
లోక్‌సభలో చర్చ.. రాజ్యసభలో రచ్చ
పార్లమెంటులో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ వరుసగా రెండోరోజూ విపక్షాల నిరసనలతో అట్టుడికింది.
వీకే సింగ్, భాగవత్ వ్యాఖ్యలపై బీఎస్పీ, ఎస్పీ ఆందోళన
న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ వరుసగా రెండోరోజూ విపక్షాల నిరసనలతో అట్టుడికింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌ల వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనకు దిగటంతో.. సభా కార్యక్రమాలు ముందుకు కదల్లేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏఎం రామస్వామి మృతికి సంతాపం తెలిపిన వెంటనే విపక్షాల ఆందోళన మొదలైంది. హరియాణాలో దళిత చిన్నారుల హత్య తర్వాత.. ‘కుక్కపై రాళ్లేసినా ప్రభుత్వానిదే బాధ్యతా?’ అంటూ ప్రశ్నించిన వీకే సింగ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్, బీఎస్పీ సభను స్తంభింపజేశాయి. వీకే సింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.
మాయావతి నోటీసు ఇచ్చాకే మాట్లాడాలంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జోక్యం సూచించటంతో.. ఆగ్రహించిన బీఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఈ వ్యాఖ్యలపై వీకే సింగ్ వివరణ ఇచ్చినందున తదుపరి చర్యలేమీ ఉండవని స్పష్టం చేసింది. విపక్షాల డిమాండును సింగ్ తోసి పుచ్చారు. పిల్లి, ఎలుక ఆటలు మాని దేశాభివృద్ధిపై చర్చించేందుకు విపక్షాలు సహకరించాలన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. అటు, ‘రామమందిర నిర్మాణానికి రంగం సిద్ధం చేయాలి’ అంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ నిరసన తెలియజేసింది.
భాగవత్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. రామమందిర నిర్మాణం విషయంలో ప్రభుత్వంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ముందుకెళ్తుందని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. అటు లోక్‌సభ జీరో అవర్లో రైతుల సమస్యలపై చర్చ జరిగింది. రైతన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని.. బీజేపీ ఎంపీ నానా పటోల్ కోరారు. కొలీజియం వ్యవస్థపైనా చర్చ జరిగింది. న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంగా ఉండాలని సభ్యులందరూ ముక్తకంఠంతో కోరారు. కొలీజియం వ్యవస్థ పూర్తిగా విఫలమైందని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. దీనికి కొందరు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కూడా గళం కలిపారు. మరోవైపు, సేవల నుంచి ముందస్తు పదవీ విరమణ తీసుకున్న జవాన్లకు కూడా ఓఆర్‌ఓపీని అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ దీపెందర్ హూడా డిమాండ్ చేశారు. రెండుసార్లు వెల్‌లోకి చొచ్చుకు వచ్చి గొడవ చేసిన హూడా.. తనకు స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ.. సభనుంచి వాకౌట్ చేశారు. అటు కేరళలోని ముళ్ల పెరియార్ డ్యామ్ భద్రత విషయంలో కేరళ, తమిళనాడు ఎంపీలు గొడవపడ్డారు.
ఇబ్బందిని ‘తప్పించుకున్న’ కేంద్రం
ఎస్సీ కేటగిరీలోకి మల్ల, గొరియా, కాశ్యప వంటి మరికొన్ని కులాలను చేర్చాలంటూ.. సమాజ్‌వాద్ పార్టీ ఎంసీ విశ్వంభర ప్రసాద్ ‘ప్రైవేటు సభ్యుడి బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సాధారణంగా ప్రైవేటు సభ్యుడి బిల్లును.. ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాత వెనక్కు తీసుకుంటారు. కానీ ప్రసాద్ వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెప్పటంతో రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ ఓటింగ్‌కు అనుమతించారు. ఇబ్బందికర పరిస్థితిని ముందే ఊహించిన బీజేపీ సభ్యులు, ఓ మంత్రి సభనుంచి వెళిపోయారు. ఈ సమయంలో సభలో కేవలం 21 మందే ఉన్నారు. దీంతో ఓటింగ్‌కు అవసరమైన కోరం (రాజ్యసభలో కనీసం 25 మంది సభ్యులుండాలి) లేకపోవటంతో బిల్లు వాయిదా పడింది.
పార్లమెంటు సమాచారం
పార్లమెంటులో శుక్రవారం ప్రభుత్వం తెలిపిన వివరాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో కరువు ఉన్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తెలిపాయి. వీటిలో ఏడు రాష్ట్రాలు కలిపి జాతీయ విపత్తు సహాయనిధి కింది రూ. 24 వేల కోట్లకు పైగా సాయం అడిగాయి. తెలంగాణ రూ. 1,546 కోట్లు అడిగింది. చిన్న వ్యాపారాల అభివృద్ధికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 42వేల కోట్ల ప్రభుత్వం పంపిణీ చేసింది. 2014-15లో జరిగిన రైలు ప్రమాదాల్లో 292 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పన్నుచెల్లింపు పరిధిలోకి కొత్తగా కోటి మందిని తేవడం.