breaking news
Antarmathanam
-
అంతర్మథనంలో ఆచార్యులు
కుల పరిమితుల మీద రామానుజుడి వాదం సరైనదే. అయినా పెద్దలు ఈవిధంగా వ్యవహరించారనే ఉదాహరణగా మిగలడం తనకు ఇష్టం లేదు. ‘‘నా తక్కువ కులం నిజమే కదా రామానుజా. ఆమెకు తెలిసింది ఆమె చేసింది. తప్పేముంది. నాకు తగిన గౌరవాన్ని ఇచ్చిందనే నేననుకుంటున్నాను. నీకు నాపై అంతకుమించిన అభిమానం ఉంది, అది నా భాగ్యం. వరదరాజుని దయ అనుకుంటాను. నాకే బాధాలేదు సరేనా’’. కాంచీపూర్ణుల వ్యక్తిత్వం మీద నానాటికీ రామానుజుడిలో అభిమానం పెరుగుతూ వచ్చింది. ఆయనను మించిన గురువు దొరకడేమోనని అనుకున్నాడు. వారి దగ్గర శిష్యుడిగా నేర్చుకోవలసింది చాలా ఉందని భావించాడు. అందుకే ఆచార్యుడి భుక్తశేషం తీసుకోవాలని అభిలషించినాడు. కాని రక్షకాంబ తను గురువనుకుంటున్న అతిథిని నిరాదరించి అవమానించిందని ఆగ్రహించాడు. ఎప్పుడూ అంత కోపం రాలేదు. కాని కోపాన్ని అణచుకున్నాడు. మాటల్లో కాఠిన్యం తగ్గించేందుకు ప్రయత్నించాడు. భర్త ఆదరించిన పెద్దమనిషిని తాను కూడా ఆదరించాలన్న మర్యాద లేకపోవడం ఆమె చేసిన తొలి తప్పు అని నిర్ధారణ జరిగింది. ఇక మిగిలిన అవగాహన ఏముంది? ఆచార్యుని వివాహ జీవితానికి ఇది తొలి దెబ్బ. కాంచీపూర్ణుల సాన్నిధ్యమే తనకు ప్రశాంతతనిస్తుంది. అందుకే మళ్లీ కాంచీపూర్ణుడి చెంత కూర్చుని ఆయనతో చర్చలలో పడ్డారు. కాని అతని మనసంతా సందేహాస్పదంగా ఉన్నట్టు ఆయనకు అర్థమైంది. ‘‘నాయనా రామానుజా, నీ మాటల్లో మనసులో ఏదో సందేహం ఉన్నట్టు నాకు అర్థమవుతున్నది. మనసులో ఏ బాధా పెట్టుకోకు... నిస్సంకోచంగా అడుగు. నిశ్చింతగా ఉండు.... నీకేదో అడగాలని ఉన్నట్టుంది కదూ..’’‘‘అవును స్వామీ నన్ను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఆ సందేహాలకు వరదుడే సమాధానాలు చెప్పాలని మనసు కోరుకుంటున్నది స్వామీ. మీరు అడిగితే పెరుమాళ్ కాదనరు కదా ఆచార్యా’’ ఆరు దివ్యసమాధానాలు రామానుజుడు వెళ్లిపోయిన తరువాత కాంచీ పూర్ణులు వరదరాజస్వామి సన్నిధిలో కూర్చున్నారు. వారికి ఆత్మనివేదనం చేస్తున్నారు. వరదరాజ పెరుమాళ్ వింటున్నారు. ‘‘నంబీ (కాంచీపూర్ణులను తిరుక్కచ్చినంబి అనీ నంబీ అని పిలుస్తారు) నీ మనసులో ఏదో అడగాలనుకుంటున్నావు కదూ’’‘‘అవును భగవాన్, రామానుజుడు సాయంత్రం నా దగ్గర కూచుకున్నాడు. ఆతని మనసులో కొన్ని సందేహాలున్నాయి. వాటికి సమాధానాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని కోరినాడు ప్రభూ. తను అనుకున్నవి నెరవేరతాయా అనే ప్రశ్న అనుకుంటాను. ఏదో నిరాశగా ఉన్నాడు. మధనపడుతున్నాడు. ఆయన సందేహాలేమిటో చెప్పడు. నేనూ అడగలేదు. మీ సమాధానాలతో ఆయన సందిగ్ధత తీరుతుందేమోనని నేనూ అనుకుంటున్నాను’’. ‘‘అవునా, అతని పరిస్థితి నాకు తెలుసు. నా సంకల్పం తెలిసిన వాడే. యువకుడు, నా ప్రియసేవకులలో ఉత్తముడు. ఈ జన్మలో రామానుజుడికి అనేకమంది నుంచి గురూపదేశాలు లభిస్తాయి. కాని అవన్నీ లాంఛన ప్రాయమే. నేను ఆచార్యసాందీపని నుంచి ఉపదేశాలు స్వీకరించినవిధంగా. ఆయన మనోవేదన ఏమిటో మీకూ చెప్పలేదు కదా..నేను అతని పద్ధతినే అనుసరిస్తాను. ప్రశ్నలు లేకుండానే సమాధానాలే ఇస్తాను. యధాతథంగా నీవు అతనికి అందించు’’ అన్నారు పెరుమాళ్. రామానుజునికి వరదునికి మాత్రమే తెలిసిన ఆరు ప్రశ్నలకు వరదుని దివ్య సమాధానాలు ఇవి: (ప్రశ్నలతో సహా) 1. రామానుజ: సకల దేవతలలో పరాత్పరుడు ఎవరు? వరద: నేనే పరతత్వాన్ని, పరమ సత్యాన్ని. 2. రామానుజ: ఆత్మపరమాత్మఒకటేనా? వరద: ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేదే పరమసత్యం. 3. రామానుజ: మోక్షసాధనకు నాలుగు ఉపాయాలలో శ్రేష్ఠమైన ఉపాయమేది? వరద: నా చరణాలను చేరడానికి ఆత్మశరణాగతి, ప్రపత్తి.. ఏకైక సులభమైన శ్రేష్ఠమైన మార్గం 4. రామానుజ: ప్రపన్నునికి మరణసమయంలో భగవన్నామ స్మరణ చేయడం అవసరమా? కాదా? వరద: నాకు సంపూర్ణశరణాగతిచేస్తే శరీరత్యాగ సమయంలో నన్ను ధ్యానించి స్మరించాల్సిన అవసరం కూడా లేదు. 5. రామానుజ: ప్రపన్నుడికి మోక్షం ఎప్పుడు? వరద: శరీరభావం నుంచి ముక్తుడైనప్పుడే ఆ జీవి నా సన్నిధిలో శాశ్వతంగా నిలుస్తాడు. 6. రామానుజ: నేను ఏ ఆచార్యుడి వద్ద ఆశ్రయం పొందాలి? వరద: మహాపూర్ణుడే రామానుజుని ఆచార్యుడు. ఆయన చరణాలు చేరాలి. కాంచీపూర్ణులు ‘‘ధన్యోస్మి స్వామీ, రామానుజుడి మనసు ఈ సమాధానాలతో శాంతిస్తుంది. సేద దీరి కర్తవ్యోన్ముఖుడవుతాడు’’. అని వరదుని సెలవుతీసుకుని త్వరగా రామానుజుడికి సమాధానాలు తెలియజేశారు. భవిష్యదాచార్యుడిని రామానుజుడిలో చూచి కాంచీపూర్ణుడు సంతోషిస్తే మార్గదర్శనం లభించినందుకు రామానుజుడు ఆనందించాడు. ఏ ప్రశ్నలు సామాన్యుడిని పదేపదే వేధిస్తాయో, ఏ సందేహాలకు నిర్దిష్టమైన సమాధానాలు అవసరమో ఆలోచించి మనసులో ప్రశ్నలుగా తీర్చిదిద్దుకున్నాడు రామానుజుడు. రాబోయే వేల సంవత్సరాలలో భక్తుడైన మానవుడు అడిగే ప్రశ్నలు ఇవే. ఆరోది మాత్రమే రామానుజుడి వ్యక్తిగత సందేహం. అయిదు పరమ సత్యాలు వరదుడిచ్చిన వరాలు. నిజంగా ఆయన వరదుడే. వరదుడిచ్చిన జవాబులు సరిపోయినాయా రామానుజా అని కాంచీపూర్ణుడు అడిగితే, తప్పకుండా... ప్రతిప్రశ్నకు సూటైన సమాధానం లభించింది మీ ద్వారా. పైకి చెప్పని నా సందేహాలకు సమాధానం వరదుడే ఇవ్వడం అంటే నాదెంతో మహాభాగ్యం. నా పూర్వీకులు ఎంత పుణ్యం చేస్తేనో ఈ మహద్భాగ్యం లభించింది. అవును నీవు అందరికన్నా దైవానుగ్రహం నిండా కలిగిన వాడివి. అన్నారు కాంచీ పూర్ణుడు. వరదుని ఆదేశం ప్రకారం, ఇక మహాపూర్ణుడిని ఆశ్రయించడమే తక్షణ కర్తవ్యమని భావించిన రామానుజుడు సెలవు గైకొన్నాడు. ప్రయాణానికి సిద్ధం అవుతున్నాడు. అక్కడ శ్రీరంగంలో యామునాచార్యుల శిష్యులంతా మహాపూర్ణుల చుట్టూ చేరి శ్రీవైష్ణవ పీఠాన్ని అధిరోహించగల అర్హతలున్న రామానుజుడిని శ్రీరంగానికి రప్పించాలని కోరారు. సరే అయితే కంచికి బయలుదేరతాను అన్నారు. అక్కడ రామానుజుడు కంచినుంచి బయలుదేరడం, శ్రీరంగంనుంచి బయలుదేరి మహాపూర్ణుడు రావడం దాదాపు ఒకేసారి జరిగాయి.కంచీపురం నుంచి బయలుదేరిన రామానుజుడు మధురాంతం చేరుకున్నారు. కోదండ రాముని దర్శనం చేసుకోవడానికి ఆలయంలోకి ప్రవేశించగానే మహాపూర్ణులు కనిపించారు. ‘‘నాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి. మీ శిష్యుడిగా చేరడానికి శ్రీరంగానికి నేను ప్రయాణమై మధ్యలో ఇక్కడ ఆగడం మీరు ఇక్కడే నాకు లభించడం నా అదృష్టం’’ అన్నాడు. ‘‘నేనూ నీకోసమే కంచికి వస్తున్నాను...నిన్ను శిష్యుడిగా స్వీకరించడం నాకూ సంతోషమే నాయనా... అయినా తొందరేముంది, శ్రీరంగంలోనో లేక కంచిలోనో గురూపదేశం చేస్తాను..’’ అని మహాపూర్ణులు అన్నారు. ‘‘స్వామీ, మీకూ తెలుసు, మనం ఎంత తొందరపడ్డా సమయానికి చేరలేకపోవడం వల్ల శ్రీరంగం లో ఏం కోల్పోయామో..ఈ శరీరాల్లో ఎవరెంతసేపు ఉంటారో ఎవరికి తెలుసు. ఇంక ఆలస్యం వద్దు...కంచికి చేరేదాకా అని వాయిదా వేయడం సరికాదని నాకనిపిస్తున్నది’’. ‘‘జ్ఞానం కోసం ఎంత తపన’’ అనుకున్నారాయన. ‘‘సరే కానీ ఆ వకుళ వృక్షం దగ్గరకు వెళ్దాం పద’’ అని కోదండరామాలయం ముంగిటి విశాల ప్రదేశానికి కదిలారు. రామానుజుడికి కుడివైపు కూర్చుని, కుడిచేతిని రామానుజుని శిరస్సున ఉంచి, ఎడమచేతిని çహృదయం మీద ఉంచుకుని, శిష్యుని కళ్లలోకి చూస్తూ, మనసులో యామునాచార్యులను ధ్యానం చేస్తూ, గురుపరంపరను తలచుకుంటూ, అష్టాక్షరీ మంత్రమును ద్వయ మంత్రమును ఉపదేశించారు. చక్రాంకణములు చేసినారు. సంస్కృత ద్రావిడ వేదములు ప్రమాణములు, భగవంతుడు ప్రమేయము (ప్రమాణముద్వారా తెలుసుకోవలసిన వాడు భగవంతుడు), ఈ జ్ఞానమును ప్రసాదించు ఆచార్యుడు ప్రమాత. ప్రమాణ ప్రమేయ ప్రమాతలనే సత్యత్రయమును ఉపదేశించిన తరువాత రామానుజులు పెరియనంబి (మహాపూర్ణులు) చేత మంత్ర దీక్ష తీసుకున్నారు. తండ్రి వాగ్దానం కారణంగా రాజ్యం తీసుకునే వీలు లేనందున, తన ప్రతినిధిగా పాదుకలను, పాలనను భరతుడికి వదిలి రాముడు అరణ్యదీక్ష తీసుకున్నట్టు, నీకు ఉపదేశం చేయడానికి సమయం చాలక తన ప్రతినిధిగా నీకు మంత్రోపదేశం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. నిజానికి నీకు ఆచార్యత్వం వహించాల్సింది నేను కాదు. నా ద్వారా యామునాచార్యుడే. ‘‘ఆచార్యవర్యా.. నాకు ఒక విషయంలో దారిచూపండి స్వామీ, సాధకుడెవరు, సాధించవలసిన లక్ష్యం ఏమిటి. ఆ సాధనా మార్గం ఏమిటి?’’ ‘‘కాంచీపురాన వెలసిన వరదరాజ పెరుమాళ్ మనం సాధించవలసిన గమ్యం, లక్ష్యం కూడా.. ఆయనను చేరడానికి నీవు ఉపదేశం పొందిన ద్వయమంత్రాలే సాధనాలు. సాధకుడివి నీవే. ఇక సాధనాలను ఉపయోగించి సాధించవలసిన బాధ్యత కూడా నీదే’’రామానుజులు గురువును, గురుపత్నిని వెంటబెట్టుకుని కాంచీపురం బయలుదేరారు. వారిరువురికి వసతి ఏర్పాటు చేసి ఆరునెలలపాటు వారి వద్ద దివ్యప్రబంధమును ఇతర శాస్త్రాలను అధ్యయనం చేశారు. వ్యాససూత్రాలు, నాలాయిర ప్రబంధంలో రెండు వేలపాశురాలు, నేర్చుకున్నారు. శఠగోపముని రచనలు తప్ప మిగిలినవన్నీ మహాపూర్ణుల వారు రామానుజుడికి నేర్పారు. రామానుజుని ఏకసంథాగ్రాహిత్వం, విమర్శనా రీతిని గమనించి మహాపూర్ణులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఇంట్లో ఉండగా ఒక శ్రీవైష్ణవుడు వచ్చాడు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. ఆకలితో వణికిపోతున్నాడు. అది గమనించిన రామానుజుడు, ‘‘తంజా ఈ బ్రాహ్మణుడు చాలా ఆకలితో ఉన్నట్టుంది. సాపాటు వడ్డించు’’ అని చెప్పారు. ఇంకా వంట పూర్తికాలేదు స్వామీ. అని జవాబిచ్చింది. ‘‘సరే అయితే నిన్న వండగా మిగిలిన పదార్థాలేమయినా పెట్టు’’ అన్నారు. ‘‘అయ్యో అవి కూడా లేవండి..’’ అన్నది తంజ.తన భార్య సంగతి తెలుసు కనుక రామానుజుడు, ఏదో పనిమీద ఆమె బయటకు వెళ్లిన వెంటనే వంటయింటిలోకి వెళ్లి చూశారు. ముందే వండిన అనేక తిండి పదార్థాలు ఇంట్లో ఉన్నాయి. భార్య ఇంటికి రాగానే...‘‘ఇది రెండో సారి భాగవతులకు అపచారం చేయడం. పాపం ఆ వైష్ణవుడు ఆకలికి కింద పడిపోయే విధంగా ఉన్నాడు. అయినా నాతో అబద్ధం ఆడి, అతనికి భోజనం వడ్డించడానికి నిరాకరించావు. ఇంకోసారి ఈ తప్పు జరగకూడదు’’ అని హెచ్చరించారు. మరో సందర్భంలో తంజమ్మ, గురువుగారైన మహాపూర్ణుల వారి భార్య నీళ్లకోసం బావికి వెళ్లారు. తంజమ్మ స్నానంచేసి మడి కట్టుకుని బిందెతో నీళ్లుతీసుకుని బయలు దేరారు. అదే సమయంలో పెరియనంబి భార్య బట్టలు ఉతికి జాడిస్తూ ఉంటే రెండు చుక్కల నీరు ఈమె బిందెలో పడింది. తంజమ్మ ఉగ్రురాలై బిందెలోనీళ్లు గుమ్మరించి తన శుచికి భంగం ఏర్పడిందని కోపంతో తీవ్రంగా నిందించారు. ఆమె పొరబాటైందని, చూడలేదని ఎంత చెప్పినా వినకుండా నానామాటలూ అన్నారు. ఈమెకు తోడు మరికొంతమంది బ్రాహ్మణ స్త్రీలు కూడా కలవడంతో ఆమె అవమానంతో వెళ్లిపోవలసి వచ్చింది. తంజమ్మ మళ్లీ స్నానం చేసి బిందెడు నీళ్లు తీసుకుని ఇంటికి వచ్చింది. బాధపడుతూ భార్యచెప్పిన విషయం తెలుసుకున్న మహాపూర్ణులు ఇక కంచి లో ఉండి ప్రయోజనం లేదని గ్రహించి ఆమెను తీసుకుని శ్రీరంగం వెళ్లిపోయారు. భవిష్యదాచార్యుడిని రామానుజుడిలో చూచి కాంచీపూర్ణుడు సంతోషిస్తే మార్గదర్శనం లభించినందుకు రామానుజుడు ఆనందించాడు. ఏ ప్రశ్నలు సామాన్యుడిని పదేపదే వేధిస్తాయో, ఏ సందేహాలకు నిర్దిష్టమైన సమాధానాలు అవసరమో ఆలోచించి మనసులో ప్రశ్నలుగా తీర్చిదిద్దుకున్నాడు రామానుజుడు. రాబోయే వేల సంవత్సరాలలో భక్తుడైన మానవుడు అడిగే ప్రశ్నలు ఇవే. ఆచార్య మాడభూషి శ్రీధర్ -
‘దేశం’లో అంతర్మథనం
⇒ జెండాలు మోసి ఏం ప్రయోజనం ⇒ పదవులు లేవు-నిధులు రావు ⇒ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదు ⇒ కార్యకర్తలు,ప్రజల తిట్లు తప్పడంలేదు సాక్షి, చిత్తూరు: ఎనిమిది నెలల పాలన ముగిసినా పైసా నిధులు లేవు-చేద్దామంటే పనులు లేవు. నామినేటెడ్ పోస్టులైనా భర్తీ చేస్తారనుకుంటే .. అదీ లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజల చీత్కారం ఎదుర్కోవాల్సి వస్తోంది...అంటూ టీడీపీ కేడర్‌లో అంతర్మథనం మొదలైంది. ఆది నుంచి పార్టీ జెండాలు మోసి, ఆరోగ్యం క్షీణించి, ఆర్థికంగా నష్టపోయినా అధిష్ఠానం కనికరించలేదని తెలుగుతమ్ముళ్లలో అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. గ్రామ స్థాయిలో కార్యక ర్తలు, ఓట్లేసిన ప్రజలు కనపడ్డప్పుడల్లా పార్టీని,ముఖ్యమంత్రిని బహిరంగంగానే తిడుతుండడంతో ఆ పార్టీ నేతలు తలెత్తుకుని తిరగలేకున్నారు. సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందంటూ కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో పాపం బాబు గెలుపు కోసం టీడీపీ నేతలు నానా పాట్లు పడ్డారు. చెన్నై,బెంగళూరు,హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ నేతలు సైతం చంద్రబాబు పిలుపుతో జిల్లాకు తరలివచ్చారు. ఆయన అధికారంలోకి వస్తే పదవులు,పనులు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కోట్లు గుమ్మరించి ఎన్నికల్లో పనిచేశారు. బాబు గద్దెనెక్కి 8 నెలలు పూర్తయింది. నేతల సంగతి పట్టించుకునేవారు లేరు. పైసా రాబడిలేదు,పదవులూ రాలేదు. బాబు వైఖరి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలనిస్తుందని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసేవారు ఉండరని నేతలు మదనపడుతున్నారు. మరో వైపు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చక పోయామన్న భావన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. డ్వాక్రా రుణమాఫీ హామీపై మాట మార్చడం, రైతు రుణమాఫీ 20 శాతం మందికి కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. జిల్లా కరువుతో అల్లాడుతున్నా చర్యలు లేవు. కొత్త నిధుల సంగతి దేవుడెరుగు పాత బకాయిలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లా ప్రధాన సమస్య తాగునీటి పరిష్కారానికి హంద్రీ-నీవా,కండలేరు నీటిపథకాలను పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూపకల్పన చేశారన్న అక్కసుతో కండలేరు పథకాన్ని బాబు పక్కన పెట్టారు. కరువు పుణ్యమాని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. జిల్లా మొత్తం కరువున్నా 42 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. దీనిపై సహాయక చర్యలు లేవు. వేరుశెనగ రైతులకు 110 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అయినా పైసా ఇచ్చే పరిస్థితి కానరావడంలేదు. గత ఏడాది సైతం 33 మండలాలను కరువు కింద ప్రకటించారు. దీనికి సంబంధించి 90 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. పండ్ల తోటల రైతులకు 10 వేల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీ గాలిలో కలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు సవాలక్ష. ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న భావన దేశం నేతల్లో నెలకొంది. ఇప్పటికే చంద్రబాబును జిల్లా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేకుండా పోయిందని,తప్పు చేశామన్న భావనతో ఉన్నారని ఆ పార్టీ ముఖ్యనేత ‘సాక్షి’తో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీ నేతలు గ్రామాల్లో వెళ్లలేని పరిస్థితి నెలకొందని మరి కొందరు టీడీపీ నేతలు పేర్కొన్నారు.