breaking news
Akars TRS
-
కాంగ్రెస్ కు ఫారూక్ ఝలక్
♦ గులాబీ గూటికి ఎమ్మెల్సీ ♦ కేసీఆర్ సమక్షంలో చేరిక సిద్దిపేట జోన్ : కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మరోగట్టి దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా టీఆర్ఎస్ ఆకర్ష్‌కు కాంగ్రెస్, టీడీపీ పార్టీల ముఖ్య నేతలు వ లసబాట పట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో రెండు ఎమ్మెల్సీలు ఉన్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న ఒక్క నామినేటేడ్ ఎమ్మెల్సీ కూడా చేజారింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌కు శాసన మండలిలో ప్రతినిధ్యమే కరువైంది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ముఖ్యనేతగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయన చేరికతో రెండు నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఫారూఖ్ పార్టీని వీడడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకొవడం విశేషం. కాగా రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వర కు కాంగ్రెస్ కార్యకలాపాలను నిర్వహించిన సీనియర్ నేత ఫారూఖ్ పార్టీ మారడం పరోక్షంగా కాంగ్రెస్‌కు షాకే.. సిద్దిపేటకు చెందిన ఫారూఖ్ హుస్సేన్ 1977లో మాజీ మంత్రి అనంతుల మదన్మోహన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండుసార్లు పనిచేశారు. సమైక్య రా్రష్టంలో యువజన కాంగ్రెస్ జిల్లా, రాష్ట్రస్థాయి పదవుల్లో కొనసాగారు. 1991లో రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2011లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవిని పొంది ప్రస్తుతం కాంగ్రెస్ శాసనమండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే యేడాది జూన్‌లో ముగియనుంది. హరీశ్‌రావు నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఆయన పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్న క్రమంలో గత నెల రోజులుగా ఫారూఖ్ హుస్సేన్ పార్టీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది. ఆయన పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉండడం భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్లో చేరి, ఎమ్మెల్సీని రెండవ సారి దక్కించుకునే అలోచనతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుతో ఉన్న సాన్నిహిత్యంతో పార్టీ మారినట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా టీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్‌కు దెబ్బే. మరోవైపు ఫారూఖ్ హూస్సేన్ పార్టీ వీడడం పట్ల సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం సంబురాలు నిర్వహించుకోవడం గమనార్హం. -
ఇక కాంగ్రెస్ వంతు
♦ పూర్తి స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ ♦ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై అంచనా ♦ 2019 ఎన్నికల్లో ఏకఛత్రాధిపత్యం సాధించే వ్యూహం సాక్షి, హైదరాబాద్: పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా అధికార టీఆర్ఎస్ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకుందా.., పార్టీ భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఆయా పార్టీల్లో సీనియారిటీ ఉన్న, తమ తమ నియోజకవర్గాల్లో జనామోదం ఉన్న నేతలకు గురిపెట్టిందా.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నారు. టీఆర్ఎస్లో చేరికలను ఆ పార్టీ ‘రాజకీయ పునరేకీకరణ’ అని ముద్దుగా పిలుస్తున్నా... ఇదంతా 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావడమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉంటే ఒకటే ఉండాలని, రెండు ప్రాంతీయ పార్టీల అవసరమే లేదన్న ఉద్దేశంతో టీడీపీ ఉనికే లేకుండా చేసిన గులాబీ నాయకత్వం... మరికొందరు కాంగ్రెస్ సీనియర్లపైనా వల విసిరే పనిలో ఉందని సమాచారం. పధ్నాలుగేళ్లపాటు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్... రాజకీయ వ్యూహంలో భాగంగా ఎన్నికలు, పదవులకు రాజీనామాలు, ఉప ఎన్నికలు అంటూ పకడ్బందీగా వ్యవహరించింది. కానీ రాష్ట్రం సిద్ధించాక జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం సాధారణ మెజారిటీనే సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 స్థానాలుకాగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అంతకు కేవలం మూడు సీట్లు ఎక్కువగా 63 స్థానాలను మాత్రమే గెలుచుకున్నది. బీఎస్పీ విలీనం ద్వారా ఇద్దరు సభ్యులు కలిశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు, తెలంగాణ టీడీపీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం టీఆర్ఎస్ బలం 81 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. అయితే ఉద్యమ పార్టీగా అత్యధిక స్థానాల్లో గెలవాల్సిన టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయిన స్థానాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని... ఆయా నియోజకవర్గాల్లో అంతో, ఇంతో జనబలమున్న నేతలపై దృష్టి పెట్టిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై అంచనాకు వచ్చిన గులాబీ నాయకత్వం ‘ఆపరేషన్ ఆకర్ష్’కు మరింత పదును పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ వాష్ ఔట్..! రాష్ట్రంలో టీడీపీ ఉనికి లేకుండా చేసే వ్యూహంలో భాగంగా ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకున్న టీఆర్ఎస్... వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచే జిల్లాల్లో పార్టీ బలం పెంచే పనిలో పడిందని... జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా హైదరాబాద్‌లో కుదురుకుందని పేర్కొంటున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ చేతిలో సగం చొప్పున స్థానాలు ఉండడంపై అధికార పార్టీలో చర్చ జరిగిందని అంటున్నారు. ఈ జిల్లాల్లోనూ పూర్తి ఆధిక్యం సాధించాలని, 2019 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కొందరు కాంగ్రెస్ సీనియర్లనూ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మహ బూబ్‌నగర్ జిల్లాలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలతో, కరీనంగర్ జిల్లాలో మరో టీడీపీ నేతతో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. కాగా తెలంగాణ టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరనున్నారని, ముహూర్తం ఖరారు కావాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.