ట్రా'వైల్డ్ '

Wildlife Photographers in Oktoberfest In germany - Sakshi

ప్రస్తుతం జర్మనీలో అక్టోబర్‌ ఫెస్ట్‌ జరుగుతోంది. అయితే మనలోచాలా మందికి ఆ ఫెస్ట్‌నే తెలియదు. కానీ  సిటీకి చెందిన మిత్ర బృందం మాత్రం ఇప్పుడు అక్కడే ఉంది. ఇప్పుడే కాదు... తరచూ విదేశీవిహారంలో మునిగి తేలుతోంది. కేవలం టూర్లు చేయడంతోసరిపెట్టుకోకుండా తిరిగి వచ్చాక తమ టూర్‌ విశేషాలతో ఫొటోఎగ్జిబిషన్‌ సైతం నిర్వహిస్తోంది. తద్వారా వచ్చిన ఆదాయాన్నివన్యప్రాణుల సంక్షేమం కోసం అందిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో : ఘడియల్ని పైసలతో కొలిచే మనస్తత్వం. టూర్లు, షికార్లు అంటే టైమ్‌ వేస్ట్‌ వ్యాపకాలని తీసిపారేసే తత్వం.  సింపుల్‌గా... బిజినెస్‌ మెన్‌ అంటే  క్షణం తీరికలేని జీవితం. నగరానికి చెందిన నలుగురు స్నేహితుల బృందం మాత్రం దీనికి అతీతం. రూ.కోట్ల టర్నోవర్‌ ఉండే వ్యాపారాలు చేస్తున్నా... అభిరుచిని మాత్రం అటకెక్కించలేదు. వైల్డ్‌లైఫ్‌ మీ దున్న ఆసక్తితో దేశాలు చుట్టేస్తున్న వీరు... తమ ప్రయాణ ‘చిత్రాల’తో సిటీలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ టీమ్‌ ‘వైల్డ్‌’ టూర్స్‌ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు బృందంలో ఒకరైన బిజినెస్‌ మెన్,  వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీకి పేరొందిన శ్రీనివాస్‌ హేచరీస్‌ యజమాని సురేష్‌ చిట్టూరి.  

ప్రయాణం.. ఓ అవసరం  
వ్యక్తిగతంగా నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే 78 దేశాలు తిరిగాను. త్వరలోనే 100 దేశాలు పూర్తి చేస్తాను. ప్రయాణాలు మన ఆలోచనల్ని మరింత విస్తృతం చేస్తాయి. కొన్నేళ్ల క్రితం ఈ జర్నీలో నాకు మరో ముగ్గురు స్నేహితులు (జీవీ ప్రసాద్‌ – రెడ్డి ల్యాబ్స్‌ సీఈఓ, బి.గౌతమ్‌ – గ్రీన్‌పార్క్‌ హోటల్స్‌ సీఈఓ, గోపిరాజు) తోడయ్యారు. అప్పటి నుంచి వీరితో కలిసి వైల్డ్‌లైఫ్‌ టూర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాను. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు వన్యప్రాణి నివాస ప్రాంతాలను చుట్టేశాం. ముందుగా స్టడీ చేసి కరెక్ట్‌ సీజన్‌ ఎంచుకొని, అకామిడేషన్‌ అరెంజ్‌ చేసుకుంటాం. ఒక్కో చోట కనీసం వారం నుంచి 10 రోజులు ఉంటాం. ఆరేడు సంవత్సరాలుగా టూర్స్‌కి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అంటార్కిటికా వెళ్లాలని ఉంది. అక్కడికి వెళ్లాలంటే 20 రోజులు కావాలి. కానీ అంత టైమ్‌ దొరకడం లేదు.  

యురేకా... దక్షిణాఫ్రికా  
వైల్డ్‌లైఫ్‌ లవర్స్‌కు సిసలైన గమ్యం అంటే సౌతాఫ్రికా అని చెప్పాలి. ఆఫ్రికా అంటే బిగ్‌ఫైవ్‌ చూడ్డానికి వెళ్లాలి అంటారు. అంటే... సింహం, ఏనుగు, బఫెల్లో, రైనోసార్స్, జిరాఫీ అన్నమాట. అక్కడ మనలా చెట్లు అవీ ఉండవు. ఆరేడు అడుగుల ఎత్తులో గడ్డి పెరిగే గ్రాస్‌ల్యాండ్స్‌ బాగా ఉంటాయి. సింహం సహా వివిధ రకాల జంతువులన్నీ అక్కడ పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. ఆవు జాతికి చెందిన ఓ జంతువుల మంద లక్షల సంఖ్యలో ఉంటుంది. టూరిజమ్‌కి ఇది ప్రత్యేక ఆకర్షణ. ఈ జంతువులు సంవత్సరమంతా గుండ్రంగా తిరుగుతాయి. వీటిని సింహాలు, ముసళ్లు పట్టుకొని చంపే ఫొటోలు తీయడం ఒక క్రేజ్‌.  
 
జర్నీ అడిక్షన్‌... లైఫ్‌ ‘విన్‌’  
పుస్తకాలు, చదువు, పని... ఇలా ఏవీ నేర్పని దాన్ని ప్రయాణం నేర్పుతుంది. నా విజయానికి ఈ టూర్స్‌ తిరిగే అడిక్షన్‌ ఒక ప్రధాన కారణం. విభిన్న ప్రాంతాలకు వెళ్లడం వల్ల కొన్ని నమ్మకాలు, సంస్కృతులు మనకు జీవితంపై కొత్త దృక్పథాన్ని అందిస్తాయి. ప్రస్తుతం మన దేశంలో వెజిటేరియనిజమ్‌ని ప్రమోట్‌ చేస్తున్నాం. అయితే అదే సమయంలో ప్రతి జీవమున్న ప్రాణినీ తింటారు జపనీయులు. మరి వాళ్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ మనకన్నా చాలా మెరుగ్గా ఉంటాయి. పాత సంప్రదాయాలు, విశ్వాసాలను ప్రశ్నించడం ఎలా అనేది మనం ప్రయాణాల్లో నేర్చుకుంటాం. కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారైనా ఏదో ఒక కొత్త ప్లేస్‌ చుట్టి రావడమనేది అలవాటుగా మార్చుకోవాలని నా అభిప్రాయం.  
 
భావితరాలూ చూడాలి...
వన్యప్రాణులను భావితరాలూ చూడాలి. వాటి సంరక్షణ చాలా అవసరం. కేవలం జంతువులను చూడడం కోసం టూర్స్‌ వెళ్లి వచ్చేయడం కాకుండా... వాటి మనుగడ కోసం మనం ఏమైనా చేయగలమా అనే ఆలోచనతో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నాం. ట్రిప్‌ వెళ్లి వచ్చినప్పుడల్లా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తాం. వీటిని ఫ్రెండ్స్‌/పరిచయస్థుల కోసం విక్రయిస్తున్నాం. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నాం. ఏటా సుమారుగా రూ.4లక్షల నుంచి రూ.5లక్షల దాకా ఇస్తుంటాం.  

గొరిల్లా... భళా  
కేవలం గొరిల్లాలను చూడ్డానికి రువాండా వెళ్లాం. అక్కడ గొరిల్లాలు తప్ప పెద్దగా ఏమీ లేదు. వాటిని అత్యంత సమీపం నుంచి చూడడం వింత అనుభూతిని అందించింది. మనం ఏమీ అనకపోతే అవి ఏమీ అనవు. ఒక్కోటి 300–400 కేజీల వరకు బరువుంటాయి. ఒకప్పుడు వీటిని రకరకాల అవసరాల కోసం బాగా చంపేసేవారు. అయితే ఇప్పుడు బాగా తగ్గింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంత సంఖ్యలో ఇప్పుడు ఉన్నాయి. మౌంటెయిన్‌ గొరిల్లా, ల్యాండ్‌ గొరిల్లాస్‌ అని రెండు రకాలు ఉంటాయి. ల్యాండ్‌ గొరిల్లాస్‌ వెస్ట్‌ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి.  

ఓర్పు ముఖ్యం..
బిజినెస్‌లో బిజీ ఉండదని కాదు... కానీ ప్లానింగ్, ఆర్గనైజింగ్‌ ఉంటే ఎన్ని పనులన్నా చేయొచ్చు. పెద్ద పెద్ద అనుభూతులు కావాలంటే  చిన్నచిన్నవి పట్టించుకోవడం మానేయాలి. ప్రయాణానికి కావాల్సింది ఓర్పు. ఉదాహరణకి నా వైల్డ్‌లైఫ్‌ పిక్చర్స్‌ కోసం స్పాట్‌కి వెళ్లడానికి ఒకట్రెండు రోజులు పడుతుంది. డేలైట్‌ కోసం వేచి చూడాలి. జంతువు బయటకు వచ్చే వరకు, అది చురుగ్గా మారే వరకు నిరీక్షించాలి. అయితే సరైన షాట్‌ వచ్చినప్పుడల్లా జీవితంలో ఒక మైలురాయిని దాటినట్టే అనిపిస్తుంది.   

కొన్ని టిప్స్‌..
ప్యాకేజ్‌ టూర్స్‌కు దూరమవ్వండి.  
విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇండియన్‌ ఫుడ్‌ కోసం అన్వేషించకండి.  
ఫేస్‌బుక్‌ పేజీ ఉందనిపించే ఏ ప్లేస్‌ అయినా అప్పటికే కరప్టెడ్‌ అని గుర్తించండి.  
పూర్తిగా స్టడీ చేసి మాత్రమే ప్లేస్‌ను ఎంచుకోండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top