మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ జైకిషన్ ఓజా(ఫిజిక్స్), గోపిరెడ్డి లీలావతి(హిందీ), డాక్టర్ ఎ.చంద్రమోహన్(వృక్షశాస్త్రం) పరిశోధనలు చేయడానికి యూజీసీకి దరఖాస్తు చేసుకున్నారు.
మంచిర్యాల సిటీ : మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ జైకిషన్ ఓజా(ఫిజిక్స్), గోపిరెడ్డి లీలావతి(హిందీ), డాక్టర్ ఎ.చంద్రమోహన్(వృక్షశాస్త్రం) పరిశోధనలు చేయడానికి యూజీసీకి దరఖాస్తు చేసుకున్నారు. మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు పథకంలో భాగంగా వారిని వివిధ పరిశోధనలకు అనుమతిస్తూ యూజీసీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో పరిశోధన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.
సకాలంలో పూర్తిచేయాలి..
అధ్యాపక వృత్తికి ముందు చేసిన పరిశోధనలను పరిశీలించాకే యూజీసీ మరోసారి పరిశోధనలకు అనుమతి ఇస్తుంది. ప్రస్తుతం పరిశోధనలకు ఇచ్చిన అవకాశాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలి. పూర్తిచేయనివారు పరిశోధనల నిధులను వడ్డీతో సహా యూజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. కళాశాల సమయంలో కాకుండా సెలవు రోజులను మాత్రమే పరిశోధనలకు కేటాయించుకోవాలి. పరిశోధనలు నిర్ణీత సమయంలో పూర్తి చేయనివారికి కాలపరిమితి పొడిగించరు. వీరికి మరోసారి పరిశోధనలు చేసే అవకాశం ఇవ్వరు. యూనివర్శిటీలో రెగ్యులర్ పీహెచ్‌డీ పరిశోధకులకు గైడ్ ఉంటారు. కానీ కాలేజీలోని పరిశోధకులకు గైడ్ ఉండరు. సలహాలు ఇచ్చేవారూ ఉండరు.
కళాశాలకు గ్రేడింగ్
అధ్యాపకులు యూజీసీ పరిశోధనలకు ఎంపిక కావడంతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు, ఖ్యాతి లభించింది. కళాశాలకు న్యాక్(నేషనల్ అక్రిడేషన్ అండ్ అస్సెస్‌మెంట్ కౌన్సిల్), బెంగళూరు అధికారులు గ్రేడింగ్ ఇస్తారు. ప్రతీ ఐదేళ్లకోసారి న్యాక్ గ్రేడింగ్ ఇస్తుంది. ఈ గ్రేడ్ ద్వారా కళాశాలకు యూజీసీ నుంచి వచ్చే నిధుల మొత్తం పెరగడంతోపాటు పరిశోధనల అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాకుండా కళాశాలకు అదనపు సౌకర్యాలు కల్పించడానికి యూజీసీ సహకరిస్తుంది.
విద్యార్థులకు అవగాహన
అధ్యాపకుల పరిశోధనల ద్వారా ఈ కళాశాలలో చదివే విద్యార్థులూ ప్రయోజనం పొందే అవకాశముంది. వారు సైతం పరిశోధనల వైపు ఆకర్షితులవుతారు. అదనపు పరిజ్ఞానం సమకూరుతుంది. పరిశోధనల పద్ధతులు తెలుస్తాయి. భవిష్యత్తులో ఎంఫిల్, పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు అధ్యాపకుల పరిశోధనలతో అవగాహన ఏర్పడుతుంది. మంచిర్యాల కళాశాల అధ్యాపకులు చేసిన పరిశోధనల్లో సాహిత్యం అంశాలను జాతీయ స్థాయి జర్నల్ అధికారులు, సైన్స్ పరిశోధనలను అంతర్జాతీయ జర్నల్ అధికారులు ముద్రిస్తారు. ముద్రించిన పరిశోధనలను యూనివర్సిటీలకు అందజేయడంతోపాటు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచుతారు.
పదోన్నతి..
డి గ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు యూనివర్సిటీకి పదోన్నతి పొందాలంటే కళాశాల ఆధ్వర్యంలో యూజీసీ నుంచి వచ్చే పరిశోధనలు తప్పనిసరిగా చేయాల్సిందే. పరిశోధనలకు ముందుకు రానివారికి పదోన్నతులు ఉండవు. యూజీసీ ఇచ్చే పరిశోధనలు చాలా కఠినంగా ఉండడంతో డిగ్రీ అధ్యాపకుల్లో చాలామంది ముందుకు రారు. దీంతో డిగ్రీ అధ్యాపకుడిగానే ఉద్యోగ విరమణ పొందుతున్నారు.