breaking news
brother and sister dies
-
మరణంలోనూ వీడని పేగుబంధం
దండేపల్లి(మంచిర్యాల): తల్లి కడుపున పేగు తెంచుకు పుట్టిన అక్క, తమ్ముడు మరణంలోనూ వారి పేగు బంధాన్ని వీడలేదు. అక్క చనిపోయిన అరగంటకు తమ్ముడు మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఉగ్గె నాగవ్వ(50)కు పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత కుటుంబ కలహాలతో ఆమె భర్తను వదిలి తల్లిగారి ఊరు గూడెంలో ఉంటోంది. ఈమె సోదరుడు నాగన్న(40)కు పెళ్లి కాలేదు. వీరిద్దరికి మరో సోదరుడు రాజన్న ఉన్నాడు. ఇతడికి పెళ్లయిన తర్వాత కుటుంబ కలహాలతో భార్యను అత్తవారింటి వద్దనే ఉంచాడు. దీంతో రాజన్న, నాగవ్వ, నాగన్న ముగ్గురు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాగవ్వ గత రెండు నెలలుగా అనారోగ్యానికి గురయ్యింది. నాగన్న గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక ఆసుపత్రికి వెళ్లలేదు. ఇద్దరు మంచం పట్టారు. దీంతో పరిస్థితి విషమించి శనివారం ఉదయం 7గంటలకు నాగవ్వ మృతి చెందింది. మరో అరగంట వ్యవధిలో నాగన్న మృతి చెందాడు. ఒకే రోజు ఒకే ఇంట్లో అక్కా, తమ్ముడు మృతి చెందడం పలువురిని కలిచివేసింది. బంధువులు, గ్రామస్తులు కలిసి ఇద్దరికి అంత్యక్రియలు నిర్వహించారు. -
తెగిన బంధం
- రోడ్డు ప్రమాదంలో అన్నా, చెల్లెలు దుర్మరణం - బైక్‌లో వెళ్తుండగా వేగంగా వచ్చి ఢీకొన్న టిప్పర్ - ఎస్కేయూ సమీపంలో ఘటన మృత్యువు వికృతమైంది. దానికి బంధాలు, అనుబంధాలు పట్టవు. ఎంతటి వారినైనా ఇట్టే కబళిస్తుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. మృత్యువు వికటాట్టహాసానికి అన్నాచెల్లెలు బలయ్యారు. రక్తం పంచుకుపుట్టిన ఇద్దరూ ఒకేసారి నడి రోడ్డుపై విగతజీవులుగా మారడం చూసి కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. ఇక తమ కడుపుకోత ఎవరు తీరుస్తారని వారు ప్రశ్నించడం అందరి హృదయాలను పిండేసింది. - ఎస్కేయూ అనంతపురం-కదిరి జాతీయ రహదారిలోని ఎస్కేయూ సమీపంలోని ఢాబా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు దుర్మరణం చెందారు. బైక్‌లో వెళ్తున్న వారిద్దరినీ అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటుకలపల్లి ఎస్ఐ అబ్దుల్ కరీం కథనం ప్రకారం.. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(ఎస్కేయూ సమీపంలోని ఢాబాలో దినసరి కూలీ)కు మహమ్మద్ ఆలీ(18), కూతురు అనూష (16) ఉన్నారు. అనూషకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యం యూనివర్సిటీ వద్దకు రాగానే మృత్యురూపంలో ఎదురొచ్చిన టిప్పర్ ఢీకొనడంతో బైక్ నుజునుజ్జు అయింది. అన్నాచెల్లి ఇద్దరూ అంతేసి దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ఫలితాలు రాకనే... అనూష ఇంటర్ మొదటి సంవత్సరం చదివేది. మంగళవారంతో ఆమె పరీక్షలు పూర్తయ్యాయి. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని అన్నా, చెల్లి కలసి వస్తూ ఒకేసారి ఇద్దరూ ఇలా అర్ధంతరంగా మరణించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. రాయలచెరువు సమీపంలో మరొకరు.. యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికి మండలం రాయలచెరవు సమీపంలోని జాతీయ రహదారిలో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన గోపాల్‌నాయుడు(40) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. బళ్లారికి చెందిన గోపాల్నాయడు బైక్‌లో కర్ణాటకలోని బళ్లారి నుంచి బైక్‌లో తాడిపత్రి మండలం తేరన్నపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయలచెరువు సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.