జూలై 21 నుంచి పార్లమెంటు

జూలై 21 నుంచి పార్లమెంటు


ఆగస్టు 13 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు

పార్లమెంటును కుదిపేయనున్న లలిత్‌మోదీ వివాదం, భూసేకరణ బిల్లు


 

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21న ప్రారంభమై ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) బుధవారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ఇతర సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. దాదాపు నాలుగు వారాలపాటు సాగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశముంది. కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన లలిత్ మోదీ వివాదం ఈసారి పార్లమెంటును కుదిపేయనుంది. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతల పాత్ర ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి తప్పదని సర్కారు భావిస్తోంది. ఈ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు రాజీనామా చేయకపోతే సభను సజావుగా సాగనీయబోమని కాంగ్రెస్ ఇప్పటికే హెచ్చరించింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవని పేర్కొంది.

 

 అయితే ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు, భూసేకరణ బిల్లు కూడా పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించనుంది. ఈ బిల్లును ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ప్రతిపాదించారు. తొలుత వర్షాకాల సమావేశాలను జూలై 20న ప్రారంభించాలని ప్రతిపాదించినప్పటికీ 18 లేదా 19 తేదీల్లో రంజాన్ పర్వదినం రానున్నందున సమావేశాలను 21వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. వర్షాకాల సమావేశాలు సాధారణంగా నాలుగువారాలు జరుగుతాయి. లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్‌టీ బిల్లు, భూసేకరణ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. గత బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ 35సార్లు, రాజ్యసభ 32 సార్లు సిట్టింగ్‌లు జరిపాయి. గత ఐదేళ్లలో బడ్జెట్ భేటీ ఇదే అత్యధికం.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top