ఆసుపత్రులకు ఆపరేషన్‌ | Telangana Government to pass new bill to rein in private Hospitals | Sakshi
Sakshi News home page

ఆసుపత్రులకు ఆపరేషన్‌

Mar 19 2017 3:15 AM | Updated on Aug 14 2018 11:02 AM

ఆసుపత్రులకు ఆపరేషన్‌ - Sakshi

ఆసుపత్రులకు ఆపరేషన్‌

ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యానికి చెక్‌ పడుతోంది! ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇక సర్కారు నియంత్రణలోకి రాబోతున్నాయి.

- ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల ఆగడాలకు చెక్‌
- ఒకే గ్రేడ్‌ ఉన్న ఆసుపత్రుల్లో ఒకే ఫీజులు
- ఫీజులను ఆసుపత్రుల ముందు తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రదర్శించాలి
- చేసిన చికిత్సలన్నీ ఆన్‌లైన్‌లో వెల్లడించాలి
- వాటిపై నెలనెలా ఆడిట్‌ చేయనున్న ప్రభుత్వం
- వైద్యం వికటిస్తే ఆసుపత్రిపైనా చర్యలు
- స్టెంట్ల ధరలపైనా నియంత్రణ
- తప్పు చేసినట్టు తేలితే రూ.5 లక్షల వరకు జరిమానా.. రిజిస్ట్రేషన్‌ రద్దు.. రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో బిల్లు!


సాక్షి, హైదరాబాద్‌

ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యానికి చెక్‌ పడుతోంది! ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇక సర్కారు నియంత్రణలోకి రాబోతున్నాయి. వాటిలో జరిగే ప్రతీ చికిత్స ఇక నుంచి ప్రభుత్వానికి తెలియాల్సిందే. రోజువారీ జరిగే అన్ని రకాల చికిత్సలను ఆన్‌లైన్‌లో బహిరంగపర్చాల్సిందే! అలా ఆన్‌లైన్‌లో వెల్లడించిన వివరాలపై ప్రభుత్వం నెలనెలా ఆడిట్‌ చేసి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల బాగోతాన్ని సమీక్షించి లోపాలుంటే కొరడా ఝళిపించనుంది. వైద్యం వికటిస్తే ప్రస్తుతం కేవలం డాక్టర్‌పైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై సంబంధిత ఆసుపత్రి కూడా బాధ్యత వహించాలి.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్ర స్థాయిలోని క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్‌) యాక్టును తెలంగాణకు వర్తింప చేస్తూ మరో చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లును సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. బిల్లును ఆమోదించాక అది చట్ట రూపంలోకి రానుంది. వచ్చే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది.

అడిగేవారు లేక ఇష్టారాజ్యం...
రాష్ట్రంలో 80 శాతం ఔట్‌పేషెంట్‌ (ఓపీ), 70 శాతం ఇన్‌పేషెంట్‌ (ఐపీ) సేవలు ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల ద్వారానే జరుగుతున్నాయని అంచనా. ప్రభుత్వ వైద్యరంగం విఫలమవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. అలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. కేవలం ఆసుపత్రికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ తప్పించి సర్కారుకు సంబంధం లేకుండా పోయింది. దీంతో అనవసర ఆపరేషన్లు కోకొల్లలుగా జరుగుతున్నాయి. గుండెకు సంబంధించిన సమస్య వస్తే అవసరం లేకున్నా.. స్టెంట్లు వేయడం, బైపాస్‌ సర్జరీలు చేయడం పరిపాటిగా మారింది. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద మోకాలు మార్పిడి చికిత్సలకైతే అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫీజులు, చికిత్స బిల్లులు.. సరేసరి. దేనికీ ఓ కొలమానం అంటూ లేకుండా పోయింది.

దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే సిజేరేయన్‌ ఆపరేషన్లలో తెలంగాణ 75 శాతంతో మొదటి స్థానంలో ఉంది. కరీంనగర్‌ జిల్లాలో అయితే ఇది ఏకంగా 81.1 శాతం ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఇలా అనవసరపు ఆపరేషన్లతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్టెంట్ల ధరలను తగ్గించినా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు గతంలో మాదిరిగానే వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు ధర తక్కువగా చూపుతూ చేసిన చికిత్సకు, గదులకు అధిక బిల్లులు వేసి జేబులు గుల్ల చేస్తున్నాయి. మరోవైపు డయాగ్నస్టిక్‌ సెంటర్లు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో దాదాపు సగానికిపైగా కేంద్రాల్లో ప్రమాణాలు ఉండడం లేదు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టంతో వీటన్నింటికీ ముకుతాడు పడనుంది.

తప్పు చేస్తే రూ.5 లక్షల వరకు జరిమానా.. రిజిస్ట్రేషన్‌ రద్దు
కొత్త చట్టం రూపొందించాక రాష్ట్రస్థాయిలో ఒక కౌన్సిల్‌ని నియమిస్తారు. దాని ద్వారా మొత్తం చికిత్సలను ఆన్‌లైన్‌ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌), ఆరోగ్యశ్రీ మాదిరిగా ఏకీకృత ఫీజులను నిర్ధారిస్తారు. ఆసుపత్రులను గ్రేడులుగా విభజిస్తారు. గ్రేడుల వారీగా ఫీజులను నిర్ధారిస్తారు. ఒకే రకపు గ్రేడ్‌ ఉన్న ఆసుపత్రులన్నింటిలోనూ ఒకే ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుంది. చికిత్స, వాటికయ్యే ఖర్చుల జాబితాను ఆసుపత్రి ముందు అందరికీ కనిపించేలా తెలుగు, ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. ప్రతి రోగి వివరాలను.. అతడికి అందించిన శస్త్రచికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఏదైనా చికిత్స చేయాల్సి వస్తే దానికి కారణం చెప్పాలి. అనవసర చికిత్సలు చేసినట్లు ఆడిట్‌లో బయటపడితే ఆసుపత్రికి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన తప్పు చేస్తే ఆ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ పూర్తిగా రద్దు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement