూమిని చదును చేసి రియల్ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మలుచుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా, అటు ఏపీఐఐసీ కానీ, ఇటు రెవిన్యూ యంత్రాంగం కానీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం రోడ్డుకు అందుబాటులో ఉన్న ఈ భూమి ఎకరం రూ.5కోట్లు పలుకుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా అయితే ఎకరా రూ.2 కోట్లతో కొనుగోలుకు సిద్ధం అంటూ బేరాలు కూడా ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. డేంజర్ జోన్ కారణంగా ఇంటి స్థలం కోసం ఆప్రాంతం యమ డిమాండ్ ఏర్పడడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు ఏపీఐఐసీ ద్వారా రూ.18 లక్షలుకు పొందిన ఆభూమి ప్రస్తుతం రూ.30 కోట్లుకు పైబడి విలువ చేసే పరిస్థితులు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. యధేచ్ఛగా ప్లాటు వేస్తూ విక్రయాలు చేస్తున్నా ఏపీఐఐసీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, రెవిన్యూ యంత్రాంగం సైతం చూస్తుండిపోవడం మినహా, అడ్డగించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా తిరుపతి జోనల్ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ నిత్యం ఇదే రహదారి మీదుగా వెళ్లే ఏపీఐఐసీ జడ్ఎంకు తెలియకపోవడం విశేషం. ఈవిషయమై ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. పెపైచ్చు నాలుగు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం విశేషం.