దార్శనికుడు బాబూజీ
దుష్టులు, స్వార్థపరులు, విదేశీయులు, ఆరోగ్యకర మైన పోటీకి నిలవలేని అసమర్థులు కల్పించిన అసమానతలనీ, అంటరానితనాన్నీ నిర్మూలించేందుకు అవిశ్రాంత పోరాటం సాగించిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్. ప్రజలు ఆయననే బాబూజీ అని పిలుచుకుంటారు. అందరిలా పుట్టినా పాఠశాల ప్రాయంలోనే కులం అనే విషపు కోరలు ఎంత వాడిగా ఉంటాయో చవిచూసిన వారు బాబూజీ. ఒక చేత విద్య అనే ఆయుధంతో కులరక్కసి మీద పోరా టం చేయాలని తీర్మానించుకున్నారు. అధికారంతోనే కొన్ని పనులు సాధ్యమన్న సత్యాన్ని అర్థం చేసుకుని రాజ్యాధికారంలో భాగమై ఎంపీగా, కేంద్ర మంత్రిగా చిరకాలం పనిచేశారు. జగ్జీవన్ (ఏప్రిల్ 5, 1908– జూలై 6, 1986) బిహార్లోని చాంద్వాలో పుట్టారు.
1922లో ఆరా నగరంలోని పాఠశాలలో చేరిన ప్పుడు కుల వివక్ష వికృతాన్ని బాబూజీ చూశారు. జగ్జీవన్ తాగిన కుండలోని నీటిని తాగడానికి అగ్ర కులాల వారు నిరాకరించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఆ కుండను పగుల కొట్టారు. 1925లో మదన్మోహన్ మాలవ్యా ఆరా వచ్చిన ప్పుడు జగ్జీవన్ స్వాగతం పలికారు. తరువాత మాలవ్యా ఆయనను బెనారస్ హిందూ విశ్వవిద్యాల యంలో చేరవలసిందిగా ఆహ్వానించారు. చాంద్వా లోని కొన్ని క్రైస్తవ మిషనరీలు కూడా బాబూజీ చదువు ఖర్చు భరించేందుకు ముందుకొచ్చాయి. కానీ తల్లిని విడిచి వెళ్లడం ఇష్టం లేక కాశీలోనే చేరారు. కానీ అక్కడ కూడా కుల వివక్ష ఎదురైంది. తన అభ్యు దయ భావాలతో ఎవరి పళ్లెం వారు కడుక్కునే విధంగా బాబూజీ విద్యార్థులందరిలోనూ మార్పు తెచ్చారు. కాశీలో ఇంటర్ పూర్తి చేసి, కోల్కత్తాలో బీఎస్సీ చదివారు. ఈ నగరంలోనే వెల్లింగ్టన్ కూడ లిలో 33 వేల మందితో మజ్దూర్ ర్యాలీ నిర్వహించి నేతాజీ బోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1934లో బిహార్ భూకంపం సంభవించినప్పుడు గాంధీజీతో పరిచయమైంది.
1935లో రాంచీలో హేమండ్స్ సంఘం ఎదుట దళితుల ఓటు హక్కు కోసం బాబూజీ గళం విప్పారు. 1936లో, 28 ఏళ్ల ప్రాయంలోనే ఆయన పార్లమెంటరీ జీవితం ఆరంభమైంది. 1946లో మధ్యంతర ప్రభుత్వంలో చేరవలసిందని కూడా ఆహ్వానం అందింది. దేశంలో అలాంటి పిలుపును అందుకున్న వారు కేవలం 12 మంది. అందులో ఏకైక దళితనేత బాబూజీ. స్వతంత్ర భారతంలో పలు పర్యాయాలు కేంద్ర మంత్రి పదవులు నిర్వహించినా 1971–74 మధ్య రక్షణ మంత్రిగా ప్రపంచ రాజకీయ పటంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసిన ఘనతను సాధించారు. పాకిస్తాన్ షరతులు లేకుండా లొంగి పోయింది. బంగ్లాదేశ్ అవతరించింది. మహా మేధా విగా వికసించినప్పటికీ భారత ప్రధాని బాధ్యతలు నిర్వర్తించగలిగిన అవకాశం కులరక్కసి కారణంగా ఆయనకు దూరమైంది. అదొక చీకటి అధ్యాయం. ఎన్నో సత్యాలను అవగతం చేసుకున్న ఈ తరం వారు కుల మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్యమిస్తేనే బాబూజీకి నిజమైన నివాళి అవుతుంది.
(నేడు జగ్జీవన్రామ్ జయంతి)
ఝాన్సీ కేవీ కుమారి
94404 04563