breaking news
Asiad
-
ఆసియాడ్‌లో భారత్‌కు 8వ స్థానం
ఇంచియోన్: ఆసియా గేమ్స్‌లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం 57 పతకాలు సాధించింది. వీటిలో 11 బంగారు, 10 రజత, 36 కాంస్య పతకాలున్నాయి. చైనా మొత్తం 343 పతకాలతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. వీటిలో 151 పసిడి పతకాలున్నాయి. దక్షిణ కొరియా, జపాన్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా గత ఆసియా గేమ్స్‌తో పోలిస్తే భారత్‌కు ఈసారి పతకాలు దక్కాయి. గత ఈవెంట్లో భారత్ 14 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 65 పతకాలు సాధించింది. -
వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు
ఇంచియాన్: ఏషియాడ్‌లో భారత బాక్సర్ల పంచ్ కాంస్యాలతో ముగిసింది. బరిలో మిగిలిన వికాస్ క్రిషన్, సతీశ్ కుమార్‌లు గురువారం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాలతో సంతృప్తి పడ్డారు. దీంతో ఓవరాల్‌గా 5 పతకాల (1 స్వర్ణం+4 కాంస్యాలు)తో భారత్ బాక్సింగ్ ఈవెంట్‌ను ముగించింది. గ్వాంగ్జౌ క్రీడల్లో భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో సత్తా చాటారు. పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) సెమీస్‌లో వికాస్ 1-2తో ప్రపంచ చాంపియన్ జానిబెక్ అల్మికన్లీ (కజకిస్థాన్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్లో భారత్ బాక్సర్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థికి 9-10తో వెనుకబడ్డాడు. అయితే రెండో రౌండ్లో మెరుపు దాడి చేస్తూ 10-9 స్కోరు సాధించాడు. మూడో రౌండ్లో కూడా ఇదే జోరు కనబర్చడంతో బౌట్ కజక్ బాక్సర్ సొంతమైంది. సూపర్ వెయిట్ (+91 కేజీలు) సెమీస్‌లో సతీశ్ 0-3తో ఇవాన్ డిచ్కో (కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. డిచ్కో దూరం నుంచి విసిరిన బలమైన పంచ్‌లకు సతీశ్ వద్ద సమాధానం లేకపోయింది. -
చక్ దే ఇండియా...
ప్రత్యర్థిగా దాయాది దేశం... ముఖాముఖి రికార్డూ అంతగా బాగాలేదు... లీగ్ దశలోనూ ఓటమి... ఎలాగైనా, ఈసారైనా గెలవాలనే ఒత్తిడి... ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు నరాలు తెగే ఉత్కంఠతను తట్టుకుంది. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అనే విధంగా అంతిమ సమరంలో అద్భుతం చేసింది. కీలక క్షణాల్లో సంయమనం కోల్పోకుండా ఆడింది. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ‘షూటౌట్’లో బోల్తా కొట్టించి టీమిండియా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో మళ్లీ పసిడి నెగ్గిన భారత్ 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. ఫైనల్లో పాక్‌పై విజయం ►16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం ►2016 ఒలింపిక్స్‌కూ అర్హత ఇంచియాన్: ఆధిక్యంలో ఉండటం... ఆ తర్వాత వెనుకబడిపోవడం... ఇటీవల కాలంలో భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో మాత్రం భారత ఆటగాళ్లు శక్తివంచన లేకుండా పోరాడారు. తొలుత 0-1తో వెనుకబడినా... ఆ తర్వాత బెదరకుండా, నమ్మకం కోల్పోకుండా స్కోరును సమం చేశారు. నిర్ణీత సమయం పూర్తయ్యాక విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లోనూ సంయమనం కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2016 ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ ‘షూటౌట్’లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, ధరమ్వీర్ సింగ్ సఫలమయ్యారు. మన్‌ప్రీత్ సింగ్ విఫలమయ్యాడు. పాకిస్థాన్ తరఫున మహ్మద్ వకాస్, రసూల్ సఫలంకాగా... హసీమ్ ఖాన్, ఉమర్ విఫలమయ్యారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ శ్రీజేష్ చాకచక్యంగా వ్యవహరించి పాక్ ఆటగాళ్ల రెండు షాట్లను నిలువరించి ‘హీరో’గా అవతరించాడు. అంతకుముందు ఆట మూడో నిమిషంలో మహ్మద్ రిజ్వాన్ గోల్‌తో పాకిస్థాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆట 27వ నిమిషంలో కొత్తాజిత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది. లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత ఆటగాళ్లు ఫైనల్లో బరిలోకి దిగారు. కానీ మూడో నిమిషంలోనే పాక్ గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చింది. అయితే భారత ఆటగాళ్లు వెంటనే ఈ పరిణామం నుంచి తేరుకున్నారు. సమన్వయంతో కదులుతూ పాక్‌పై ఒత్తిడిని పెంచారు. రెండో అర్ధభాగంలో భారత కృషి ఫలించింది. కొత్తాజిత్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి రెండు అర్ధ భాగాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలంకాలేదు. ►ఓవరాల్‌గా ఆసియా క్రీడల హాకీలో భారత్‌కిది మూడో స్వర్ణం. గతంలో టీమిండియా రెండుసార్లు (1966లో, 1998లో) బ్యాంకాక్‌లోనే జరిగిన క్రీడల్లో పసిడి పతకాలు గెలిచింది. ►ఆసియా క్రీడల ఫైనల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కిది రెండోసారి మాత్రమే. చివరిసారి 1966 క్రీడల ఫైనల్లో భారత్ 1-0తో పాక్‌పై గెలిచింది. ‘‘ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గడం నా కెరీర్లోనే గొప్ప విజయంగా భావిస్తున్నాను. పసిడి సాధించి రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇంచియాన్‌కు వచ్చాం. తుదకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాం. ఈ విజయంలో కోచ్ టెర్రీ వాల్ష్, సహాయక సిబ్బంది పాత్రను మరువలేం.’’ - సర్దార్ సింగ్, భారత కెప్టెన్ -
ఆసియా గేమ్స్: దుష్యంత్‌కు కాంస్యం
ఇంచియోన్: ఆసియా గేమ్స్‌లో ఐదో రోజు బుధవారం భారత షూటర్లు నిరాశపరిచారు. పతకాల వేటలో విఫలమయ్యారు. కాగా రోయర్ దుష్యంత్ చౌహాన్ మాత్రం కాంస్య పతకం సాధించాడు. పురుషులల లైట్ వెయిట్ సింగిల్స్ కల్స్ ఈవెంట్లో దుష్యంత్ మూడో స్థానంలో నిలిచి పతకం గెలుచుకున్నాడు. భారత్ ఓవరాల్‌గా 14వ స్థానంలో నిలిచింది. -
బీజం వేసింది మనమే!
ఒలింపిక్స్... నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా పండుగ... పేరుకు ప్రపంచ క్రీడలే అయినా ఒకప్పుడు ఒలింపిక్స్‌లో పతకాల సాధనలోనూ, ప్రాతినిధ్యంలోనూ పాశ్చాత్య దేశాలదే పైచేయి. ఏడు ఖండాల్లో ఆసియా పెద్దదైనప్పటికీ పాశ్చాత్య దేశాల ముందు దిగదుడుపే. ఒకటో అరో మినహాయిస్తే ఆసియా దేశాలు అప్పట్లో ఒలింపిక్స్‌లో పెద్దగా సాధించిందేమీ లేదు.. పేదరికం... క్రీడలపై అనాసక్తి... అరకొర వసతులు... ప్రపంచ క్రీడల్లో ఆసియాను వెనక్కినెట్టేశాయి. ఓటమే విజయానికి తొలిమెట్టు అన్నట్లు... ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలవడం ఆసియా క్రీడలకు బాటలు వేసింది. తమకూ ఒలింపిక్స్‌లా క్రీడలు ఉండాలన్న ఆలోచన ఏషియాడ్‌కు నాంది పలికేలా చేసింది. ఇంచియాన్‌లో క్రీడలు ఘనంగా ప్రారంభమైన నేపథ్యంలో ఏషియా గత చరిత్రపై ‘మైదానం’ స్పెషల్. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ‘గురుదత్ సోంధి’ పరిచయం లేని పేరు.. 66 ఏళ్ల కిందట లండన్‌లో గురుదత్ మెదడులో మెదిలిన ఆలోచన క్రీడల్లో ఆసియా జాతకాన్నే మార్చేసింది. ఒలింపిక్స్‌లో పాశ్చాత్య దేశాల జోరు కొనసాగుతున్న రోజుల్లో మనకంటూ ఓ క్రీడ ఉండాలని.. ఆసియా దేశాల ప్రతిభ చాటేందుకు అవి ఉపయోగపడాలని భావించారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే ‘ఆసియా క్రీడలు’.. ఇంతింతై అన్నట్లు ఆ ఏషియాడే ఇప్పుడు ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో ఆసియా దేశాల హవా కొనసాగేలా చేస్తోంది. లండన్‌లో పునాది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియాకు చెందిన చాలా దేశాలు స్వాతంత్య్రం సాధించాయి. ఈ సమయంలోనే ఆసియా క్రీడలకు పునాది పడింది. లండన్ ఆతిథ్యమిచ్చిన 1948 సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులు ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ను పునరుద్ధరిస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. అయితే భారత్‌కు చెందిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి గురుదత్ సోంధి మాత్రం ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావించారు. ఈ గేమ్స్ స్థానంలో కొత్తగా పోటీలను నిర్వహించాలని ఆసియా ప్రతినిధులకు సలహా ఇచ్చారు. ఈ సలహానే ఆసియా క్రీడలకు నాంది పలికినట్లయింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఏడాదికి ఆసియా గేమ్స్ సమాఖ్య ఏర్పాటైంది. అలా తొలి ఆసియా క్రీడలను నిర్వహించే అవకాశం న్యూఢిల్లీ దక్కించుకుంది. 1951లో తొలిసారిగా ఏషియాడ్‌ను నిర్వహించారు. ఒలింపిక్స్ తరహాలో నాలుగేళ్లకోసారి ఆసియా క్రీడలను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే రెండో ఆసియా గేమ్స్ మాత్రం మూడేళ్లకే అంటే 1954లో జరిగాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నాలుగేళ్లకోసారి ఆసియా పోటీలను జరుపుతున్నారు. ఏషియాడ్‌కు ముందు... ఆసియా క్రీడలు 1951లో మొదలైనప్పటికీ అంతకంటే ముందే ఒలింపిక్స్ తరహాలో మెగా టోర్నీ నిర్వహించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ పేరుతో జపాన్, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు 1912లో పోటీలకు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాతి ఏడాది (1913లో) మనీలాలో తొలిసారిగా ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ జరిగాయి. రెండేళ్లకోసారి 1934 వరకు మరో పదిసార్లు ఈ పోటీలను నిర్వహించారు. అయితే కొన్ని కారణాలతో చైనా తప్పుకోవడంతో 1938లో ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ రద్దయ్యాయి. భవిష్యత్తులో మార్పులు... 1954 నుంచి సరిసంఖ్య ఏడాదిలో ఆసియా క్రీడల్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అయితే త్వరలోనే ఇది బేసి సంఖ్య ఏడాదిలో నిర్వహించేందుకు ఓసీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఒలింపిక్స్‌కు రెండేళ్ల ముందు పోటీలను నిర్వహిస్తుండగా.. ఏడాది ముందే ఏషియాడ్‌ను నిర్వహించాలని ఆసియా ఒలింపిక్ మండలి నిర్ణయించింది. దీంతో వచ్చే ఆసియా క్రీడలు 2019లో జరగాల్సి ఉన్నప్పటికీ ఇండోనేషియాలో ఎన్నికల కారణంగా.. 2018లోనే ఏషియాడ్ జరిగే అవకాశాలున్నాయి. నిజానికి ఈ క్రీడల్ని వియత్నాం నిర్వహించాల్సి ఉంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ దేశం నిర్వహణపై గతంలోనే చేతులెత్తేసింది. దీంతో ఇండోనేషియా పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఇక 19వ ఆసియా క్రీడలను 2022కు బదులుగా 2023లో నిర్వహిస్తారు. ఒలింపిక్స్ కంటే ఏడాది ముందే ఈ పోటీలు జరిగేలా షెడ్యూల్లో మార్పులు చేశారు. సూపర్ పవర్ చైనా... ఆసియా క్రీడల్లో ఒకప్పుడు జపాన్ ఆధిపత్యం ప్రదర్శించినా... ప్రస్తుతం పతకాలు కొల్లగొడుతోంది చైనానే. ఎప్పుడు ఆసియా క్రీడలు జరిగినా పైచేయి ఆ దేశానిదే. మిగతా దేశాలవి ఆ తర్వాతి స్థానాలే. ఆసియా క్రీడల్లో ఇప్పుడు చైనాది రారాజు పాత్ర. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల నుంచి ఆ దేశం ఆధిపత్యం చాటుతూ వస్తోంది. మొత్తంగా చైనా ఏషియాడ్‌లో 1191 బంగారు పతకాలతో అగ్రస్థానంలో ఉంది. ఇక ఆసియా క్రీడల చరిత్రలో ఏ దేశం కూడా ఇప్పటిదాకా కనీసం వెయ్యి స్వర్ణాలు గెలవలేకపోయింది. క్రీడల్లో తమ దేశానికి ఉన్న ఆసక్తికి ఈ పతకాలే నిదర్శనమని చైనా క్రీడాకారులు గర్వంగా చెబుతారు. జపాన్ 910 బంగారు పతకాలతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. ఏషియాడ్‌లో అవీ ఇవీ 1951, 54, 58 ఆసియా క్రీడలు పెద్దగా వివాదాలేమీ లేకుండా జరిగినా... ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన 1962 ఏషియాడ్‌ను మాత్రం వివాదాలు చుట్టుముట్టాయి. రాజకీయ, మతపరమైన కారణాలతో ఇజ్రాయెల్, చైనా దేశాలను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా ఇండోనేసియా అడ్డుకుంది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏషియాడ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడమే కాకుండా ఇండోనేసియాపై నిషేధం విధించింది. 1970లో దక్షిణ కొరియా ఆర్థిక ఇబ్బందులు, ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా ఆసియా క్రీడలను నిర్వహించలేకపోయింది. దీంతో థాయ్‌లాండ్ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. ఇక 1970 నుంచే ఆసియా క్రీడలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతున్నాయి. 1974లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో చైనా, ఉత్తరకొరియా, మంగోలియా, ఇజ్రాయెల్ దేశాలు పాల్గొన్నాయి. అరబ్ దేశాలు వ్యతిరేకించినప్పటికీ ఇజ్రాయెల్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. 1978లో తొలుత సింగపూర్, ఆతర్వాత పాకిస్థాన్‌కు ఆసియా క్రీడల్ని నిర్వహించే అవకాశం వచ్చింది. కానీ ఇవి చేతులెత్తేయడంతో మరోసారి ఆసియా క్రీడలు బ్యాంకాక్‌లో జరిగాయి. తైవాన్, ఇజ్రాయెల్లను ఈ పోటీల్లో పాల్గొనకుండా గేమ్స్ ఫెడరేషన్ అడ్డుకుంది. మరోవైపు కొన్ని దేశాలు పోటీలకు ముందు క్రీడల నుంచి తప్పుకున్నాయి. 1981లో ఆసియా గేమ్స్ సమాఖ్య స్థానంలో ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) ఏర్పాటైంది. ఓసీఏ ఆధ్వర్యంలోనే 1982లో ఢిల్లీలో ఆసియా క్రీడలు జరిగాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కజకిస్థాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కెమినిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు 1994 ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కింది. పోటీలకు మహిళలు దూరం సౌదీ అరేబియా మహిళల ప్రాతినిధ్యం లేకుండానే ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతోంది. 199 మంది సభ్యుల బృందంలో ఒక్క క్రీడాకారిణికి కూడా చోటు దక్కలేదు. అయితే క్రీడల్లో పోటీపడే సత్తా తమ క్రీడాకారిణుల్లో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా అధికారులు చెప్పారు. కానీ అధికారులు కావాలనే మహిళల్ని ఎంపిక చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత పరమైన అడ్డంకుల వల్లే మహిళల్ని పోటీలకు దూరంగా ఉంచారని మానవ హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండేళ్ల కిందట లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో సౌదీ అరేబియా తరఫున ఇద్దరు మహిళలు బరిలోకి దిగారు. ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్లకే మళ్లీ క్రీడాకారిణుల్ని దూరంగా ఉంచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాంతి వివాదం 2006 దోహా ఆసియా క్రీడల సందర్భంగా భారత అథ్లెట్ శాంతి సౌందరాజన్ వివాదాల్లో నిలిచింది. మహిళల 800 మీటర్ల పరుగులో శాంతి.. రజత పతకం సాధించింది. అయితే శాంతి సౌందరాజన్ మహిళ కాదనే వాదనలు మొదలయ్యాయి. దీంతో శాంతికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఆ పరీక్షలో శాంతి విఫలం కావడంతో నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన దగ్గరి నుంచి శాంతికి కష్టాలు మొదలయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆమె సాధించిన విజయాలు గుర్తించింది. ఫలితంగా శాంతి ఇప్పుడు అథ్లెటిక్స్ కోచ్‌గా సేవలందించగలుగుతోంది. సాక్స్‌లో సెన్సర్ గ్వాంగ్జౌ ఏషియాడ్‌లో తైవాన్ క్రీడాకారిణి యాంగ్ షు చన్ తైక్వాండో పోటీల సందర్భంగా ఆమె వేసుకున్న సాక్స్‌లో అదనపు సెన్సర్ ఉన్నట్లు గ్రహించారు. దీంతో షు చన్‌పై మూడు నెలల నిషేధం విధిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజానికి తైక్వాండోలో క్రీడాకారులు వేసుకునే సాక్సుల్లో సెన్సర్లను ఉంచుతారు. ప్రత్యర్థిపై దాడి చేసినప్పుడు వారు సాధించిన పాయింట్ల కోసం వీటిని ఉపయోగిస్తారు. అయితే షు చన్ మాత్రం అదనపు సెన్సర్లను వినియోగించినట్లు తొలి రౌండ్ పోటీ సందర్భంగా బయటపడింది. అప్పటికే ఆమె 9-0తో ఆధిక్యంలో ఉంది. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. గుర్రంపై నుంచి కిందపడి... ఆసియా క్రీడల్లో విషాదకర ఘటన 2006 దోహా పోటీల సందర్భంగా చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈక్వెస్ట్రియన్ క్రీడాకారుడు కిమ్ హ్యుంగ్ చిల్ క్రాస్ కంట్రీ కోర్స్ సందర్భంగా ఎనిమిదో జంప్‌లో హఠాత్తుగా గుర్రంపై నుంచి కిందపడి పోయాడు. ఆ సమయంలో అతనిపై గుర్రం కూడా పడిపోయింది. స్పృహ కోల్పోయిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆసియా క్రీడల్లో ఒక క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.