పశ్చిమ బెంగాల్‌లోని కామ్‌దునీలో 2013లో ఓ యువతి(21)పై జరిగిన గ్యాంగ్‌రేప్, హత్య కేసులో స్థానిక కోర్టు గురువారం ఆరుగురిని దోషులుగా తేల్చింది.
నేరాన్ని నిర్ధారించిన కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కామ్‌దునీలో 2013లో ఓ యువతి(21)పై జరిగిన గ్యాంగ్‌రేప్, హత్య కేసులో స్థానిక కోర్టు గురువారం ఆరుగురిని దోషులుగా తేల్చింది. సైఫుల్ అలీ, అన్సార్ అలీ, అమినుల్ అలీలను ఐపీసీలోని సెక్షన్లు 376 (డి) (గ్యాంగ్‌రేప్), 302 (హత్య), 120 బీ(నేరపూరిత కుట్ర) కింద దోషులుగా నిర్ధారించింది. అలాగే నేరానికి సహకరించిన ఇమానుల్ ఇస్లాం, అమినుల్ ఇస్లాం, భోలా నాస్కర్‌లను ఐపీసీ సెక్షన్లు 376 (డీ), 120 (బీ)తోపాటు 201(ఆధారాల తారుమారు) కింద దోషులుగా తేల్చింది. యువతిని ఫాం హౌస్‌లోకి బలవంతంగా తీసుకొచ్చిన సైఫుల్ అలీని సెక్షన్లు 109 (నేరానికి పురికొల్పడం), 342 (వ్యక్తిని నిర్బంధించడం) కింద కూడా దోషిగా ప్రకటించింది.
ఈ మేరకు అదనపు సిటీ సెషన్స్ కోర్టుజడ్జి సంచినా కర్ తీర్పు వెలువరించారు. సరైన ఆధారాలు లేనందున మరో ఇద్దరు నిందితులు రఫీకుల్‌ఇస్లాం, నూర్ అలీలను నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శుక్రవారం శిక్షలు ఖరారు చేయనున్నారు. తొలి ముగ్గురు దోషులకు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష లేదా మరణశిక్ష పడే అవకాశం ఉండగా మరో ముగ్గురు దోషులకు 20 ఏళ్లు శిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. కేసులోని మరో నిందితుడు గోపాల్ నస్కర్ గత ఏడాది మరణించాడు.
కోల్‌కతాకు 50 కి .మీ. దూరంలోని కామ్‌దునీలో 2013 జూన్ 7న ఓ యువతి కాలేజీలో పరీక్ష అనంతరం బస్సు దిగి ఇంటికి తిరిగి వస్తుండగా కీచకులు ఆమెను సమీపంలోని ఫాంహౌస్‌లోకి లాక్కెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశారు. కోర్టు తీర్పుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది.