breaking news
anthuleni katha
-
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో...
చిత్రం: అంతులేని కథ రచన: ఆత్రేయ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గానం: ఎస్. పి. బాలు ఎన్నో పాటలు వస్తాయి, ఎన్నో పాటలు పోతాయి. కాని కొన్ని పాటలు మాత్రమే బతికుంటాయి. నేటికీ సజీవంగా ఉన్న పాట ‘అంతులేని కథ’ చిత్రంలోని ‘తాళికట్టు శుభవేళ’. తమిళంలో కణ్నదాసన్ రచించిన పాటను ఆత్రేయ ఎంతో అందంగా తెనిగించారు. ‘ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో’ అంటూ మెడలో తాళికట్టడం మన చేతిలో ఉండదని, ఎవరికి ఎవరితో ముడి పడుతుందనేది బ్రహ్మ దేవుడు రాసి పంపుతాడని రాశారు మనసు కవి ఆత్రేయ. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటంతా మిమిక్రీతో కలిసి ఉంటుంది. ‘‘వికటకవిని నేను వినండి ఒక కథ చెబుతాను/కాకులు దూరని కారడవి /అందులో కాలం ఎరుగని మానొకటి/ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో/చక్కని చిలుకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు/ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా/బావా రావా నన్నేలుకోవా’’ అంటూ వచ్చే మొదటి చరణంలో ప్రతి వాక్యం తరవాత మిమిక్రీ వస్తుంది. ‘కాకులు దూరని కారడవి’ తర్వాత వచ్చే పక్షుల శబ్దాలలో కొన్ని శబ్దాలు, చిలుక గొంతులో ‘బావా బావా నన్నేలుకోవా’ అనే మాటలు స్వయంగా బాలునే మిమిక్రీ చేశారు. ఈ పాటలో మిమిక్రీకి ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు. ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు ‘నేరెళ్ల వేణుమాధవ్’ మా గురువులు రాజారామ్దాస్కి సన్నిహితులు. ఆయన ద్వారా వేణుమాధవ్‌గారిని కలిసి ఎలా నటించాలో నేర్చుకున్నాను. ఈ పాట ఎంతోమంది మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తి. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్ర కోసం ఎన్.టి. రామారావు, ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారిని ఇంటికి పిలిపించుకుని నాట్యం నేర్చుకున్నారు. అదేవిధంగా నేను మిమిక్రీ కళాకారుడిగా నటించడం కోసం నేరెళ్ల వేణుమాధవ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ‘‘మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా/వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా/ఊరేగుదారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా/శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా/గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవిం^è వచ్చెనమ్మా/కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా/నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా’’ అని సాగే చరణంలో ప్రతి వాక్యం పూర్తి కాగానే మిమిక్రీ బిట్ వస్తుంది. వీణ శబ్దం వచ్చే చోట మిస్టర్ అయ్యర్ తన గొంతులో పలికించారు. బాలచందర్ దగ్గర అసోసియేట్‌గా చేస్తున్న ఈరంకి శర్మ దగ్గరుండి నటన నేర్పించారు. ‘చేయీచేయిగ చిలుకగోరింక శయ్యకు తరలిరమ్మా/చెల్లెలి కోసం త్యాగం చేసిన చిలకమ్మ తొలగెనమ్మా/తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా/అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా’ అనే చరణంతో పాట ముగుస్తుంది. ఇందులో ‘చేయీచేయిగ చిలుకగోరింక’ అనే వాక్యాలకు ముందు వచ్చే మాండొలిన్లాంటి శబ్దం కూడా బాలు గారే అనుకరించారు. మిగతా శబ్దాలను ఎం.ఎస్. విశ్వనాథన్ వాద్య బృందంలోని మురుగేష్, సాయిబాబా, సదాశివం ఉరఫ్ సదన్ వారి వారి గొంతుల్లో పలికించారు. ఈ చిత్ర కథ మొత్తం ఈ పాటలో వచ్చేస్తుంది. ఈ పాటకు నలభై సంవత్సరాలు నిండినా నేటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పాటను వేదిక మీద పాడేటప్పుడు మాత్రం అన్ని శబ్దాలను ఎస్. పి. బాలు స్వయంగా చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరిగింది. నేను బాగానే నటించానని బాలచందర్ మెచ్చుకున్నారు. నా నటనలో ఏఎన్ఆర్ స్టయిల్ వస్తోందని, నా సొంత స్టైల్ డెవలప్ చేసుకోమని సూచించారు. నేను నటించిన మొదటి చిత్రంలోని నా మొదటి పాట ఇంత పెద్ద హిట్ కావడం నా జన్మలో మరచిపోలేను. నారాయణరావు సినీ నటుడు - ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ -
రంగురంగుల నలుపు
చూడచూడ బాధల జాడ వేరు. నిజమే కదా. మహిళ కష్టాలకు ఎన్ని కారణాలు! ఎన్ని కోణాలు! ఎన్ని నలుపులు! ఎన్ని నలుపులేంటీ?! మహిళకు కష్టం ఒక చీకటి అయితే, చీకటి రంగు నలుపు అయితే... ఆ నలుపునకు ఎన్ని రంగులు ఉంటాయో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. అందుకే ఇది అంతులేని కథ... అంతుచిక్కని వ్యథ. సినిమా చూస్తూ ఉంటే మెల్లగా ఓ తెలియని వెలితి ఏదో గుండెను నింపేస్తుంది. ఇది ఒక పొయెటిక్, ఫిక్షనల్ కథనం అయినా... మహిళల జీవితాలలో ఎప్పటికీ తెగని, తగ్గని కష్టానికి అద్దం పడుతుంది. సెన్సిటివ్ వ్యూయర్‌కి మాత్రం... అనాదిగా మహిళ కడుపులో తిప్పే బాధ, వ్యథ... సమాజం ఒడిలో ప్రసవించినట్టు అనిపిస్తుంది. సినిమా నిడివికి అంతు ఉంది. కాని అది చెప్పే కథ అంతులేనిది. మళ్లీ చూడండి ప్రతి అమ్మాయిలోనూ ఒక జయప్రద ఉంటుంది. నాన్న చేతులెత్తేసినప్పుడో, అన్న చేతకానితనంలోనో ఆమె బయటికొచ్చి కుటుంబం కోసం ఓ చెయ్యి వేస్తుంది. స్త్రీ తనను తానైనా వదిలించుకుంటుంది కానీ, బాధ్యతలను వదిలించుకుని వెళ్లిపోలేదు. అది ఆమె బలమా? బలహీనతా? లేక సహజ గుణమా?‘పెద్దపులి, పొగరుబోతు, గయ్యాళి, కొరకురాని కొయ్య, గర్విష్టి! ఇవన్నీ రోజూ సరిత పొందే బిరుదులు. (సరితంటే జయప్రద).జగమంత కుటుంబం ఆమెది!పిరికిభర్తకు భార్యగా, పసుపు కుంకుమలతో ఉన్న వితంతువు... తల్లి పార్వతి. ఆమె రెండవ కూతురు, సరిత చెల్లెలు భారతి. అక్క కన్నా ముందు తొందరపడి తలంబ్రాలు పోయించుకుని, అంతకన్నా తొందరగానే తలమాసి కూర్చున్న కన్నెపిల్ల. అన్నెం పున్నెం ఎరుగని మరో చెల్లెలు సుమతి. కన్న ఇంటికే కన్నం వేయడానికీ వెనుకాడని ప్రబుద్ధుడు అన్న మూర్తి (రజనీకాంత్). భరించలేని భర్తకు భార్యగా, ఆ ఇంటికో బరువుగా బ్రతుకు లాగుతున్న ఇద్దరు పిల్లల తల్లి కనకం. పుట్టించినవాడు పెట్టక మానడని ఏ కొరతా తెలియక పెరుగుతూన్న పసి హృదయాలు సీత, కుమార్. కళ్లు లేకున్నా కలలకు కరువు, ఆశలకు అదుపు లేని గుడ్డి తమ్ముడు రాజు. ఈ నిస్సహాయులకు, నిర్భాగ్యులకు తన నీడనంతా పంచి, తనకొక నీడను చూసుకోవాలనే తలంపును చంపుకుని ఎనిమిదేళ్లుగా ఆ కుటుంబలోనే వేళ్లు పాతుకుపోయిన మహావృక్షం, మనసుగల వృక్షం సరిత. ఆమె జీవితానికి గమ్యం ఎక్కడో, ఆమె త్యాగానికి అంతం ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఆమె కథ... అంతులేని కథ’. సినిమా ప్రారంభంలో జయప్రద ఇంట్రడక్షన్ ఇది. నిజానికి సినిమాలోని ప్రతి సీన్... ఆమె ఇంట్రడక్షన్లాగే ఉంటుంది. రాత్రి 1.25. మంచంపై పడుకుని ‘పోర్ట్నాయ్స్ క ంప్లైంట్’ పుస్తకం చదువుతోంది జయప్రద! ఇరవయ్యిల్లో ఉన్న జయప్రద. తొమ్మిది మంది ఉన్న ఇంట్లో ఒక్కటే అయిపోయిన జయప్రద. నిద్ర పట్టక ఆమె చదవడం లేదు. నిద్ర పట్టడానికీ చదవడం లేదు. చదువుతోంది అంతే. అవునూ... ఆమె చేతుల్లో ఆ పుస్తకమే ఎందుకు ఉంది? పుస్తకం తెరవగానే ఫస్ట్ పేజీలోనే... లోపల ఏం ఉందో చెప్పేస్తాడు పుస్తక రచయిత ఫిలిప్ రోత్. ‘అంతులేని కథ’... ఎవరి కథో సినిమా మొదట్లోనే కె.బాలచందర్ చెప్పేసినట్టు.ఒక్క ముక్కలో : నైతిక కట్టుబాట్లకు, భౌతిక పట్టువిడుపులకు మధ్య సాగే సిగ్గులేని సంఘర్షణ... పోర్ట్నాయ్స్ కంప్లైంట్. బాలచందర్ ఎవర్నీ నేరుగా చూపించరు. వేరేచోట్నుంచి బయటికి లాగుతారు. ఇక్కడ ఆయన చూపించదలచుకుంది జయప్రదను కాదు. రజనీకాంత్‌ని. అంత రాత్రప్పుడు లస్ట్-రిడెన్గా ఉన్న రజనీకాంత్‌ని రిప్రెజెంట్ చేయడానికి జయప్రద చేతిలో ఆయన ఆ పుస్తకం పెట్టారని.. సీన్ కొనసాగింపులో తడుతుంది. జయప్రద బుక్ చదువుతోంది. బయట చంటిపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది. వాడు ఏడుపు ఆపడం లేదు. ఎవరూ వాడి ఏడుపును ఆపడం లేదు. జయప్రద బయటికి వస్తుంది. మంచాల మధ్య... నేలపై చాప. చాపపై పిల్లాడు. గుక్కపట్టి ఏడుస్తుంటాడు. ‘వదినా.. వదినా....’ అని పిలుస్తుంది జయప్రద. వదిన రాదు. పక్కనే ఉన్న చెల్లి మేల్కొంటుంది. ‘వదినెక్కడ’? అని అడుగుతుంది చెల్లిని. ‘అక్కడే పడుకుని ఉండాలే’ అని అంటుంది చెల్లి. వాణ్ని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ‘వదినా’ అని పిలుస్తుంది. వదిన రాదు. వదిన భర్త రజనీకాంత్ గది బయటికి వచ్చి తలుపుకు ఆనుకుని నిలబడతాడు. ఒంటి మీద చొక్కా లేకుండా. వట్టి లుంగీతో. జయప్రద అసహ్యంగా చూస్తుంది. రజనీకాంత్ నిర్లక్ష్యంగా చూస్తాడు. పిల్లాడు ఏడుపు ఆపడు. ‘వదినా’ అని ఇంకోసారి పిలుస్తుంది. కొన్ని క్షణాల తర్వాత అదే గదిలోంచి (రజనీకాంత్ వచ్చిన గది) చీరను భుజం చుట్టూ కప్పుకుంటూ వచ్చి ఆడపడుచు చేతుల్లోంచి బాబును అందుకుని వెళ్లిపోతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ మళ్లీ పడకల్లోకి సర్దుకుంటారు. జయప్రద తన గదిలోకి వెళుతుంది. వెళ్లి, వెనక్కు తిరిగి రజనీకాంత్‌ను చూస్తుంది. ‘హు.. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి, దాహం తీర్చడానికి ఒక తల్లి, కామదాహం తీర్చడానికి ఒక పెళ్లాం. ఛీ.. సిగ్గులేని జన్మ’ అని ముఖం మీదే తలుపులు దడేల్మని వేస్తుంది. పరిస్థితులతో వెక్స్ అయిపోయిన అమ్మాయి అలాగే మూసేస్తుంది. తనను తనూ మూసేసుకుంటుంది. అంతులేని కథ 1976లో విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 40 ఏళ్లు. కథంతా ముందే చెప్పేసి, కథనంతో సినిమాను ప్లే చేశారు బాలచందర్. క్లాసిక్‌గా నిలబడి పోయింది. కథ ఎం.ఎస్.పెరుమాళ్. మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ. సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్. స్వరామృతం జేసుదాస్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పీబీ, ఆనంద్. అంతా కలిసి సినిమాను నిలబెట్టారు. సినిమాతో పాటు నిలిచిపోయారు. రజనీకాంత్‌కి, నారాయణరావుకు ఇది తొలి చిత్రం. జయప్రదకు, ఫటాఫట్ జయలక్ష్మికి, శ్రీప్రియకు, చిన్నాచితక చిత్రాల తర్వాతి చిత్రం. కమలహాసన్... ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే గెస్ట్ రోల్ చేసిన చిత్రం. ఫైట్లు లేవు. డ్యూయెట్లు లేవు. సెట్టింగులు లేవు. హీరోల్లేరు. విలన్లు లేరు. కేవలం మనుషులు, వారి స్వభావాలు మాత్రమే ఉన్నాయి అంతులేని కథలో. షూటింగ్ కూడా ఒకేచోట వైజాగ్‌లో ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లో జరిగింది.జయప్రద వర్కింగ్ ఉమెన్. ఇంట్లోవాళ్లందరి కోసం తనొక్కతే కష్టపడి పనిచేస్తుంటుంది. తన గురించి మర్చిపోతుంది. త్యాగానికి కూతురు, త్యాగానికి చెల్లి, త్యాగానికి అక్క, త్యాగానికి అత్త... అన్నీ అవుతుంది. భార్యగా త్యాగమూర్తి కావడమే మిగిలింది. సినిమా ఎండింగులో ఆ త్యాగాన్ని కూడా చేస్తుంది. భర్తగా కాబోయే కమలహాసన్‌ను ఆఖరి నిమిషంలో (రజనీకాంత్‌ని ఎవరో చంపేశారన్న వార్త తెలిసిన నిమిషంలో) ఒప్పించి అదే ముహూర్తానికి చెల్లికి భర్తను చేస్తుంది. సినిమాలో జయప్రద సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అంతులేని కథలో ఆమెను చూస్తుంటే... ఆమెలోని హోప్ మీద, డిటర్మినేషన్ మీద చచ్చేంత అట్రాక్షన్ కలుగుతుంది. స్ట్రాంగ్ విల్డ్ ఉమన్. అంత స్ట్రాంగ్‌గా ఉన్న మనిషికి తన దారి తను చూసుకునే ధైర్యం కూడా ఉంటుంది. సంపాదిస్తోంది కనుక. కానీ ఆలా చూసుకోలేదు. తండ్రి వదిలించుకుని వెళ్లిన బాధ్యతల కోసం, అన్న భుజంపై వేసుకోని బరువుల కోసం స్ట్రాంగ్‌గా నిలబడింది. మొదట్లో జయప్రదను ఇంట్రడ్యూస్ చేసినప్పుడే... రీ ఇంట్రడ్యూస్ కూడా చేస్తాడు బాలచందర్. మంచులా కరిగిపోయే సరిత మనసు ఎందరికి తెలుసు? నిజాయితీలో నిప్పులా, నియమాలలో కత్తిలా, కర్తవ్య నిర్వహణలో కటిక పాషాణంలా కనిపిస్తుంది. కానీ రాళ్లల్లో కూడా నీళ్లుంటాయని తెలిసినవాళ్లెందరు? ఆమె కళ్లల్లో కన్నీళ్లు, ఆమె మనసులో మంచితనం చూడగలవాళ్లెవ్వరూ లేరు... అంటారు.. జయప్రదకు నా అన్నవారు ఎవరూలేరా? ఒక స్నేహితుడు ఉంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ తను పెళ్లిచేసుకుని వెళ్లిపోతే తన ఫ్యామిలీ ఎలా అని ఆలోచిస్తుంది. ఆ స్నేహితుడి మనసు క్రమంగా ఆమె చెల్లి (వితంతువు శ్రీప్రియ) వైపు మళ్లుతుంది. ఆమెకు ప్రేమలేఖ కూడా రాస్తాడు. ఇది తెలిసి వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తుంది జయప్రద. (ఆ తర్వాతే కమల్ ప్రపోజల్ వస్తుంది). సినిమా ప్రారంభంలో ఆమె జీవితం ఎలా మొదలవుతుందో... సినిమా ముగింపులోనూ అదే విధంగా మొదలౌతుంది. మార్పు లేదు. అంతిమ తీర్పూ లేదు. - సాక్షి ఫ్యామిలీ మరపురాని పాటలు దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (జేసుదాస్) కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు (ఎస్.జానకి) అరె ఏమిటి లోకం... (ఎల్.ఆర్.ఈశ్వరి) తాళికట్టు శుభవేళ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) ఊగుతోంది నీ ఇంట ఉయ్యాల(పి.సుశీల)