
ఇది అసలు పార్లమెంటే కాదు:మమతా
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లును లోక్ సభలో ఆమోదించిన తీరును తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఖండించారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లును లోక్ సభలో ఆమోదించిన తీరును తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. కేంద్రం బిల్లును ఆమోదించిన తీరు సరిగా లేదని ఆమె మండిపడ్డారు. ఇది చాలా అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది అసలు పార్లమెంట్ కాదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే ఈ రకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ తీరు అచ్చంగా ఎమర్జెన్సీని తలపిస్తోందని, బిల్లు ఆమోదం పొందిన తీరు దేశ చరిత్రలోనే అప్రజాస్వామిక ఘటనగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ బిల్లును రాజ్యసభకు అనుమతించ వద్దని రాష్ట్రపతిని కోరతామన్నారు. ఈ అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని స్పష్టం చేశారు.
లోక్ సభలో బిల్లుపై చర్చ కొనసాగుతుండగానే వాయిదా పడినట్టు లోక్సభ చానల్ ప్రకటించడంతో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ఆదేశాలతో లోక్సభ ప్రసారాలను ఆకస్మికంగా నిలిపివేశారు. సీమాంధ్ర సభ్యులతో పాటు సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకురావడం కూడా ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతకు కారణంగా చెబుతున్నారు. ఈ ఉదయం నుంచి లోక్ సభలో గందగోళం చెలరేగడంతో మూడుసార్లు వాయిదా పడి..చివరకు ఆందోళన పరిస్థితుల మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.