breaking news
aubergine
-
కాశీపట్నం వంగకు..భలే డిమాండ్
కాశీపట్నం వంకాయ అంటేనే ఇష్టపడని వారుండరు. భోజన ప్రియులు చెవికోసుకుంటారు. రుచికరంగా ఉండడంతో మన్యంతో పాటుగా మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్. కాశీపట్నం పరిసర గ్రామాల్లో పండిస్తున్న వంగను ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో కాశీపట్నంలో బుధవారం జరిగే వారపు సంత కళకళలాడుతోంది. కాశీపట్నం పంచాయతీ మండపరి గ్రామానికి చెందిన ఈమె పేరు బుచ్చమ్మ. ఎకరా భూమిలో సాగు చేపట్టి మంచి దిగుబడి సాధించింది. ప్రస్తుతం బుట్ట వంకాయలు రూ.500 నుంచి రూ.600 ధరకు విక్రయిస్తోంది. ఎకరాకు రూ.10 వేల వరకు ఆదాయం పొందుతోంది. ఈమె మాదిరిగానే కాశీపట్నం పరిసర ప్రాంతాలైన చిలకలగెడ్డ, గుమ్మకోం, ఎన్ఆర్పురం, భీంపోల్, గురుగుబిల్లి గ్రామాలకు చెందిన రైతులు కాశీపట్నం వంగను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. అనంతగిరి: కాశీపట్నం వంగకు అంతాఇంతా డిమాండ్కాదు. ఈ సాగు చేపట్టిన రైతులు నష్టపోయిన సందర్భాలు లేవంటే అతిశయోక్తికాదు. ప్రతీ బుధవారం కాశీపట్నంలో జరిగే వారపు సంతకు కాశీపట్నంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు వంగను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం సీజన్ కావడంతో కాశీపట్నం వంగతో వారపు సంత కళకళలాడుతోంది. ఎకరాకు రూ.15 వేల వరకు ఆదాయం అరకు–విశాఖ ప్రధాన రహదారిని అనుకుని చిరువ్యాపారులు రోడ్డుకు ఇరువైపులా కాశీపట్నం వంకాయలను విక్రయిస్తుంటారు. రోడ్డును ఆనుకొని వారపు సంత ఉన్నందున వినియోగదారులు, పర్యాటకులకు అనువు ఉంటుంది. అందువల్ల పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు కాపు ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెలలో టన్ను మేర సంతలో విక్రయాలు జరుగుతాయి. పెట్టుబడి పోను ఎకరాకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. సేంద్రియ విధానంలో సాగు ఖరీఫ్ సీజన్లో సేంద్రియ విధానంలో వంగను పండిస్తున్నారు. ఇసుకతో కూడిన ఎర్ర నేలలో బాగా దిగుబడి వస్తుంది. సాధారణ మొక్క కన్నా ఇక్కడ సాగు చేసే వంగ మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఒక్కో వంకాయ సైజు సుమారు 200 గ్రాముల పైబడే ఉంటుంది. సాధారణ వంగ సాగుకు నీరు అధికంగా ఉండాలి. ఇక్కడ సాగుచేసే వంగకు అధిక నీరు అవసరం లేదు. పంట కాలం మూడు నెలల ఉంటుంది.. గిరిజనులు సొంతగానే నార తీసి పొలంలోని వేస్తారు. 45 రోజులు గడిచిన తరువాత కాపు ప్రారంభమవుతుంది. ఇదీ ప్రత్యేకత కాశీపట్నం పరిసర ప్రాంతాల్లో పండించే వంగ రకానికి ముళ్ల ఉంటాయి. అంతేకాకుండా ముక్క గట్టిగా ఉంటుంది. కూర తయారు చేసిన తరువాత కూడా జావకాకుండా ముక్క మాదిరిగానే ఉండటం దీని ప్రత్యేకత అని రైతులు తెలిపారు. దేశవాళీ రకంగా వారు చెబుతున్నారు. పూర్వీకుల నుంచి ఇదే రకాన్ని సాగు చేస్తున్నామని వారు వివరించారు. సేంద్రియ విధానంలో సాగు వల్ల పోటపడి కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. వంగను పండించే గ్రామాలు : కాశీపట్నం, ఎన్ఆర్ పురం, భీంపోల్, గుమ్మకోట, చిలకలగెడ్డ, గరుగుబిల్లి పంచాయతీల్లో సారవానిపాలెం, సీతంపేట, నందకోట, మండపర్తి, పల్లంవలస, దాసరితోట, జీలుగులపాడు, బిల్లకోట, గుజ్జెలి, గొట్లెపాడు, తదితర గ్రామాల్లో గిరిజనులు వంగ సాగు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటూ, దిగుబడి బాగ వస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. డిమాండ్ పెరిగింది గతంతో పోలిస్తే కాశీపట్నం వంకాయకు డిమాండ్ పెరిగింది. మా గ్రామంలో పెద్ద ఎత్తున వంగ సాగు చేస్తున్నాం. గత నాలుగు వారాల నుంచి సంతలో మంచి ధర లభించింది.ఈ వారం ధర బాగానే ఉంది. పండించినందుకు ప్రతిఫలం దక్కింది. – రాము, గిరిజన రైతు, కాశీపట్నం వంగ సాగు వివరాలు గ్రామం ఎకరాలు కాశీపట్నం 60 చిలకలగెడ్డ 20 గుమ్మకోట 30 ఎన్ఆర్పురం 10 భీంపోల్ 30 గరుగుబిల్లి 10 -
‘ఓం’కాయ
ఆసక్తిగా తిలకిస్తున్న గ్రామస్తులు జియ్యమ్మవలస: ఓం కారంలోనే సమస్త ప్రపంచం ఇమిడి ఉందంటారు. అటువంటి ఓంకారం ఓ వంకాయలో ఇమిడి ఉంది. ప్రపంచం అంతా ఇమిడి ఉండే ఓంకారం వంకాయలో ఇమిడి ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే జిల్లాలో మారుమూల జియ్యమ్మవలస మండలానికి వెళ్లాల్సిందే. మండలంలోని శిఖబడి గ్రామంలో వంకాయలో ‘ఓం’ అక్షరం ఉండడంతో గ్రామస్తులు తండోపతండాలుగా చూడడానికి వస్తున్నారు. గ్రామానికి చెందిన చెన్నాపురం విజయలక్ష్మి కూర వండడానికి వంకాయను కోస్తుండగా అందులో ‘ఓం’ అనే అక్షర రూపం కనబడింది. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి గ్రామస్తులు ఆసక్తిగా ఆమె ఇంటికి వస్తున్నారు. కార్తీక మాసంలో ఇలా కనబడడం అదృష్టమని గ్రామస్తులు అంటున్నారు. -
అతిపొడవైన వంకాయ
అన్నానగర్: ఆర్గాన్ వ్యవసాయ శాస్త్రవేత్త కన్యాకుమారి గీతా ఇంటి పెరటిలో 15 అంగుళాల పొడవున్న వంకాయ కాచి స్థానికులను సంభ్రమకులను చేసింది. అదే వంగ చెట్టుకు 11 అంగుళాలున్న మరో వంకాయ కాసిందని గీత తెలిపారు. సేంద్రీయ ఎరువులు వాడడంతో కాయల పరిమాణం, బరువు, పోషకాల్లో గణనీయమైన వృద్ధి వుంటుందన్నారు. ఇందుకు తన పెరటిలో కాచిన వంకాయే నిదర్శనం అని ఆమె చెప్పారు. కోడిగుడ్ల పెంకులు, వాడి పారేసిన టీ, కాఫీ పొడుల ముద్దలు, ఉల్లిపాయ తొక్కలు, తరిగి తీసిన తొక్కలు(కూరగాయలవి), వాడి పోయిన పూలు, పేడ వంటి వాటినే తాను ఎక్కువగా పెరటిలోని మొక్కలకు ఎరువుగా వాడుతుంటానన్నారు. పెరడులో రాలిపోయిన పండుటాకులను అక్కడే ఒక చిన్న గొయ్యితీసి పాతిపెడితే అదే కొద్ది రోజుల తర్వాత ఆర్గానిక్ ఎరువులా పని చేస్తుందన్నారు. దీనిని ప్రత్యేకంగా తీసి మొక్కల పొదల్లో వేయాల్సిన పని లేదన్నారు. భూమి ద్వారానే ఈ చెత్త ద్వారా ఆర్గానిక్ మిశ్రమాలు మొక్కలను వాటంతట అవే అందుతాయన్నారు.