breaking news
Board of Krishna
-
కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం: ఏపీ ఈఎన్సీ
-
కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం: ఏపీ ఈఎన్సీ
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో జరిగిన కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శులు, కేంద్ర జలశక్తిశాఖ ప్రతినిధి తదితరులు హాజరయ్యారు. అదే విధంగా... ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు హాజరయ్యారు. అయితే, తెలంగాణకు చెందిన ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు మాత్రం సమావేశానికి రాలేదు. ఇక భేటీ అనంతరం ఏపీ ఈఎన్సీ మాట్లాడుతూ... ‘‘గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలన్న కృష్ణా, గోదావరి బోర్డులు నోటిఫికేషన్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం. టైం షెడ్యూల్ ప్రకారం సమాచారం కావాలని కోరారు’’ అని తెలిపారు. కాగా నదీ జలాల విషయంలో బోర్డులకు పూర్తిస్థాయి అధికారాలు కేటాయిస్తూ కేంద్రం గెజిట్ నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. గత నెల 29న గోదావరి బోర్డు.. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కమిటీ భేటీ నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే, ఈ అంశంపై సోమవారం స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. ‘గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అదే విధంగా.. కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడం గమనార్హం. ఈ క్రమంలో... కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తే హాజరవుతామని తెలిపింది. -
తేల్చుకొని రండి!
* తెలంగాణ, ఏపీలకు కృష్ణా బోర్డు మరో లేఖ * రాష్ట్రాల మధ్య సయోధ్య లేకుండా బోర్డు ఏం చేస్తుందని ప్రశ్న * పరస్పర విరుద్ధంగా నీటి లెక్కలు ఇవ్వడంపై అసంతృప్తి * ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఏకాభిప్రాయంతో రావాలని సూచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో యాజమాన్య బోర్డు మరోసారి తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు సయోధ్యకు రాకుండా బోర్డు సమావేశం నిర్వహించడం నిష్ఫలమేనన్న ధోరణితో స్పందించింది. రబీకి నీటి కేటాయింపుల విషయంలో ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపించడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా జలాలను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి, ఇప్పటివరకు ఏపీ వాడుకున్న నీటినిబట్టి చూస్తే ఇక ప్రాజెక్టుల్లో మిగిలిన జలాలన్నీ తెలంగాణకే దక్కుతాయని రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లెక్కలకు శాస్త్రీయత లేదని, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీటిని ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఏపీ సర్కారు కూడా బోర్డుకు నివేదించింది. దీంతో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఏకాభిప్రాయంతో రావాలని పేర్కొంటూ కృష్ణా బోర్డు బుధవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. నీటి నిల్వ, డిమాండ్, వినియోగంపై ఒకే రకమైన గణాంకాలను ఇవ్వాలని పునరుద్ఘాటించింది. బోర్డు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చర్చించుకొని నీటి నిల్వ, వినియోగంపై ఏకాభిప్రాయానికి రావాలని బోర్డు ఇదివరకే చేసిన ప్రతిపాదన సాకారం కాలేదు. ఇరు రాష్ట్రాలు చెప్పిన నీటి లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి. రెండు రాష్ట్రాలు సమర్పించిన లెక్కలను బట్టి చూస్తే.. వాస్తవంగా రెండు రాష్ట్రాల వాటాలు, వినియోగించుకున్న నీటి పరిమాణాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. - రెండు రాష్ట్రాలు వేర్వేరుగా గణాంకాలు సమర్పిస్తే.. విభజన చట్టంలోని సెక్షన్ 85(8)లో పేర్కొన్న ప్రకారం బోర్డు ఏర్పాటు లక్ష్యం నెరవేరదు. రెండు రాష్ట్రాలకు జలాల పంపిణీ సాధ్యం కాదు. - రెండు రాష్ట్రాలు ఇచ్చిన నీటి వివరాలను యథావిధిగా పరిశీలించడం బోర్డుకు సాధ్యం కాదు. నీటి వాడకం, లభ్యత, భవిష్యత్ అవసరాల విషయంలో రెండు రాష్ట్రాలు గణాంకాలను పరస్పరం మార్పిడి చేసుకొని ఒకే రకమైన లెక్కలు సమర్పిస్తేనే బోర్డు పరిశీలిస్తుంది. - రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఆమోదించి సంతకాలు చేసిన తర్వాతే ఏ ప్రాజెక్టు నుంచైనా నీటి విడుదల జరగాలని బోర్డు చాలాసార్లు చెప్పింది. అలా చేస్తే అధికారికంగా నీటి విడుదల గణాంకాలు నమోదవుతాయి. కానీ అలా జరగలేదు. బోర్డు సూచనలు ఎప్పుడూ పాటించలేదు. - నీటి లభ్యత, సీజన్లవారీగా వినియోగాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి ముందే నిర్ధారిస్తారు. అదే బేసిన్‌లోని మిగతా ప్రాజెక్టులన్నిటినీ కలగలిపి నీటి కేటాయింపులు, వినియోగంపై అంచనాలు రూపొందించకూడదు. - తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే.. సాగు, పారిశ్రామిక, విద్యుత్ అవసరాలకు నీటిని వినియోగించుకోవాలన్న జాతీయ నీటి విధానాన్ని అనుసరించాలని బోర్డు నొక్కి చెప్పింది. ఏపీ చర్చలకు రాదెందుకు? ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు నీటి వాటాలో హక్కులున్నాయంటున్న ఏపీ చర్చలకు ఎందుకు రావడం లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. ‘చెబుతున్న లెక్కలు సరైనవే అని భావిస్తే ఎందుకు ముఖం చాటేస్తోంది? తెలంగాణతో చర్చించకుండా ఢిల్లీకి లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఉండదు. బోర్డు సైతం ఇరు రాష్ట్రాలు పరస్పరం పరిష్కరించుకోవాలని సూచిస్తున్న దృష్ట్యా ఏపీ చర్చలకు వస్తే ఫలితం ఉంటుంది. ఇప్పటికే 68% పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 6 లక్షల ఎకరాలకు, 31.5% పరీవాహకం ఉన్న ఏపీకి 27 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందాయి. ఇప్పుడూ రబీ నీళ్లన్నీ తమకే దక్కాలని ఏపీ కోరడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే నీటిని మళ్లిస్తామంటే కుదరదు’ అని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.