పనిమంతులు కొందరే!

Work From Home Results Are Very Less In Hyderabad - Sakshi

ఐటీలో వర్క్‌ ఫ్రమ్‌హోం ఫలితం అంతంతే

0.2 శాతం మంది ఉద్యోగుల్లోనే దక్షతl

99.8 శాతం మందిలో ప్రణాళికా లోపం

16.97 శాతం మందిలో మాత్రమే సవాళ్లు స్వీకరించే నైజం

17 శాతం మందిలో పర్యవేక్షణ ఉంటేనే పనిచేసే గుణం

కరోనా నేపథ్యంలో ‘సై కీ’సంస్థ సర్వే 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’వెసులుబాటు కల్పించాయి. అయితే ఇందులో 0.2 శాతం మంది ఉద్యోగులు మాత్రమే అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నట్లు ‘సై కీ’, ‘మైండ్‌ మ్యాచ్‌’సంస్థల సంయుక్త సర్వేలో వెల్లడైంది. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో 99.8 శాతం మందికి ఇంటి నుంచి పనిచేసే సమర్థత లేదని ఈ పరిశోధనలో తేలింది. ఐటీ రంగానికి చెందిన సుమారు పది వేల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ ఫలితాలను విశ్లేషించారు.
► వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న 99.8 శాతం మంది ఉద్యోగుల్లో కార్యదక్షతకు సంబంధించి ఏదో ఒక లక్షణం లోపించింది. 95 శాతం మందిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, 65 శాతం మందిలో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, 71 శాతం మందిలో ప్రణాళిక, ఆచరణ వంటి లక్షణాలు లేవని తేలింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సామర్థ్యం, బలహీనతలు ఆధారంగా చేసుకుని పనితీరు మెరుగు పరిచేందుకు ఐటీ సంస్థలు ప్రయత్నించాలని కూడా సర్వే తేల్చి చెప్పింది.
► 16.97 శాతం మంది ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని, అలాంటి వారి విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా పని అప్పగిస్తే అద్భుతంగా పలితాలు చూపిస్తారని సర్వే వెల్లడించింది. 17 శాతం మంది ఉద్యోగులకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు కచ్చితంగా మార్గదర్శకత్వం చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న ఇలాంటి వారికి అప్పగించిన పూర్తి చేయించేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని తేలింది. 
► ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 40.42 శాతం ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేసినా వారికి లాజికల్‌ దృక్పథం అవసరం. పనిచేసే క్రమంలో వీరికి తలెత్తే సందేహాలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి వర్క్‌ ఫ్రమ్‌ విధానంలో పనిచేయడం అంతగా సమస్య కాదని సర్వే పేర్కొంది.
► ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగుల్లో 12.7 శాతం మంది సోషల్‌ ఇంటరాక్షన్‌ పేరిట ఇరుగుపొరుగు, బంధుమిత్రులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగని అప్పగించిన పని పూర్తి చేసే సామర్థ్యం లేదని కాదు. ఇలాంటి వారితో అప్పగించిన పని పూర్తి చేయించేందుకు సంస్థ నుంచి రోజూ సంభాషించడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనిలో నిమగ్నమయ్యేలా చూడాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top