breaking news
balancing reservoir
-
ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ ఇదే పరిస్థితి!
ఈ చిత్రంలోని దంపతులు కీలుకత్తుల యాదయ్య, మంగమ్మ.. నర్సిరెడ్డిగూడెంలో వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. అధికారులు బలవంతంగా ఊరిని ఖాళీ చేయిస్తుండటంతో ఉన్న ఊరిని.. ఇన్నాళ్లూ తలదాచుకున్న ఇంటిని ఖాళీ చేసి, శివన్నగూడలో అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడీ ఊళ్లో చాలామందిది ఇదే పరిస్థితి.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లిలాంటిది అంటారు. ఏ కారణం చేతనైనా ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. అందునా బలవంతంగా ఊరి నుంచి పంపించే పరిస్థితి వస్తే కలిగే వేదన చెప్పనలవికాదు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు ఇప్పుడదే బాధను అనుభవిస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలంలో శివన్నగూడ రిజర్వాయర్ (Shivannaguda Reservoir) నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి వచ్చే రోడ్డు పూర్తిగా పోతోంది. కట్ట నిర్మాణం పూర్తయితే గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండానే ఉన్న ఊరి నుంచి తమను తరిమేస్తున్నారని నర్సిరెడ్డిగూడెం (Narsi Reddy Gudem) వాసులు ఆరోపిస్తున్నారు. వీరికి అధికారికంగా ఇళ్ల స్థలాలను కూడా అప్పగించలేదు. చాలామంది గ్రామస్తులు వేరేచోట ఇళ్లు కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం శివన్నగూడ ప్రాజెక్టు పనులకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) 2015, జూన్ 12వ తేదీన శంకుస్థాపన చేశారు. 14.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని అనుకున్నా పలు కారణాలతో 11.5 టీఎంసీలకు కుదించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3,465 ఎకరాల భూసేకరణ చేపట్టారు. అందులో పట్టా భూములు 2,900 ఎకరాలు ఉండగా, మిగతావి ప్రభుత్వ భూములు. పట్టా భూములకు మొదట్లో ఎకరానికి రూ.4.15 లక్షలు, ఆ తరువాత ఎకరానికి రూ.5.15 లక్షల చొప్పున చెల్లించారు. చదవండి: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'! ప్రస్తుతం ఎకరానికి రూ.8 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కింద నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల రైతుల భూములు కూడా సేకరించారు. అయితే, భూములకు పరిహారం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఇవ్వడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అందరికీ పెంచిన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఈ నాలుగు ముంపు గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు ఇచ్చారు. అయితే, సర్వే సమయంలో అందుబాటులో లేని కొంతమందికి అదీ అందలేదు. వీరికి చింతపల్లి మండల కేంద్రంలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నర్సిరెడ్డిగూడెంలోని 289 కుటుంబాలకుగాను 257 కుటుంబాలకే ఇచ్చారు. ఇంకా 32 కుటుంబాలకు అధికారికంగా ప్లాట్లను కేటాయిస్తూ పత్రాలు అందజేయలేదు. ఇప్పుడు కట్ట నిర్మాణం పేరుతో గ్రామాన్ని ఖాళీ చేయిస్తుండటంతో చేసేదేం లేక ఆ కుటుంబాలు వేరే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు మారిపోతున్నారు. నా కుమారుడికి ప్లాట్ ఇస్తలేరు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడికి ప్లాట్ ఇస్తామని హామీ ఇవ్వకపోవటంతో నర్సిరెడ్డిగూడెంలో మా ఇంటి దగ్గరే ఉంటున్నా. అధికారులు వెళ్లమంటున్నారు. నా కొడుక్కి ఇంటి స్థలం ఇస్తామని చెప్పే వరకు వెళ్లను. మాకు ఆరు ఎకరాల భూమి ఉండగా, ఒక్కో ఎకరానికి రూ.5.15 లక్షలే ఇచ్చారు. – కీలుకత్తుల సోమమ్మపట్టాలు ఇవ్వలేదు ఊరి నుంచి పంపిస్తే శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాం. చింతపల్లి మండలంలో ఇండ్లను కేటాయించారు.. కానీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈలోగానే ఊరు ఖాళీ చేయాలని చెప్పి పంపించేశారు. ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – బల్లెం పద్మమ్మ కిరాయి ఇంట్లో ఉంటున్నాం మా ఊరి జ్ఞాపకాలను మరువలేకపోతున్నాం. ఇప్పుడు సొంత ఇల్లు లేకుండా పోయింది. శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాను. కిరాయి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉన్న ఆరెకరాలు ప్రాజెక్టులో పోయింది. మొదటగా ఎకరానికి రూ.4.15 లక్షలు, తరువాత రూ.5.15 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారు. – సుంకరి జంగయ్య -
విహార యాత్రలో విషాదం
వెలుగోడు: సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు అంతా విహారయాత్రకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వెళ్లగా విషాదం చోటు చేసుకుంది. వారి ఇళ్లలో ఏదైనా వివాహం జరిగితే అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లి సంతోషంగా గడపటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఇనాయతుల్లా కుటుంబం ఆదివారం వీబీఆర్ పరిధిలో మద్రాస్ కాల్వ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఇనాయతుల్లా కుమారుడు ముక్కరం(14) ఈత కొడుతూ ప్రమాదశాత్తూ లోతైన గుంతలో ఇర్కుకొని ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించి ఫలితం దక్కలేదు. ఈ ఘటన పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే ఉరుసు సమయం కావడంతో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు వీబీఆర్ వద్ద విహార యాత్రకు వచ్చారు. ఇలాంటి తరుణంలో ముక్కరం మృత్యువాత స్థానికులను కలవరానికి గురి చేసింది. విద్యార్థి స్థానిక మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇనాయతుల్లా దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం కాగా ఉన్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
గోదావరి పరుగు
{పయోగ పరీక్ష విజయవంతం ముర్మూరు నుంచి బొమ్మకల్‌కు సరఫరా 30 ఎంజీడీల నీరు పంపింగ్ మరో రెండు నెలల్లో నగరానికి... సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీర్చే గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ప్రయోగ పరీక్ష (ట్రయల్ రన్) విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 58 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు మంగళవారం 30 ఎంజీడీల నీటిని పంపింగ్ చేశారు. ఈ నీటిని 3000 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ద్వారా బొమ్మకల్‌కు తరలించారు. పైప్లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్లైన్ల ఎయిర్‌వాల్వ్‌లు, జాయింట్లను పరిశీలించారు. ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా తరలించిన విషయం విదితమే. అక్కడి నుంచి బొమ్మకల్- మల్లారం - కొండపాక- ఘన్పూర్ మార్గంలో రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్లతో పాటు సుమారు 186 కి.మీ మార్గంలో పైప్లైన్ల పనులు పూర్తయిన విషయం విదితమే. గోదావరి తొలిదశ ద్వారా గ్రేటర్‌కు 172 ఎంజీడీల జలాలను తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి 30 ఎంజీడీల నీటిని ఒకే మోటారు ద్వారా పంపింగ్ చేస్తున్నారు. మొత్తం పంపింగ్‌కు అవసరమైన 9 మోటార్లను ముర్మూరు పంప్ హౌస్ వద్ద సిద్ధంగా ఉంచారు. -
వైఎస్ చలువతోనే
ప్రజలకు తాగునీరు వెలుగోడు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు, పరిసర గ్రామాల ప్రజలకు త్వరలోనే తాగునీరు అందించనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వెలుగోడు తాగునీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకూరు, పరిసర గ్రామాల 13గ్రామ పంచాయతీల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక అయిన నీటి పథకం పూర్తయిందని ఈనెల 10వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్న హామీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మొత్తం 12.5కోట్ల వ్యయంతో చేపట్టి ఈ పథకంలో తాగునీటి కష్టాలు దూరమవుతాయన్నారు. ఈ పథకానికి సంబంధించిన పంప్‌హౌస్, పైప్‌లైన్, మోటార్లు, జనరేటర్ల ఏర్పాటు తదితర విషయాలను ఆర్డబ్ల్యూఎస్ డీఈ వేడుకొండలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవిబాబు, సర్పంచ్ ఎంఏ కలాం, మాజీ సింగిల్‌విండో చైర్మన్ అన్నరపు శేషిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మద్దెల శంకర్‌రెడ్డి, జీవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.