బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచండి
ఇరిగేషన్ సమీక్షలో మంత్రి దేవినేని
ధవళేశ్వరం : జిల్లాలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం కాటన్ అతిథి గృహంలో ఇరిగేషన్ సర్కిల్, పోలవరం అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరికి 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినా ఇబ్బందులు లేనివిధంగా ఏటిగట్లను పటిష్టపరచాలన్నారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2017 నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేయని ఏజెన్సీలను తొలగించాలన్నారు.
తొర్రిగెడ్డ, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సీఈ హరిబాబు, ఎస్ఈ రాంబాబు, ఈఈలు కృష్ణారావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.