breaking news
Baldiya office
-
బర్త్ సర్టిఫికెట్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బర్త్ సర్టిఫికెట్ల కోసం బల్దియాకు దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో పెరుగుతున్నాయి. అంటే దీనర్థం నగరంలో జననాల రేటు పెరుగుతోందని కాదు.. తాము నగరంలోనే జన్మించామని నిరూపించుకునేందుకు కొందరికి ఉన్నపణంగా అవసరం ఏర్పడిందని.. ఈ దరఖాస్తుదారుల్లో రోజుల వయసున్న పిల్లలతోపాటు.. కాటికి కాలు చాచిన వృద్ధులున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో గతంతో పోలిస్తే.. జనన ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల నమోదవుతోంది. ప్రతిరోజూ బల్దియాకు వివిధ సర్కిళ్లకు వచ్చే దరఖాస్తులు, జారీ చేసే సర్టిఫికెట్లను పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా గతేడాది డిసెంబర్, ఈ జనవరి నెలను పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జారీ చేసిన సర్టిఫికెట్ల సంఖ్యలో ఈ తేడా స్పష్టమవుతుంది. ఉదాహరణకు 2020 జనవరి 1వ తేదీన 88 మంది పురుషులకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరయ్యాయి. అందులో 38 మంది ఒకే వర్గానికి చెందినవారున్నారు. అదేరోజు 101 మంది మహిళలకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరవ్వగా.. అందులో 32 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉండటం గమనార్హం. ఇదే గతేడాది జనవరి 1వ తేదీన ఇందులో సగం సంఖ్యలోనే దరఖాస్తులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. దాదాపు రోజువారీ సగటు కంటే 100 శాతం దరఖాస్తులు పెరిగాయని అధికారులు అంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వచ్చాకే.. ఈ దరఖాస్తులు పెరిగాయని కూడా అధికారులు చెబుతున్నారు. మరీ నిజాం కాలం నాటి సర్టిఫికెట్లా? ‘1936లో జన్మించిన నాకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వండి.. 1945లో పుట్టిన నాకు జనన ధ్రవీకరణ పత్రం ఇవ్వండి..’అంటూ పాతబస్తీలోని వివిధ సర్కిల్ ఆఫీసుల్లో బల్దియా అధికారులకు మునుపెన్నడూ చూడని దరఖాస్తులు వస్తున్నాయి. 86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్తో ఏం పని? అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో స్వాతంత్య్రానికి పూర్వం, నిజాం హయాంలో ఉన్న బల్దియా రికార్డులను తిరగేయాల్సి రావడంతో ఇవి సహజంగానే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి రికార్డుల వెరిఫికేషన్ కోసం అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పాత నిజాం కాలం నాటి ఉర్దూలో ఉన్న రికార్డులను తిరగేయాల్సి వస్తోంది. అందులో 99 శాతం దరఖాస్తుల్లో వీరి డేటా దొరకడం లేదు. దీంతో ఆర్డీవో, పోలీసులకు వీరి దరఖాస్తును విచారణ కోసం పంపుతున్నారు. దరఖాస్తుదారుడు విద్యావంతుడైతే.. అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. లేని వారికి దరఖాస్తుదారుడు సమర్పించిన వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు. వక్ఫ్బోర్డుకూ అదే రీతిలో దరఖాస్తులు ఇటు వక్ఫ్ బోర్డుకు సైతం వివాహ ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గతంలో రోజుకు 100 నుంచి 150 వరకు దరఖాస్తులు వచ్చేవి. అయితే జనవరి నుంచి రోజుకు 450 నుంచి 500కు పైగా దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం. ఈ సర్టిఫికెట్లలో కూడా వివాహం జరిగిన తేదీ, సంవత్సరం, జాతీయత తదితర వివరాలు ఉండటం గమనార్హం. అనూహ్యంగా పెరిగిన ఈ దరఖాస్తులను చూసి వక్ఫ్‌బోర్డు అధికారులే విస్మయం చెందుతున్నారు. ఆ దేశాల వారేనని అనుమానం.. నగరంలోని పాతబస్తీతో పాటు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా 10 వేలకు పైగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన రొహింగ్యాలు శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందారు. వీరంతా ఇప్పటికే అక్రమ మార్గంలో ఓటరు, ఆధార్, పాన్, పాస్‌పోర్టులు పొంది భారత పౌరులుగా చలామణి అవుతోన్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణలోనూ సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకానున్న నేపథ్యంలో వీరంతా బర్త్, మ్యారేజ్ సర్టిఫికెట్లకు తప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 1936 నుంచి 1980 వరకు పలువురు తమకు కొత్తగా జనన ధ్రువీకరణాలు కావాలని అడుగుతుండటంతో, వాటిలో అనుమానాస్పదంగా.. రికార్డుల్లోలేని దరఖాస్తుల విచారణ కోసం పోలీసులకు అప్పగిస్తున్నారు. -
దారుల్-షిఫా
16వ శతాబ్దంలోనే హైదరాబాద్‌లో నెలకొల్పిన ప్రముఖ యునానీ వైద్యశాల దారుల్-షిఫా. పాతబస్తీలోని బల్దియా కార్యాలయం దగ్గర్లో ఉన్న ఈ ఆస్పత్రి ఆనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. 1595లో, ఐదవ కులీ కుతుబ్షామీ కాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఐదేళ్లకు ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. దారుల్-షిఫా అనేది ఉర్దూ పదం. దారుల్ అంటే హౌస్ అని, షిఫా అంటే క్యూర్ అని అర్థం. దారుల్-షిఫా అంటే House of Cure అన్నమాట.‘స్వస్థత కేంద్రం’గా తెలుగులో సమానార్థం చెప్తారు. నాలుగు శతాబ్దాల కిందట ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన మూడు యునాని ఆస్పత్రుల్లో దారుల్-షిఫా ఒకటి. మిగితా రెండు బాగ్దాద్, బుఖ్రా ప్రాంతాల్లో ఉండేవి. ఆ రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యంగా యునానీ పేరు తెచ్చుకుంది. శాస్త్ర ప్రకారం నిర్మాణం.. ఆనాడు కాలుష్యం సోకని మూసీ నీళ్లలో స్వచ్ఛత కనిపించేది. ఆ అలలపై నుంచి వ చ్చే చల్లటి గాలులు రోగులకు స్వస్థత చేకూరుస్తుందని మూసీ తీరాన దారుల్-షిఫాను నిర్మించారు. యునానీ వైద్య శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశగా వచ్చే గాలులు రోగ పీడితులకు ఎంతో మంచిదని నమ్మకం. ఆ మేరకు ఆసుపత్రి భవన నిర్మాణం మూసీనదికి ఉత్తర - దక్షిణ దిశలో చేపట్టారు. మూసీ నదికి దారుల్ షిఫాకి మధ్యన ప్రస్తుతం వున్న కాంక్రీటు భవనాలు ఆనాడు లేవు. సరికదా, పచ్చని తోటలు, అనేక మొక్కలు, భారీ వృక్షాలతో పచ్చదనంతో ఈ ప్రాంతం నిండి వుండేదని చరిత్రకారులు పేర్కొంటారు. పేరెన్నికగన్న హకీంలు, వైద్యులను గ్రీసు, ఇటలీ, పర్షియన్ దేశాల నుంచి కుతుబ్‌షాహీ రాజులు పిలిపించారు. ఎందరో ప్రజలకు చక్కని వైద్య సౌకర్యం అందించారు. ఒకేసారి 400 మంది రోగులకు ఉచిత మందులు ఇచ్చేలా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. రోగులకు వైద్యంతో పాటు వైద్య విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇప్పించారు. చరిత్రకు చిక్కిన కట్టడంలా.. హైదరాబాద్ సంస్థానాన్ని కుతుబ్‌షాహీల తర్వాత రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న అసఫ్‌జాహీ - నిజాం ప్రభువులలో మెుదటి నిజాం ప్రభువు, నిజాం-ఉల్-ముల్క్ పాలన వరకు అంటే అంటే 1762 దాకా, దారుల్ షిఫా రోగులకు అందుబాటులో ఉండేది. రెండో నిజాం కాలంలో దీన్ని మూసివేసి వ్యక్తిగత సంస్థానంలో విలీనం చేశారు. క్రమేణా దారుల్-షిఫా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కట్టడంగా మాత్రమే నేడు కనిపిస్తోంది. భవనంలో ఒక పక్క ఆషూర్ఖానా, ప్రార్థన మందిరం ఏర్పాటు చేశారు. ఏడో నిజాం కాలంలో ఈ ప్రార్థనామందిరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాడు. దారుల్-షిఫాకు వెలుపల ఉత్తర - పశ్చిమ దిశలలో కుతుబ్‌షాహీలు విశిష్టశైలిలో నిర్మించిన ‘మసీదు’ ఉంది. ఈ తరానికి తెలియదు.. దారుల్-షిఫా గురించి ఆ భవనం దగ్గరికి వెళ్లి అడిగినా ఇదే అదని చూపించేవారు ఉండరు. ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దవాఖానా ఇప్పుడు చాలామందికి ఆషూర్ఖానాగానే తెలుసు. 162 ఏళ్లకు పైగా ఎందరికో వైద్య సేవలు అందించిన దారుల్-షిఫా విశిష్టతను తెలియజేసే ఎలాంటి నమూనాలు ఆ సమీపంలో కనిపించవు. శతాబ్దాల చరిత్ర కల్గిన ఈ అద్భుత నిర్మాణం గురించి ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గొప్ప హెరిటేజ్ కట్టడంగా గుర్తించిన దారుల్-షిఫా గురించి చారిత్రక అంశాలపై ఆసక్తి కనబర్చేవారు తగిన రీతిలో స్పందిచడం తక్షణ అవసరం! మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com