breaking news
ABCD 2
-
సెకండ్ హాఫ్‌లో పంచ్ పడుద్దా?!
జూలైలో ‘బజ్రంగీ భాయ్‌జాన్’ వచ్చి బాలీవుడ్ బాహుబలాన్ని చాటి చెప్పాడు. అవును... అది మర్చిపోతే ఎలా? హిందీ ‘బాహుబలి’ కూడా దుమ్మురేపింది. ఫస్ట్ హాఫ్ జనవరి-జూన్ ఓ మోస్తరుగా నడిచినా, సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ బహుత్ జాదా హై. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ట్రాజెడీ, థ్రిల్లర్... ఒక్కటి కాదు, దాదాపు రెండు డజన్ల సినిమాల పోస్టర్లు రెడీ! వీటిలో ఒక అరడజనైనా పండగ చేసుకుంటాయని బాలీవుడ్ వర్గాల అంచనా. అయితే మనకెందుకు? హిందీ హమారీ దేశ్ భాషా హై. అందుకు. ‘కౌన్ కబ్ ఆతా... కిస్కా పంచ్ బజాతా’! ఇదీ బాలీవుడ్లో ఇప్పుడు డిస్కషన్. మొన్న రంజాన్‌కు వచ్చిన ‘బజ్రంగీ భాయ్‌జాన్’ పుణ్యమా అని బాలీవుడ్ మళ్ళీ కళకళలాడుతోంది. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో ‘పీకూ’, ‘తను వెడ్స్ మను... రిటర్న్స్’, ‘ఏబిసిడి 2’, ‘బేబీ’ లాంటి కొన్ని హిట్స్ వచ్చినా, అత్యంత భారీ విజయం మాత్రం సల్మాన్‌ఖాన్ ‘బజ్రంగీ భాయ్‌జాన్’దే! ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన స్ట్రెయిట్ హిందీ సినిమాలన్నిటిలోకీ అతి పెద్ద హిట్ అదే. ‘బజ్రంగీ...’ లానే ప్రేక్షకుల అంచనాలెన్నో ఉన్న అనేక సినిమాలు ఈ ఏడాది సెకండాఫ్‌లో రానున్నాయి. రాగల నెలల్లో దాదాపు పాతిక హిందీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. హిందీ చిత్ర పరిశ్రమ గత ఏడాది దాదాపు రూ. 2,960 కోట్ల మేర ఆదాయం సంపాదించినట్లు ఒక లెక్క. ఈ ఏడాది కూడా కనీసం ఆ మేర సంపాదించాలంటే ఈ రాగల నెలల్లో విడుదల కానున్న పెద్ద సినిమాలు వసూళ్ళ వర్షం కురిపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఏవో కొన్ని మెరుపులే కనిపించడంతో, ఆశలు సెకండాఫ్ మీద ఉన్నాయి. కనీసం ఏడు పెద్ద సినిమాలు ఈ సెకండాఫ్‌లో రానున్నాయి. వీటిల్లో కొన్ని పెద్ద సినిమాలపైనే దాదాపు రూ. 400 కోట్లు పణంగా ఉన్నట్లు బాలీవుడ్ సినీ వ్యాపార నిపుణుల అంచనా. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పెద్ద చిత్రాల పరంపర మొన్న శుక్రవారం విడుదలైన అజయ్‌దేవ్‌గణ్ ‘దృశ్యమ్’తో మొదలైంది. క్యాలెండర్ గర్ల్స్ (రిలీజ్: ఆగస్టు 7) మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తూ, సంగీతా ఆహిర్‌తో కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం అయిదు వేర్వేరు పట్టణాల నుంచి వచ్చి, దేశంలోని ప్రసిద్ధ వార్షిక క్యాలెండర్ కోసం పోజులివ్వడానికి ఎంపికైన అయిదుగురు అమ్మాయిల కథ. పారిశ్రామికవేత్త విజయ్‌మల్యా నిజజీవిత ఘట్టాలను పోలి ఉంటుందని భావిస్తున్న ఈ చిత్ర కథ మోడలింగ్ ఇండస్ట్రీ లోలోపలి విషయాలను చెబుతుందని ఆశిస్తున్నారు. గతంలో ‘పేజ్ 3’, ‘ఫ్యాషన్’, ‘హీరోయిన్’ లాంటి సినిమాలు అందించిన మధుర్ భండార్కర్ ఈసారి అంతకు భిన్నంగా ఏం చెబుతారో చూడాలి. బ్రదర్స్ (ఆగస్టు 14) కరణ్‌జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ సినిమా ‘వారియర్’ (2011)కు రీమేక్.అక్షయ్‌కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా చిత్రం ప్రధానంగా బాక్సింగ్‌తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చుట్టూ తిరుగుతుంది. గతంలో 1990 నాటి అమితాబ్ బచ్చన్ ‘అగ్నిపథ్’ చిత్రాన్ని 2012లో అదే పేరుతో రీమేక్ చేసిన దర్శక - రచయిత కరణ్ మల్హోత్రాకు ఇది ఇంకో రీమేక్. మునుపటి బాక్సింగ్ చిత్రాల కన్నా ఈ ‘బ్రదర్స్’ ఏ మేరకు భిన్నంగా ఉంటుందో చూడాలి. ఇప్పటికే కొన్ని లక్షల మందిని ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం రూ. 125 - 175 కోట్ల నికర వసూళ్ళు సాధిస్తుందని అంచనా. ఆల్ ఈజ్ వెల్ (ఆగస్టు 21) ‘ఆల్ ఈజ్ వెల్...’ ఈ పేరు వినగానే ‘3 ఇడియట్స్’ సినిమాలోని సూపర్‌హిట్ గీతం గుర్తొచ్చింది కదూ! సరిగ్గా ఆ పాట స్ఫూర్తితో, అదే పేరుతో ఈ సినిమా వస్తోంది. గతంలో అక్షయ్‌కుమార్, పరేశ్ రావల్ కాంబినేషన్లో ‘ఓ మై గాడ్’ (2012. తెలుగులో ఈ ఏడాది మొదట్లో వచ్చిన ‘గోపాల... గోపాల’కు మాతృక)కి దర్శకత్వం వహించిన ఉమేశ్ శుక్లా తదుపరి సినిమా ఇది. అన్ని వయసుల వాళ్ళూ చూడదగ్గ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ ‘ఆల్ ఈజ్ వెల్’ను అందిస్తున్నారు. రిషి కపూర్, అభిషేక్ బచ్చన్లు మరోసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం ‘ఢిల్లీ-6’ కన్నా మెరుగ్గా ఉంటే మంచిదని ప్రేక్షకుల భావన. తెలుగువాళ్ళకు సుపరిచితురాలైన అసిన్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఒక సంక్లిష్టమైన అంశంపై సామాజిక సందేశం ఇవ్వనున్నారు. ఫాంటమ్ (ఆగస్టు 28) మొన్నటి ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’, ‘ఏక్‌థా టైగర్’ల నుంచి తాజా ‘బజ్రంగీ భాయ్‌జాన్’ దాకా పలు చిత్రాలను అందించిన రచయిత, కెమేరామన్, దర్శకుడు కబీర్‌ఖాన్ తాజా కృషి ఇది. ఉత్కంఠభరితమైన ఈ థ్రిల్లర్‌లో కత్రినా కైఫ్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 2008లో ముంబయ్‌పై జరిగిన తీవ్రవాదుల దాడుల ఆధారంగా ఈ కథ అల్లుకున్నారు. ఒక పక్క ప్రామాణికతకు చోటిస్తూనే, స్టయిలైజ్డ్ చిత్రీకరణకు పెద్దపీట వేసే కబీర్‌ఖాన్ మరోసారి ఆకట్టుకునే అవకాశాలున్నాయి. నిర్మాత సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల తెలివితేటలను తక్కువగా అంచనా వేయకుండా 26-11 దాడుల అనంతర పరిణామాలు, విశ్వవ్యాప్త టైజమ్‌ను చూపెడితే అంతకన్నా ఇంకేం కావాలి! బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 75 నుంచి 100 కోట్లు నికరంగా సంపాదిస్తుందని అంచనా. వెల్కమ్ బ్యాక్ (సెప్టెంబర్ 4) ఈ యాక్షన్- కామెడీ ఫిల్మ్ పూర్తిస్థాయిలో వినోదం పంచుతుందని భావిస్తున్నారు. ఫిరోజ్ నడియావాలా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘సింగ్ ఈజ్ కింగ్’ ఫేమ్ అనీస్ బాజ్మీ దర్శకుడు. ఆయనే తీసిన మునుపటి హిట్ ‘వెల్కమ్’ (2007)కు ఇది సీక్వెల్. పాత హిట్లోని నానాపటేకర్, అనిల్ కపూర్, పరేశ్ రావల్లతో పాటు జాన్ అబ్రహమ్, శ్రుతీ హాసన్ కూడా ఇందులో కొత్తగా చేరారు. నిజానికి, గత డిసెంబర్లోనే వస్తుందనుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌తో సహా రకరకాల సమస్యలతో వాయిదా పడుతూ, ఈ సెప్టెంబర్‌లో రిలీజవుతోంది. నసీరుద్దీన్ షాతో సహా పలువురు తారలున్న ఈ సినిమా ఆ మేరకు వినోదం పండిస్తే అంతకన్నానా! బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు రూ. 70 - 90 కోట్లు నికరంగా వస్తాయని అంచనా. కట్టీ... బట్టీ (సెప్టెంబర్ 18) ఇదీ వినోదాత్మక చిత్రమే. ఇమ్రాన్‌ఖాన్, కంగనా రనౌత్‌లు ప్రధాన పాత్రధారులు. ఇప్పటికే ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ లాంటి సినిమాలతో తన యాక్టింగ్ టాలెంట్ ఏమిటో కంగన నిరూపించారు. వినోదం నిండిన ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్తో అన్ని రకాల పాత్రలకూ తాను సరిపోతానని మరోసారి ఋజువు చేయనున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అభినయం ‘డిల్లీ బెల్లీ’, ‘బాంబే టాకీస్’లతో అందరికీ పరిచయమే. అలాంటి హీరో, హీరోయిన్లతో గతంలో ‘కల్ హో నా హో’ లాంటి ప్రేమకథను అందించిన నిఖిల్ అద్వానీ మరోసారి ఈ సినిమాతో తెరపై ప్రేమ పండించనున్నారు. షాన్‌దార్, జజ్బా, సింగ్ ఈజ్ బ్లింగ్ (అక్టోబర్‌లో) ఇవే కాక... అక్టోబర్‌లో వికాస్ భల్ అందిస్తున్న వివాహగాథ ‘షాన్‌దార్’ (షాహిద్ కపూర్, ఆలియా భట్) వస్తోంది. చాలాకాలం విరామం తరువాత ‘జజ్బా’తో ఐశ్వర్యారాయ్ బచ్చన్ మళ్ళీ తెరపైకి వస్తున్నారు. గతంలో బాక్సాఫీస్ హిట్ ‘రౌడీ రాథోడ్’ ఇచ్చిన అక్షయ్‌కుమార్, ప్రభుదేవాల కాంబినేషన్ మరో మాస్ మసాలా సినిమా ‘సింగ్ ఈజ్ బ్లింగ్’తో రానున్నారు. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద రూ. 80 నుంచి 120 కోట్ల మధ్య నికరవసూళ్ళు సాధిస్తుందని అంచనా. ప్రేమ్ రతన్ ధన్ పాయో (నవంబర్‌లో) నవంబర్‌లో దీపావళికేమో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. రాజశ్రీ వారి ఈ ఫ్యామిలీ డ్రామాకు సూరజ్ బర్జాత్యా దర్శకుడు. గతంలో ‘మై నే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’ లాంటి హిట్స్ ఇచ్చిన ఈ దర్శక, హీరోల కాంబినేషన్ మరోసారి ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఈ ఫ్యామిలీ డ్రామా గనక క్లిక్ అయితే, రూ. 200 నుంచి 275 కోట్ల పైగా వసూలవుతుందని అంచనా. బాజీరావ్ మస్తానీ (డిసెంబర్లో) డిసెంబర్లో కూడా భారీ సినిమాలున్నాయి. దాదాపు రూ. 210 కోట్ల ఖర్చుతో సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న చారిత్రక ప్రేమకథ ‘బాజీరావ్ మస్తానీ’ రానుంది. భన్సాలీ తెరకెక్కించాలని కొన్నేళ్ళుగా కలలు కంటున్న ఈ క్రీ.శ. 1700 నాటి ప్రేమగాథలో బాజీరావ్‌గా రణ్వీర్ సింగ్, ఆయన సతీమణులు మస్తానీ, కాశీబాయ్గా దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాలు నటిస్తున్నారు. ఈ పాత్రల్లోకి నటీనటులు పరకాయ ప్రవేశం చేయడానికి వీలుగా దర్శకుడు ముందుగా వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారు. ఇక రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ నటిస్తున్న ‘జగ్గా జాసూస్’ రిలీజ్ కూడా డిసెంబర్లోనే! గతంలో ‘బర్ఫీ’ లాంటి హిట్టిచ్చిన దర్శకుడు అనురాగ్ బసు ఈ సినిమాతో రూ. 90 నుంచి 140 కోట్ల మధ్య వసూళ్ళు సాధిస్తారని అంచనా. చాలా ఏళ్ళ తరువాత షారుఖ్ ఖాన్, కాజోల్‌ల క్రేజీ కాంబినేషన్లో రోహిత్ షెట్టీ రూపొందిస్తున్న ‘దిల్వాలే’ ఈసారి క్రిస్మస్ కానుక. సెకండాఫ్‌లో వచ్చే అనేక పెద్ద చిత్రాల కథాంశాలు ఇప్పటికే ఆసక్తి రేపుతున్నాయి. అదే సమయంలో ఇటీవలి కాలంలో స్క్రీన్ల సంఖ్యా పెరిగింది. కాబట్టి ఈ సెకండాఫ్‌లో బాలీవుడ్ ఆదాయం పుష్కలంగా ఉంటుందని ట్రేడ్ నిపుణులు ఆశతో ఉన్నారు. దానికి తగ్గట్లే ప్రేక్షకులకు వినోదం పండాలనీ, నిర్మాతలకు గల్లాపెట్టె నిండాలనీ కోరుకుందాం! -
2015లో 'ఏబీసీడీ 2' రికార్డు
ముంబై: వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్, ప్రభుదేవా నటించిన 'ఏబీసీడీ 2' బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ ఏడాదిలో తొలి వారం రోజుల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. తొలి వారంలో ఈ సినిమా దాదాపు 72 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఇంతకుముందు 'తను వెడ్స్ మను రిటర్స్' చిత్రం (వారంలో 69 కోట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. రిమో డిసౌజా దర్శకత్వం వహించిన ఏబీసీడీ 2 రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. -
నా కొత్త పేరు చోటా హల్క్!
‘‘ఇప్పుడు నేను మానసికంగా,శారీరకంగా చాలా దృఢంగా ఉన్నా. ఇది ‘ఏబీసీడీ 2’ తెచ్చిన మార్పు. ఈ సినిమా మొదలయ్యాక ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లో చేరాను. ఈ కోర్సు చాలా విభిన్నంగా ఉంది. ఇంటిలో ఉన్నప్పుడు కూడా చాలా వర్కవుట్స్ చేస్తున్నా. ఇందులో ప్రధానమైనది వెయిట్ లిఫ్టింగ్. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు వంటగదిలో చాలా బరుైవె న సామాన్లు కూడా అవలీలగా ఎత్తగలుగుతున్నా. ఓ రోజు సోఫా మోయాల్సిన పరిస్థితి వచ్చింది. మా అమ్మ ఎవరినో సాయం పిలిచేలోపు, ఒక్క చేత్తో దాన్ని ఎత్తి అవతల పడేశా. దాంతో ఆశ్చర్యపోవడం మా అమ్మ వంతయింది. ఇక అప్పటి నుంచి మా అమ్మ ‘చోటా హల్క్’ అని పిలుస్తోంది. ఇటీవలే మథుర వెళ్లినప్పుడు ఓ ఆవు దూడను చూశా. చాలా ముద్దనిపించింది. వెంటనే ఎత్తుకుని ముద్దాడా. మామూలుగా అయితే దూడ చాలా బరువుగా ఉంటుంది. కానీ అదేం అనిపించలేదు. ఇదంతా ‘ఏబీసీడీ2’ పుణ్యమే.’’ - శ్రద్ధాకపూర్ -
హిందీలో... అతిథిగా!
బన్నీగా అందరూ పిలుచుకొనే అల్లు అర్జున్ మంచి డాన్సింగ్ స్టార్. ఆయన స్టెప్పులు వేసే విధానం చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఆ స్టయిల్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక, మన బన్నీ ఎంత మంచి డాన్సరో ఈ ఏడాది హిందీ ప్రేక్షకులు కూడా చూడనున్నారు. ఓహో.. బన్నీ నటించిన ఏదైనా తెలుగు చిత్రం హిందీలో అనువాదం కానుందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. హిందీ చిత్రం ‘ఎబిసిడి 2’లో బన్నీ ఒక అతిథి పాత్ర చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన రెమో డిసౌజా దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందుతోంది. అందులో లీడ్ రోల్ చేసిన ప్రభుదేవా ఈ సీక్వెల్లో కూడా ఆ పాత్రను చేస్తున్నారు. ప్రభుదేవా కోసమే బన్నీ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. ఇటీవల బన్నీ పాల్గొనగా ఆయన పాత్ర చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. బన్నీ డాన్సింగ్ స్కిల్స్‌ని మరోసారి చూపించే విధంగా ఆయన పాత్ర ఉంటుందట. ఆయన చేసిన పాత్ర పేరు - ఆర్యన్ చౌహాన్. ఇది ఇలా ఉంటే.. అనువాద చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకుని, ‘మల్లూ అర్జున్’ అనిపించుకున్నారు బన్నీ. ఇప్పుడీ స్ట్రయిట్ చిత్రం ద్వారా హిందీలో కూడా అభిమానులను సంపాదించుకుంటారా? ఏప్రిల్ 2న రానున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు హిందీ తెరపై బన్నీని చూడడానికి జూన్ 19 దాకా వేచి చూడాల్సిందే! -
బాలీవుడ్ మూవీలో స్టెలిష్ స్టార్