రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి నిర్దేశించిన విధి విధానాలపై రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవడానికి తలపెట్టిన అఖిలపక్ష సమావేశం విషయంలో అస్పష్టత నెలకొంది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి నిర్దేశించిన విధి విధానాలపై రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవడానికి తలపెట్టిన అఖిలపక్ష సమావేశం విషయంలో అస్పష్టత నెలకొంది. అఖిలపక్షంగా కాకుండా, ఒక్కో పార్టీతో విడిగా సమావేశమై చర్చించాలనే ప్రతిపాదన హోంశాఖ పరిశీలనలో ఉందని అధికార వర్గాల సమాచారం. నవంబర్ 12, 13 తేదీల్లో రోజుకు నాలుగేసి పార్టీలతో రెండు విడతలుగా అఖిలపక్షం జరగనుందంటూ సోమవారం ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కేంద్ర హోం శాఖ వర్గాలు దీన్ని ధ్రువీకరించలేదు.
అఖిలపక్షం కాదు.. చర్చలే:
అఖిలపక్ష సమావేశమంటే అన్ని పార్టీలతో ఒకేసారి భేటీ అవాల్సి ఉంటుందని హోం శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. అలాగాక రెండు రోజుల పాటు సమావేశాలు జరిగితే దాన్ని పార్టీలతో విడిగా జీవోఎం జరిపే సమావేశాలుగా భావించాల్సి ఉంటుంది తప్ప అఖిల పక్షంగా కాదంటున్నారు. ఇలా రెండు రోజుల పాటు పార్టీలను పిలిచి చర్చించే ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. జీవోఎం నవంబర్ 7న సమావేశం కానుండటం తెలిసిందే. ‘‘అఖిలపక్షమని కాకుం డా, పార్టీలతో చర్చలు జరపాలనే ప్రతిపాదనపై 7 నాటి జీవోఎం సమావేశంలో చర్చించనున్నారు. వారు సరేనంటే 12, 13 తేదీల్లోనే భేటీలు జరగవచ్చు’’ అని వివరించాయి.
కసరత్తు తూతూ మంత్రమే!:
మరోవైపు విభజనపై సూచనలు, సలహాలకు జీవోఎం విధించిన గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. పలు వర్గాల నుంచి జీవోఎంకు ఇప్పటికే వేలలో వినతులు అందాయి. కానీ వాటిని పరిశీలించే కసరత్తేమీ జరగడం లేదని అధికార వర్గాల సమాచారం. అంటే మొత్తం వ్యవహారాన్ని తూతూమంత్రంగా ముగించనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం పార్టీల అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని నివేదికకు రూపకల్పన చేయాలనే యోచనలో జీవోఎం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి!