ఆ రాత్రి ... కాళరాత్రి | 38 years for Diviseema Cyclone in AndhraPradesh | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి ... కాళరాత్రి

Nov 19 2015 8:20 AM | Updated on Sep 3 2017 12:43 PM

ఆ రాత్రి ... కాళరాత్రి

ఆ రాత్రి ... కాళరాత్రి

1977.. నవంబర్ 19. తుఫాను వర్షం కురుస్తుంది. ఎప్పటిలాగే తీరం దాటుతుందని దివిసీమ ప్రజలు నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నారు.

  • దివిసీమ ఉప్పెనకు 38 ఏళ్లు
  • కడలి కల్లోలానికి కకావికలమైన తీరప్రాంత గ్రామాలు
  • శవాల దిబ్బలుగా మారిన ఊళ్లు
  • నేటికీ మరువలేని చేదు జ్ఞాపకాలు
  • 1977.. నవంబర్ 19. తుఫాను వర్షం కురుస్తుంది. ఎప్పటిలాగే తీరం దాటుతుందని దివిసీమ ప్రజలు నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రిని కాళరాత్రిగా మారుస్తూ ఒక్కసారిగా ప్రళయం ముంచెత్తింది..మీటర్ల కొద్దీ (సుమారు మూడు తాడిచెట్లు అంత ఎత్తున) ఎగిసిపడుతున్న రాకాసి అలలు చెలియల కట్టలు దాటి ఊళ్ల మీద విరుచుకుపడ్డాయి. నిద్రలోని వారిని శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లాయి. పశు, పక్ష్యాదులు అల్లకల్లోలమయ్యాయి..గ్రామాలకు గ్రామాలు అనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి.. లక్షల ఎకరాల్లో పంట నామరూపాల్లేకుండా పోయింది..శవాల గుట్టల మధ్య జీవశ్చవాలుగా మిగిలిన వారి ఆర్తనాదాలు ఆ ప్రణయ ఘోషలో కలిసిపోయాయి.
     
    అవనిగడ్డ(కృష్ణా జిల్లా): దివిసీమ ఉప్పెననకు సరిగ్గా 38 ఏళ్లు. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదిలాడుతూనే ఉన్నారుు.. ఉప్పెన ప్రభావంతో ఉప్పొంగిన సముద్రం అలలు 83 గ్రామాలను జల సమాధి చేశాయి. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం..నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 33 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఉప్పెన ప్రభావానికి దివిసీమలో సుమారు 10 వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు.
     
    ఒక్క నాగాయలంక మండలంలోని సొర్లగొంది గ్రామంలో 714, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460, మూలపాలెంలో 300 మంది చనిపోయినట్లు అధికారుల అంచనాలో తేలింది. ఒక్క దివిసీమలోనే సుమారు రూ.172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కృష్ణాతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఈ ఉప్పెన ప్రభావం కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి. ఉప్పెనలో చిక్కుకున్న వారిని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతదేహాలను గుట్టలుగా వేసి దహన సంస్కారాలు చేశారు.
     
    ఒక్కో కుటుంబంలో నలుగురు నుంచి ఐదుగురు వరకు మృత్యువాత పడ్డారు. ఉప్పెన కారణంగా మృతి చెందిన వారికి గుర్తుగా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో స్మారక స్థూపం నిర్మించారు. నవంబర్ వచ్చిందంటే దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈ నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాన్ సంభవిస్తే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఇలాంటి ప్రళయాలు మళ్లీ రావద్దంటూ సముద్రుడికి తీర ప్రాంతవాసులు నేటికీ పూజలు నిర్వహిస్తారు.
     
    400 మందిని కాపాడిన హంసలదీవి ఆలయం..

     హంసలదీవిలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి దేవాలయం నాటి ప్రళయం నుంచి 400 మంది గ్రామస్తులకు రక్షించింది. ఆనాటి మధ్యాహ్నానికి ఆకాశంలో వచ్చిన మార్పులకు గ్రామంలోని పూరిళ్లు వదిలి గ్రామస్తులంతా ఆలయంలో ఆశ్రయం పొందేందుకు వచ్చారు.సముద్రం ఉప్పొంగిన అలలతో ఊళ్లు, మనుషులు కొట్టుకుపోయినా ఈ దేవాలయంలోకి చుక్క సముద్రం నీరు చేరలేదు. దీంతో వీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు.

    నమ్మలేని నిజాలు
    మృతులు - 10 వేలపైనే
    మృతి చెందిన పశువులు -2.5 లక్షలు
    మృతి చెందిన కోళ్లు - 4 లక్షలు
    కూలిన ఇళ్లు -8,504
    ఆస్తి నష్టం - రూ. 172 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement