
కేంద్రంపై నిందలు తప్పని తేలింది
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ తాజా వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఇంతకాలం కేంద్రప్రభుత్వం, బీజేపీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ తాజా వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా రివర్ బోర్డు ఉత్తర్వు ప్రతిని కూడా సరిగా చదవకుండా కేంద్రంపై అనవసర ఆరోపణలు చేశారని విమర్శించారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కరెంటు ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ సిద్ధంగా ఉందని, వెంటనే ఒప్పందం చేసుకోవాలని కొన్ని నెలలుగా తాము సూచి స్తున్నా పట్టించుకోని కేసీఆర్ 5 నెలల తర్వాత తీరిగ్గా వెళ్లి ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
తెలంగాణ కరెంటు కష్టాలను తీర్చే ఉద్దేశంతో ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం ముందుకు రావటం సంతోషకరమని, కేసీఆర్ ఒప్పందం చేసుకోవటానికి ముందు బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో భేటీ అయి తెలంగాణకు కరెంటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. అక్కడి నుంచి కరెంటు వచ్చేందుకు వీలుగా ట్రాన్స్‌మిషన్ లైన్స్ నిర్మించేలోపు మహారాష్ట్ర నుంచి కరెంటు పొందేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తాము కూడా మహా రాష్ట్ర సీఎంతో చర్చించి సహకరించాల్సిందిగా కోరుతామన్నారు. ఏపీలో విద్యుత్ పంపిణీ వృథా తక్కువగా ఉందని, అది తెలంగాణలో ఎక్కువగా ఉండటానికి కారణాలేంటో పరిశీలించి పరిష్కరించాలని సూచించిన కిషన్‌రెడ్డి... కరెంటు కోతలే సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భావించొద్దని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో వేయి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పాతబస్తీలో విద్యుత్తు చౌర్యం తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని.. ఇక్కడ ప్రతినెలా దాదాపు రూ.30 నుంచి రూ.40 కోట్లు ట్రాన్స్‌కో నష్టపోతోందన్నారు. ఆహార భద్రతాకార్డులు, కొత్త పింఛన్ల విధివిధానాలేంటో ప్రభుత్వం వెల్లడించటం లేదన్నారు. వీటన్నింటిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.