breaking news
best profits
-
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
అనంతపురం అగ్రికల్చర్ : మితిమీరిన పెట్టుబడుల కారణంగా రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ప్రకతి వ్యవసాయాన్ని భారీగా విస్తరించాలని నాచురల్ ఫార్మింగ్ మేనేజ్మెంట్ (ఎన్పీఎం) రాయలసీమ జిల్లాల ఇన్చార్జి పుల్లారావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లాలో ఉన్న 10 ఎన్పీఎం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడటం వల్ల వ్యవసాయం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో పురుగు మందులు లేని, పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కేవలం ఆవుపేడ, మూత్రం ద్వారా తయారు చేసిన జీవామతం, ఇతరత్రా కషాయాలు వాడేలా రైతుల దష్టిని మళ్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల పరిధిలో 10 క్లస్టర్ల కింద 53 గ్రామాల్లో 4,150 మంది రైతుల ద్వారా ఈ ఏడాది ఎన్పీఎం పద్ధతులు అమలు చేస్తున్నట్లు డీపీఎం రవీంద్రారెడ్డి, టెక్నికల్ ఏఓ లక్ష్మానాయక్ తెలిపారు. కస్టర్ల పరిధిలో 10 కస్టమ్ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్సీలు), 50 వరకు కషాయాల విక్రయ కేంద్రాలు, అలాగే కషాయాల తయారీకి ఉపయోగపడే దేశీయ ఆవులు రాయితీతో పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. -
కూరగాయల సాగు.. భలే బాగు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రణాళికా పద్ధతిలో కూరగాయల పంటలు సాగు చేస్తే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి.రాధిక తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో శుక్రవారం కూరగాయలు, ఉల్లి, కర్భూజా, కళింగర పంటలు, సేంద్రియ పద్ధతులపై ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వి.రాధిక, డాక్టర్ సి.సుబ్రమణ్యం హాజరై అవగాహన కల్పించారు. సస్యరక్షణ చర్యలు : ఇపుడు అన్ని రకాల కూరగాయల పంటలు వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా కనీసం 15 రోజుల నిడివితో కొంచెం కొంచెం రెండు మూడు రకాల పంటలు సాగు చేస్తే తప్పనిసరిగా గిట్టుబాటవుతుంది. లేదంటే మార్కెట్లో ధరలు పడిపోయినపుడు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. టమాట, మిరప వంటి పంటలు సాగు చేసే ప్రాంతాల్లో తోట చుట్టూ రక్షకపంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటివి ఐదారు సాళ్లు వేసుకుంటే మేలు. అలాగే ప్రతి 16 సాళ్లకు ఒకసాలు బంతిపూలు చెట్లు వేసుకోవాలి. 25 రోజుల టమాట, మిరప నారును నాటుకుంటే 45 రోజుల వయస్సున్న బంతి పూల చెట్లు నాటుకోవాలి. దీని వల్ల ఒకేసారి పూతకు రావడం వల్ల శనగపచ్చ పురుగు ఉధతి బాగా తగ్గుతుంది. కూరగాయల తోటల్లో ఎకరాకు 25 నుంచి 30 వరకు జిగురు పూసిన పసుపు పచ్చని అట్టలు లేదా రేకులు ఏర్పాటు చేసుకుంటే రసంపీల్చు పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. మిరపలో పూత పురుగు నివారణకు 2 మి.లీ ట్రైజోపాస్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరపలో వైరస్ తెగులు నివారణకు 2 మి.లీ రీజెంట్ లేదా 0.2 గ్రాములు అసిటామిప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వైరస్ ఆశించిన మొక్కలు ఏరివేసి నాశనం చేయాలి. టమోటాలో సున్నం లోపించడం వల్ల తుడిమకుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున 5 గ్రాములు కాల్షియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తీగజాతి పంటలు : కాకర, బీర, గుమ్మడి లాంటి తీగజాతి కూరగాయల పంటలు ఆశించి నష్టం కలిగించేలా పండుఈగ నివారణకు మిథైల్ యూజినాల్ ఎరలు ఎకరాకు నాలుగైదు చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. కుల్యూర్తో ఉన్న లింగాకర్షక బుట్టలు ఎకరాకు మూడు పెట్టుకోవాలి. ఇవి ఏర్పాటు చేసుకోవడం వల్ల సస్యరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మామూలు పండ్లతోటల్లో కూడా పండుఈగ నివారణకు ఎకరాకు 8 చొప్పున వీటిని ఏర్పాటు చేసుకుంటే మేలు. ఇక ఉల్లిలో తామర పురుగు ఉధతిని తగ్గించడానికి తోట చుట్టూ రక్షణ పంటలతో పాటు 2 మి.లీ రీజెంట్ లేదా 0.2 గ్రాములు అసిటమాప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇందులో సర్ఫ్ పొడి కలుపుకుంటే బాగుంటుంది. సేంద్రియ వ్యవసాయం, కర్భూజా, కళింగర పంటల సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి శాస్త్రవేత్త డాక్టర్ సి.సుబ్రమణ్యం అవగాహన కల్పించారు.