breaking news
boost growth
-
ఎకానమీకి పీఎల్ఐ దన్ను: ఎంకే నివేదిక
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత్ ఎకానమీకి వెన్నుదన్నుగా నిలవనుందని ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం) నివేదిక విశ్లేషించింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కీలకరంగాల్లో తయారీ పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం, వార్షికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 4 శాతం అదనపు విలువను జోడించవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఈ పథకం ఎల్రక్టానిక్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మా రంగాల నుండి గరిష్ట స్పందనను చూసిందని వివరించింది. నివేదికలో మరికొన్ని అంశాలన పరిశీలిస్తే.. ► పీఎల్ఐ పథకం విజయవంతం కావడానికి చైనా ప్లస్ 1 వ్యూహమే కారణం. మహమ్మారి ప్రారంభమైన నుండి చైనాలో పెట్టుబడులకు అనేక పాశ్చాత్య కంపెనీలు, ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. తాజా లాక్డౌన్లు ఆ దేశంలో సరఫరాల సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. దీనికితోడు ఆ దేశానికి చెందిన అనేక వస్తువులపై అభివృద్ధి చెందిన దేశాలు యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించాయి. ► ఉత్పాదక కంపెనీలు బలమైన రాబడుల కారణంగా సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కంపెనీలు విస్తరిస్తున్నాయి. నమోదైన కొత్త తయారీ కంపెనీల సంఖ్యను బట్టి ఇది స్పష్టమవుతుంది. ► తయారీ కంపెనీల నమోదు గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో తయారీ కంపెనీల వాటా గత దశాబ్దం నుండి దాదాపు అత్యధిక స్థాయిలో ఉండడం గమనార్హం. ► మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోరిన-మంజూరైన పర్యావరణ అనుమతుల సంఖ్య అత్యధికంగా ఉంది. 2018-21లో ఆవిష్కరించిన నిర్మాణాత్మక మార్పులు ఎకానమీపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2003-06లో నెలకొన్న సానుకూల పరిస్థితులను తాజా పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి. ► నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తొలిరోజుల్లో దేశీయ తయారీ రంగం దెబ్బతింది. తాజాగా మహమ్మారి వినియోగదారుల డిమాండ్‌పై ప్రభావం చూపింది. ఆయా పరిస్థితుల నుంచి ఎదురైన సవాళ్లు తయారీ పరిశ్రమపై కొనసాగుతున్నాయి. మూలధన సవాళ్లు, సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ► 2021-22లో తలసరి ఆదాయం 2020-21కన్నా పెరిగింది. మార్చితో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం నుండి విచక్షణాపరమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రూపాయి బలహీనత బలం... చైనీస్ యువాన్‌తో రూపాయి విలువ క్షీణించడం భారత్ తయారీ రంగానికి సానుకూలంగా మారింది. ఈ పరిణామాల వల్ల ఆటో, ఆటో విడి భాగాలు, వ్రస్తాలు, రసాయనాలు, భారీ పరిశ్రమలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ ప్రయోజనం పొందుతున్నాయి. – వికాస్ ఎం సచ్‌దేవా, ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సీఈఓ -
ఆర్థికవృద్ధికి ఊతం...పన్నుల్లో ఉపశమనం
న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధి మరింత పుంజుకునేలా చేస్తూ, ఉద్యోగవకాశాలను పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిమితుల్లో పలు రకాల చర్యలు తీసుకుంటోంది. తక్కువ పన్ను చెల్లించేవారికి, వ్యాపారాలకు, నిపుణులకు పన్నుల్లో ఉపశమనం కల్పించనున్నట్టు ప్రకటించింది. పన్నుమినహాయింపు పరిమితిని ఆదాయపు పన్ను యాక్ట్ 1961, సెక్షన్ 80సీ ప్రకారం ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అదనంగా రూ.50వేలను నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సహాయపడేలా ప్రకటన విడుదల చేసింది. చిన్న పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారాలకు, ఉద్యోగస్తులకు పన్నుల్లో కొంత ఉపశమనం కల్పిస్తూ రెవెన్యూ శాఖ తీసుకొనే చర్యలను బడ్జెట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కల్గిన చిన్న వ్యాపారస్తులకే ముందస్తు పన్నుల వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ప్రకటన విడుదలచేసింది. అదేవిధంగా రూ.50లక్షల ఆదాయం వరకు ఉన్న ప్రొఫెషనల్స్ కూ ముందస్తు పన్నుల ప్రయోజనం కల్పించనున్నట్టు పేర్కొంది. కొత్తగా తయారీ కంపెనీలు ఏర్పాటు చేసే వారికి కార్పొరేట్ పన్నులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గృహరంగానికి ఇచ్చే పన్ను లబ్దిని కూడా పెంచడంతో నిర్మాణ పరిశ్రమకు ఊతం కల్పించనున్నారు. రాయల్టీ, టెక్నికల్ సర్వీసులపై పన్నుల రేటును 25 నుంచి 10 శాతానికి కుదించారు. కొత్తగా ప్రారంభించబోయే కంపెనీలకు(స్టార్టప్) మూడు సంవత్సరాలు 100శాతం పన్నుల రాయితీని కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధికి మరింత ఊతం అందిస్తూ ఉద్యోగవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.