లొల్లి.. లొల్లి

TRS Party Conflicts Between Leaders In Warangal - Sakshi

అధికార పార్టీలో లుకలుకలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు బహిర్గతమవుతూనే ఉంది.   గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు, మేయర్‌ నరేందర్‌కు మధ్య విభేదాలు బహిర్గతమైన విషయం తెలిసిందే. నిన్న వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సన్నాహక సమావేశంలో నేతలు, కార్యకర్తలు  ఏకంగా కుర్చీలతో కొట్టుకున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పర్యటనకు టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఓ వర్గం అడ్డుపడింది.  ఇంతకాలం గుంభనంగా ఉన్న వర్గ పోరాటం.. ఎన్నికల సందడి నెలకొన్న వేళ బయటపడుతుండడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. అయినప్పటికీ పార్టీ పెద్దలు నోరు మెదపలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

‘తూర్పు’న పుట్టిన రగడ..
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నన్నపునేని నరేందర్‌ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీలో ఉన్నాడు. ‘తూర్పు’ నుంచి ఎమ్మెల్యే పదవిని ఆశించారు. తీరా రాష్ట్రం ఏర్పడి ఎన్నికలు వచ్చే సమయానికి కొండా దంపతులు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి చేరి ఎమ్మెల్యే టికెట్‌తో పాటు విజయం సాధించారు. అయితే అటు కొండా సురేఖ, ఇటు నరేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నప్పటికీ.. వారు, వారి కార్యకర్తలు వేర్వేరుగానే కొనసాగుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో శంకర్‌ నాయక్‌ మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండగా.. 

అధికారంలోకి వచ్చిన అనంతరం  కాంగ్రెస్‌  నుంచి మాజీ ఎమ్మెల్యే  మాలోతు కవిత, టీడీపీ నుంచి మోహన్‌లాల్‌ గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ.. ఎవరి వర్గాలు వారివే. ఈ సారి  టికెట్‌ కోసం కవిత గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  గ్రామీణ ప్రాంతంలో తన కంటూ ఒక బలమైన కేడర్‌ను  ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రయత్నంలోనే  కేసముద్రం రాగా.. అక్కడి పాత టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. పార్టీలో గ్రూప్‌లను పోత్సహించవద్దని ఆమెతో వాదనకు దిగారు. ఈ సందర్భంలో కవిత కొంత సంయమనం పాటిస్తూ ఉద్రిక్తతను  తగ్గించారు.

నర్సంపేటలో తన్నుకునే స్థాయికి..
వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది.  టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి గుంటుక సోమయ్య, ఆయన అనుచరులు  పార్టీకి అండగా ఉన్నారు.  ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి గటిక అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆయన తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉద్యమ సమయంలో  పని చేసిన వారిని పట్టించుకోవటంలేదని  ఆరోపణలు వచ్చాయి.  రైతు సమన్వయ సమితి గ్రామ, మండల కోఆర్డినేటర్ల నియామకాలు పార్టీ శ్రేణులతో కాకుండా ఇష్టమున్న వారికి కట్టబెట్టారనే ఆగ్రహంతో ఉన్నారు.

ఏకంగా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ల శిక్షణ తరగతులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరైన సమావేశంలో తొలిసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. సమావేశంలో ఎంపీపీ తీరుపై మార్కెట్‌ చైర్మన్‌ గుంటుక సోమయ్య మండిపడ్డారు. అదే స్థాయిలో ఎంపీపీ అజయ్‌కుమార్‌  ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ప్రగతి నివేదన సభ సన్నాహకంలో భాగంగా నెక్కొండ, చెన్నారావుపేట మండలాలకు మార్కెట్‌ చైర్మన్‌ గుంటుక సోమయ్యకు బాధ్యతలు ఇచ్చారు.  కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనను  పక్కన పెట్టి  గద్దల నర్సింగరావుకు అప్పగించారు.  ఈ సంఘటన వివాదాలకు ఆజ్యం పోసింది. డోర్నకల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్, ఆమె మీద కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ వర్గం మధ్య తరుచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్‌ మధుసుదనాచారి, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన గండ్ర  సత్యనారాయణరావు  వర్గాల మధ్య అంతర్గత విభేదాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్‌ మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత కూడా పరిస్థితి అలానే ఉంది. ఇందుకు ఈ ఏడాది జూన్‌లో చిల్పూరుగుట్ట వద్ద సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలో జరిగిన గొడవే నిదర్శనం.

ఎందుకిలా...
ఉద్యమ పార్టీ  నుంచి  రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలోని  తొలి సాధారణ ఎన్నికలను ఎదుర్కొనే వరకు ఏకతాటి మీదనే నడిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గులాబీ’ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌  చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్‌‡్ష ప్రభావితంతో  ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలోనైతే చేరారు కానీ అటు పూర్తిగా టీఆర్‌ఎస్‌తో కలిసి పోలేక, ఇటు  స్వంతంత్రంగా ఉండలేక తండ్లాడుతున్నారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ఉన్న నేతలు కొత్తగా వచ్చిన వారిని దగ్గరకు రానివ్వలేదు. ప్రతిపక్షం నుంచి వచ్చిన నేతలు పాత టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల వద్దకు వెళ్లడం లేదు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకుని నడిపిస్తున్నారు. దీంతో పార్టీ ఒక్కటే అయినా కొత్త బ్యాచ్, పాత బ్యాచ్‌ అని రెండు వేర్వేరు వర్గాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top