జీవో-97 మాటేమిటి?

జీవో-97 మాటేమిటి? - Sakshi


* బాక్సైట్‌పై ప్రకటనలో ప్రస్తావించని సీఎం

* చంద్రబాబు వైఖరిపై న్యాయనిపుణుల సందేహాలు

* ఉద్దేశపూర్వకంగానే జీవో-97 రద్దు చేయలేదని విశ్లేషణ

* జీవో-222 రద్దు చేసినందువల్ల ప్రయోజనం ఉండదని స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ సరఫరాకు సంబంధించి ఏపీఎండీసీ-అన్‌రాక్ మధ్య జీవో-222, ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తన ప్రభుత్వం జారీ చేసిన జీవో-97 గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



గిరిజనులు డిమాండ్లు చేస్తున్నట్లు బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా ఆపివేయాలంటే జీవో-97ను రద్దు చేయాల్సిందే. దానిని అలాగే ఉంచి జీవో-222, ఒప్పందాలను రద్దు చేయడంవల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీటిని రద్దు చేస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన తక్షణమే అన్‌రాక్ సంస్థ కోర్టును ఆశ్రయిస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సంస్థ ఇప్పటికే రూ.5,300 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వమే శ్వేతపత్రంలో అంగీకరించిన నేపథ్యంలో కోర్టులో కూడా ఆ సంస్థకు అనుకూలంగానే తీర్పు వస్తుందని స్పష్టంచేస్తున్నారు.



ఈ విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే జీవో-97ను రద్దు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. తాను జీవో రద్దు చేసినా కోర్టు అనుమతించిందని తప్పించుకునే వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి కేవలం జీవో-222 మాత్రమే రద్దు చేశారని వారు అభిప్రాయపడ్డారు. గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ఆయన ఇలానే కోర్టు మాటున దాక్కున్నారని గుర్తుచేస్తున్నారు.



అధికారులు కూడా అదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ‘మైనింగ్ లీజులు, ఖనిజ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భూమి బదలాయింపు జీవో 97 రద్దు చేయకుండా ఒప్పందాలు మాత్రమే రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారంటే లోపాయికారీ ప్రయత్నాలున్నట్లు స్పష్టమవుతోంది’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. 2000 సంవత్సరంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాక్సైట్ తవ్వకాలపై ఆలోచన చేశానని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ఖచ్చితంగా వినియోగించుకుంటామని శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలే  బాక్సైట్ తవ్వకాలపై ఆయన వైఖరికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

 

సీఎం తీరుపై గిరిజనుల ఆగ్రహం...

విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, జెర్రెల  బ్లాకుల్లో 3,030 ఎకరాల అభయారణ్యాన్ని బాక్సైట్ తవ్వకాలకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి  బదలాయిస్తూ టీడీపీ సర్కారు గత నెల అయిదో తేదీన జీవో-97 జారీ చేయడానికి నిరసనగా గిరిజనులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఈ జీవోను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.



ఈమేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. ఈ జీవో సంబంధిత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తెలియకుండా జారీ అయినందున ప్రభుత్వం దీనిని నిలుపుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా చెప్పారు. జీవో-97ను అబయెన్స్‌లో పెడతున్నామని బాక్సైట్‌పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటించారు.



కానీ బాక్సైట్ మైనింగ్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు అసలు ఆ జీవో గురించే ప్రస్తావించలేదు. బాక్సైట్ సరఫరాకు సంబంధించి కుదిరిన ఒప్పందాలు, జీవో-222 రద్దు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. తాము డిమాండ్ చేసినట్లు జీవో-97 రద్దు చేయకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.

 

సభలో వైఎస్సార్‌సీపీని లేకుండా చేసి..

ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాక్సైట్‌పై స్వల్పకాలిక చర్చ కోసం రూల్-344 కింద నోటీసు ఇవ్వడంతో సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆర్‌కే రోజా సస్పెన్షన్‌ను తొలగించనందుకు, కాల్‌మనీ - సెక్స్‌రాకెట్‌పై చర్చకు అనుమతించనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు కావాల్సిన రీతిలో బాక్సైట్‌పై ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top