
తెలంగాణ కృష్ణమ్మ బిడ్డ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచితే సరిపోతుందంటూ మహారాష్ట్ర ఇన్ని రోజులుగా చేస్తున్న
సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచితే సరిపోతుందంటూ మహారాష్ట్ర ఇన్ని రోజులుగా చేస్తున్న వాదనలను తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా అడ్డుకుంది. తాను కేవలం ఆంధ్రప్రదేశ్‌కు పుట్టిన బిడ్డను కాదని, కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి పుట్టిన బిడ్డనని తెలిపింది. తనకు జలాలు పంచివ్వాల్సింది ఏపీ మాత్రమే కాదని వాదించింది. తన బాధను, గాథను ఆంధ్రప్రదేశ్ ఏనాడూ వినిపించలేదని, సొంత అవసరాలనే పట్టించుకుందని పేర్కొంది. కృష్ణా నదీ జలాలను మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య పంచాల్సిందేనని, దీనిపై విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టింది.
కృష్ణా నదీ జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన ఆరు పిటిషన్లకు సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా బుధవారం తెలంగాణ ఈ వాదనలు చేసింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన సెక్షన్ 89ను ఎలా నిర్వచించాలి? ట్రిబ్యునల్ విచారణ పరిధి ఎంత వరకు ఉండాలి? రెండు రాష్ట్రాల మధ్యే సాగాలా? లేక నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంపకాలు జరగాలా? అన్న అంశాలపై అక్టోబర్ 15న జరిగే తుది విచారణలో నిర్ణయిస్తామని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఆ తర్వాతే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లపై విచారణ జరుపుతామని తెలిపింది.
పాత వాదనే వినిపించిన మహారాష్ట్ర
కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ సభ్యుడి నియామకం వివరాలను వారంలోగా వెల్లడిస్తామని కేంద్ర ప్రభుత్వం గత వారం విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సదరు సభ్యుడి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కోర్టుకు సమర్పించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించినట్టు తెలిపారు.
అనంతరం మహారాష్ట్ర తరపున న్యాయవాది అంధ్యార్జున తన వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇప్పుడు ట్రిబ్యునల్ సభ్యుడి నియామకం కూడా పూర్తయింది. ఇక తేలాల్సింది సెక్షన్ 89. విభజన చట్టంలోని సెక్షన్ 89 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను సూచిస్తోంది. అందువల్ల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే ఆ రెండు రాష్ట్రాల మధ్య పంచాలి’’ అని విన్నవించారు.
తెలంగాణ కృషాణ బేసిన్‌కు బిడ్డ..
తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు తీర్పులను, మన సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూడండి. ఒక పరివాహక ప్రాంతంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడితే అది ఆ నదీ పరివాహక ప్రాంతంలో సమాన హక్కులను కలిగి ఉంటుంది. అంతేగానీ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి పంచుకోవాలనడం సరికాదు.. తెలంగాణ మొత్తం కృష్ణా బేసిన్‌కు బిడ్డ. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు బిడ్డ కాదు. అంతేకాకుండా మేం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్ ద్వారా గానీ నదీ జలాల పంపిణీపై మా విన్నపాలు వినడానికి అవకాశం కల్పించాలని కోరాం. కానీ కేంద్రం పరిష్కరించలేదు. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాం. అందువల్ల దానిపై కూడా విచారణ జరగాలి’’ అని ఆయన అన్నారు.
మేమే తేలుస్తాం..
తెలంగాణ న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా మాట్లాడుతూ.. ‘వైద్యనాథన్ వాదనల ప్రకారం విచారణ జరపకుండానే కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పంచుకోవాలని చెప్పలేం. ఆయన మొత్తం మళ్లీ కేటాయించాలంటున్నారు. అందువల్ల ట్రిబ్యునల్ పరిధిని ఇక్కడే, మేమే నిర్వచిస్తాం. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదమా? లేక నాలుగు రాష్ట్రాల మధ్య వివాదమా తేలుస్తాం. లేని పక్షంలో ఇదొక గుదిబండగా మారుతుంది. అలాగే కేటాయింపులు జరిపేటప్పుడు కొత్త రాష్ట్రంగా తన వాదనలు వినాలని అడిగే హక్కు తెలంగాణకు ఉంది’ అని పేర్కొన్నారు.
ఈ సమయంలో బ్రిజేష్‌కుమార్ ఇచ్చిన అవార్డులను వ్యతిరేకిస్తూ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతిని వైద్యనాథన్ గుర్తుచేశారు. దీంతో న్యాయమూర్తి ‘‘ముందుగా ట్రిబ్యునల్ పరిధిని నిర్వచిద్దాం. పంపకాలు రెండింటి మధ్య జరగాలా? లేక నాలుగింటి మధ్య జరగాలో తేలుద్దాం. దీంతో కొన్ని చిక్కుముడులు వీడుతాయి. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తిచేద్దాం.. ఆ తర్వాతే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుపై విచారణ చేద్దాం’’ అని పేర్కొన్నారు.